Republic Day 2023 Telangana: తెలంగాణ.. పోరాటాలకు దేశానికి ఒక దిక్సూచి.. ఐక్యతకు ఆదర్శం.. అభివృద్ధికి చిరునామా.. ఇదంతా గతం.. తెలంగాణను పాలిస్తున్న కేసీఆర్ కారణంగా రాజ్యాంగం అమలు చేయని దేశంలో రాజ్యాంగం అమలు చేయని రాష్ట్రంగా, కుటుంబ పాలనకు కేరాఫ్‌గా, గవర్నర్‌ను గౌరవించని రాష్ట్రంగా గుర్తింపు పొందింది. కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతున్న రాష్ట్రంగా అపవాదు మూటగట్టుకుంది. ఇదేనా తెలంగాణ ప్రజలు కోరుకున్నది, రాజ్యాంగం అమలుకు, ప్రజాస్వామిక హక్కులకు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి రావడమేనా బంగారు తెలంగాణ అంటే అన్న ప్రశ్న తలెత్తుతోంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర వేడుకలను నిషేధించే దుస్సాహసానికి కేసీఆర్ ఒడిగట్టడం దేనికి సంకేతమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ గానీ, అమెరికాలో చదువుకున్న ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌గానీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉత్పన్నంకాని పరిస్థితి పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పాలకుల తీరుతో సొంత రాజ్యాంగం అమలు చేస్తున్న తీరు సభ్య సమాజం అసహ్యించుకుంటోంది. కల్వకుంట్ల రాజ్యాంగం అమలుపై భారతీయుడిగా తెలంగాణ పౌర సమాజం సిగ్గుతో తల దించుకుంటోంది. ఇందుకేనా తెలంగాణ సాధించుకున్నది అని పాలకులను ప్రశ్నిస్తోంది.

tamilisai, KCR
కుటుంబ ఆధిపత్యాన్ని సహించని సమాజం..
తెలంగాణ వారసత్వ సంపదకు మాత్రమే నిలయం.. వారసత్వ పాలనకు కాదు. 60 ఏళ్ల పాలనతో ఏనాడూ వారసత్వ రాజకీయాలను తెలంగాణ సమాజం సహించలేదు. కానీ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వారసత్వ రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కేటీఆర్, హరీశ్‌రావును మంత్రిని చేయడం, సంతోష్‌రావు, కల్వకుంట్ల కవితరావును ఎంపీ, ఎమ్మెల్సీ చేయడమే ఇందుకు నిదర్శనం. ఇక ఎర్రబెల్లికి మంత్రిపదవి ఇవ్వడం దొరస్వామ్యానికి నిదర్శనం. 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సమాజం ఏనాడు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించలేదు. నాయకత్వ లక్షణాలు, పాలన దక్షత ఆధారంగానే పట్టం కట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లా ఏ ముఖ్యమంత్రి కూడా తన కుటుంబ సభ్యులకు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టలేదు. తన కుటుంబ సభ్యులకు రాజ్యాంగ పదవుల కోసం పాకులాడలేదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ నాయకుడిగా అధికారం ఇస్తే సొంత రాజ్యాంగం అమలు చేయడంపై ప్రతీ పౌరుడు ఎందుకు గెలిపించామా అని అసహ్యించుకునేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారు.
రాజ్యాంగ హక్కుల కోసం కోర్టును ఆశ్రయించాల్సిందే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ పరమైన హక్కులకు ఎక్కడా భంగం వాటిల్లలేదు. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించారు. కానీ తెలంగాణ వచ్చాక పరిస్థితి మారింది. ప్రజలు వరుసగా అధికారం ఇచ్చారని పాలకుల్లో అహంకారం పెరిగిపోయింది. భారత రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిందిపోయి సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారు. కేంద్రం ఆదేశాలను ఎక్కడా అమలు చేయడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ ప్రత్యేక దేశం అన్నట్లుగా కల్వకుంట్ల ఫ్యామిలీ వ్యవహరిస్తోందన్న అభిప్రాయం తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతోంది.
అన్నిటికీ చైనా, పాకిస్థాన్‌తో పోలిక..
తెలంగాణ పాలకులు భారత దేశంలో ఉంటూ ప్రతీ విషయంలో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌తో పోల్చుకుంటున్నారు. అలా అని ఆ దేశాలకంటే మనం తక్కువగా ఉంటామా అంటే అదీ లేదు. కానీ కల్వకుంట్ల కుటుంబం మాత్రం ఎక్కడా లేని లెక్కలు.. ప్రాధ్యాత లేని సర్వేలు తెలంగాణలో ప్రచారం చేస్తూ సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారు. అంబేద్కర్ ర చించిన రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను ఏనాడు గౌరవించని దొరలు ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని మాట్లాడడం అందరికీ హాస్యాస్పదంగా మారింది. తమకు చేతకాని, దళితుడు రాశాడని గౌరవించని, నమస్కరించని రాజ్యాంగం అమలు చేయని దొరలు.. తాము చెప్పిందే వేతం.. తాము అమలు చేసిందే రాజ్యాంగం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సమాజం ఈ విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తోంది. అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి, సెక్రటేరియేట్ నిర్మాణానికి పట్టిన సమయాన్ని బేరీజు వేస్తోంది. ఎస్సీ సబ్‌ప్లాన్ అమలులో ఆర్థిక ఇబ్బందల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానంలో ఉంటే.. ధనిక రాష్ట్రం తెలంగాణ స్థానం కోసం జాబితాలో వెతుక్కోవాల్సిన పరిస్థితి. దళిత అనే పదాన్నే సహించలేని దొర పాలనలో తెలంగాణ దళిత సమాజం పరిస్థితి ఊహించుకుంటేనే భయమేస్తోంది.

tamilisai
అన్నీ నిజాం ఆలోచనలే..
కేసీఆర్ నిజాం కాలం నాటి ఆలోచనలతో పాలన చేస్తున్నారని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. కల్వకుంట్ల కుటుంబం కారణంగా తెలంగాణ పరువు, గౌరవం పోతుందని ఆరోపించారు. ప్రభుత్వ చర్యల కారణంగా తెలంగాణ రాష్ట్రం నవ్వులపాలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం కోసమే కల్వకుంట్ల కుటుంబం తపిస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌వి దుర్మార్గపు ఆలోచనలు అని మండిపడ్డారు. ప్రధాని, గవర్నర్ వస్తే కనీసం గౌరవం చూపడం లేదని విమర్శించారు. దేశానికో విధానం, తెలంగాణకు ఓ విధానం ఉండదని.. తెలంగాణ సర్కార్ తీరును ఖండిస్తున్నానని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు కొన్ని కనీస గౌరవ, మర్యాదలను పాటించాల్సి ఉందని.. ఈ విషయం కేసీఆర్ ప్రభుత్వం గుర్తించడం లేదని అన్నారు.