Sonia-Sharmila : సోనియా నాడు దెయ్యం.. నేడు దేవత ఎలా అయ్యింది షర్మిలమ్మ?
అక్రమాస్తుల కేసులో వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పొందుపరిచినట్లు సోనియా గాంధీకి తెలియదని వెనుకేసుకొచ్చారు. నాడు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసిన షర్మిల యేనా అన్న అనుమానం అందరూ వ్యక్తం చేస్తున్నారు.

Sonia-Sharmila : కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అంతులేని స్వేచ్ఛ ఇచ్చింది. అసమ్మతి రాజకీయ నాయకుడిగా ముద్రపడినా అందలమెక్కించింది. నాడు కేంద్ర ప్రభుత్వ సాయంతోనే విచ్చలవిడిగా సంక్షేమ పథకాలను రాజశేఖర్ రెడ్డి అమలు చేయగలిగారు. ప్రజల మనసును గెలవగలిగారు. వారి మనసులో సుస్థిర స్థానం సంపాదించగలిగారు. అదే జగన్ కు వరంగా మారింది. అంటే వైఎస్ కుటుంబం ఎదుగుదల ముమ్మాటికీ కాంగ్రెస్ పుణ్యమే. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత అదే కుటుంబం కాంగ్రెస్ను తులనాడింది. దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు పరిస్థితి తారుమారు అయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో వైఎస్ కుటుంబం యూటర్న్ తీసుకుంది. కాంగ్రెస్ నాయకత్వం వైపు అడుగులు వేస్తోంది.
1985 నుంచి 1999 వరకు కాంగ్రెస్ పార్టీలో వైయస్ కు పట్టు దక్కలేదు. అప్పటివరకు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులపై వైయస్ రాజశేఖర్ రెడ్డి అసమ్మతి జ్వాల వినిపిస్తూనే ఉన్నారు. కానీ అవేవీ పట్టించుకోకుండా సోనియా గాంధీ వైయస్ రాజశేఖర్ రెడ్డిని ప్రోత్సహించడం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు అనుమతి ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం పదవి కట్టబెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ లేకపోతే వైఎస్ లేడు. ఆయనను కాంగ్రెస్ హై కమాండ్ అంతలా ప్రోత్సహించింది. ఆయన పదవిలో ఉండగా కుమారుడు జగన్ విపరీతమైన అవినీతికి పాల్పడినట్లు.. పాల్పడుతున్నట్టు స్పష్టమైన ఆధారాలు కళ్ళ ముందు ఉన్నా.. చూసి చూడనట్టుగా వ్యవహరించింది. అయితే వైయస్ అకాల మరణంతో సీన్ మారిపోయింది.
తండ్రి వారసత్వంగా సీఎం పదవి ఇవ్వలేదన్న కారణంతో జగన్ కాంగ్రెస్ను వీడారు. తన తండ్రి మరణం పై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకత్వాన్ని నిందించారు. ఇతర కుటుంబ సభ్యులు సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గా ఉన్న షర్మిల సైతం తన తండ్రి మరణం పై అనేక రకాల అనుమానాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే షర్మిల కాంగ్రెస్ గూటికి చేరుతుండడం విస్మయ పరుస్తోంది. వైయస్ అంటే కాంగ్రెస్ కి అమితమైన గౌరవం ఉందని.. సోనియా గాంధీ వైయస్ కుటుంబానికి ఎలాంటి ద్రోహం చేయలేదని పంజాగుట్టలోని వైయస్ విగ్రహం సాక్షిగా షర్మిల తాజాగా ప్రకటించారు. అక్రమాస్తుల కేసులో వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పొందుపరిచినట్లు సోనియా గాంధీకి తెలియదని వెనుకేసుకొచ్చారు. నాడు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసిన షర్మిల యేనా అన్న అనుమానం అందరూ వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇన్నాళ్లకు వైయస్ కుటుంబం కాంగ్రెస్ నామస్మరణ చేస్తుండడం విశేషం. అధికారంలో వాటా రాలేదని.. ఆస్తుల్లో వాటా ఇవ్వడం లేదని షర్మిల సోదరుడు జగన్ విభేదించి సోనియాను ఆశ్రయిస్తున్నారని.. అందులో భాగంగానే కాంగ్రెస్ నాయకత్వాన్ని క్లీన్ చీట్ ఇవ్వడం విశేషం. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారం తారుమారైతే జగన్ సైతం షర్మిల బాట పడతారని విశ్లేషకులు భావిస్తున్నారు.
