తెలంగాణాలో ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో కెసిఆర్ సర్కార్ అలెర్ట్ అయింది. కొవిడ్-19 నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ సమన్వయ కమిటీ ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశం అయింది. కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై మంత్రులు సమీక్ష చేపట్టారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై అదేవిధంగా ప్రజల్లో అవగాహన పెంచడం సహా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులు చర్చిస్తున్నారు.
ఈ సందర్బంగా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ.. కరోనా వైరస్ చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వైరస్ నియంత్రణకు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను సరిపోయేంత మందిని తీసుకుంటామన్నారు. ప్రయివేటు ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేస్తున్నామని మంత్రి చెప్పారు. కరోనా అనుమానితులను ప్రభుత్వ ఆస్పత్రులకు పంపాలని కోరామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రజలకు విశ్వాసం కలిగించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. 9 ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేస్తాయి. ప్రతి శాఖకు ఒక నోడల్ అధికారి ఉంటారని మంత్రి తెలిపారు.
ఈ సమావేశానికి మంత్రి ఈటెలతో పాటు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు హాజరయ్యారు.