Odisha Train Accident: కోర మాండల్ ఘటన ప్రమాదం కాదు.. కుట్రే: రైల్వే మంత్రి కీలక వ్యాఖ్యలు
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి డ్రైవర్ తప్పిదం కాదని చెబుతున్న రైల్వే శాఖ.. ఆ ప్రమాదానికి వేగం కూడా కారణం కాదని వివరిస్తోంది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం తలెత్తినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వే శాఖ చెబుతోంది.

Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇది ప్రమాదం కాదని, సిగ్నలింగ్ వ్యవస్థలో మార్పుల వల్లే ఈ ఘోరం జరిగిందని ఆయన చెప్పడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ” ఎలక్ట్రానిక్ ఇంటర్ లాక్ వ్యవస్థ మార్చడమే ఈ ప్రమాదానికి కారణం. పాయింట్ మిషన్ సెట్టింగులు ఎవరో మార్చారు. వారిని ఇప్పటికే గుర్తించాం. వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ ప్రమాదంపై ఇప్పటికే సిబిఐ విచారణకు సిఫారసు చేసాం. ఈ ఘటనకు సంబంధించి రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు చేశారు. సమగ్రమైన నివేదిక రాగానే అన్ని విషయాలూ తెలుస్తాయి. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో మార్పులు చోటు పాయింట్ మిషన్ సెట్టింగ్లను ఎవరో నేరం వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని” కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెబుతుండడం కలకలం రేపుతోంది.
సిగ్నలింగ్లో సమస్య
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి డ్రైవర్ తప్పిదం కాదని చెబుతున్న రైల్వే శాఖ.. ఆ ప్రమాదానికి వేగం కూడా కారణం కాదని వివరిస్తోంది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం తలెత్తినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వే శాఖ చెబుతోంది. ప్రమాద సమయంలో రైలు గంటకు 128 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని, ఐరన్ ఓర్ లోడుతో ఆగి ఉన్న గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టడం వల్ల కోరమండల్ ఎక్స్ ప్రెస్ పై తీవ్ర ప్రభావం పడింది. అందువల్లే ప్రయాణికులు ఎక్కువ మంది చనిపోయేందుకు, గాయాలపాలయ్యేందుకు కారణమైందని రైల్వే శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఇదే కాకుండా ప్రమాదం జరిగినప్పుడు కోరమాండల్ బోగీలు చెల్లాచెదురై డౌన్ లైన్ లోకి వచ్చి పడ్డాయి. అదే సమయంలో డౌన్ లైన్ లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న హౌరా ఎక్స్ ప్రెస్ చివరి రెండు బోగీలను ఢీకొట్టాయి. అప్పుడు ఈ రెండు రైళ్ల గరిష్ట వేగ పరిమితి కంటకు 130 కిలోమీటర్లు .. అలాంటప్పుడు ఈ వేగం ప్రమాదానికి కారణం కాదని రైల్వే శాఖ వర్గాలు అంటున్నాయి. కవచ్ లాంటి సాంకేతికపరిజ్ఞానం ఉన్నప్పటికీ ప్రమాద నివారణ సాధ్యం కాలేదని రైల్వే శాఖ వర్గాలు అంటున్నాయి.
ఖరగ్పూర్ లో విచారణ
ఇక ఈ ప్రమాదంపై ఆగ్నేయ రైల్వే శాఖకు చెందిన సేఫ్టీ కమిషనర్ సోమ, మంగళ వారాల్లో విచారణ చేపట్టనున్నారు. ఖరగ్పూర్ లోని సౌత్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించే బహిరంగ విచారణకు ప్రయాణికులు, మృతుల కుటుంబాల సభ్యులు, క్షతగాత్రులు హాజరుకావాలని రైల్వే శాఖ కోరింది. ఇక ఈ రైల్వే జోన్ చీప్ ఆపరేటింగ్ మేనేజర్ మూడు నెలల క్రితమే ఈ మార్గంలోని రైల్వే వ్యవస్థలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని హెచ్చరించారు. ఇంటర్ లాకింగ్ వ్యవస్థ వైఫల్యం పై ఫిబ్రవరిలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఎత్తి చూపారు. దీనికి మరింత బలం చేకూర్చుతూ ఒడిస్సా రైలు దుర్ఘటనకు ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో మార్పులే కారణమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి చెప్పడం ఇక్కడ విశేషం.
