
దేశంలో సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ ప్రజలపై పంజా విసురుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో భారీ సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. రూపం మార్చుకుంటున్న కరోనా వైరస్ వల్ల కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మరోవైపు కరోనా వైరస్ కు సంబంధించి కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కసారిగా బలహీనత అనిపించినా, అలసటగా మారినా, నీరసంతో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించినా కరోనా కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకుంటే మంచిదని కరోనా నిర్ధారణ అయితే పల్స్, రక్తపోటు, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే మాత్రమే ఆస్పత్రికి వెళ్లాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ అమలు చేస్తుండడంతో కరోనా కేసులు తగ్గుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వీలైనంత వరకు బయట తిరగవలసిన సందర్భాలను తగ్గించుకోవాలని చేతికి గ్లౌజులు వేసుకొని ముఖానికి మాస్క్ ధరిస్తే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. బయట నుండి మీరు ఇంటికి తిరిగి వచ్చాక చేతులను సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలని బయటకు తీసుకెళ్లి , బయట నుంచి తీసుకువచ్చిన వస్తువులను శానిటైజ్ చేయలని వైద్యులు సూచిస్తున్నారు. ఉత్తరాలు, ఇతర పార్సిల్స్ ఏవైనా వస్తే చేతులను శుభ్రం చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అనారోగ్యానికి గురైతే వారు తరచుగా తాకిన వస్తువులను శానిటైజ్ చేసి చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం మంచిది. బయటి నుంచి తెచ్చుకున్న కూరగాయాలు, ఇతర ఆహార పదార్థాలను నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. రెడీమేడ్ ఫుడ్స్, పండ్లు, కూరగాయలు, రొట్టెలు, పాస్తా, కూరగాయలు, పండ్లు అవసరం మేరకు నిల్వ ఉంచుకోవాలి.