Congress Vijayabheri Sabha: కాంగ్రెస్ విజయభేరికి.. తెలంగాణ జనం విజయోస్తు
ఇలా విజయభేరి సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో హర్షం వ్యక్తమవుతోంది. తమ సభకు జనం ఎంతగా వస్తారని ఊహించలేదని, ఇది మేము అధికారంలోకి వచ్చేందుకు జనం ఇస్తున్న సంకేతం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.

Congress Vijayabheri Sabha: దారులన్నీ అటువైపే. బస్సులు,కార్లు,జీపులు,కాలినడకన.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు తుక్కుగూడ కు వెళ్లిపోయారు. ఎటు చూసినా జనసంద్రం. ఇసుకేస్తే రాలనంతగా ప్రజాసంద్రం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి విజయవంతమైంది. జనం విజయోస్తు పలకడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. కాంగ్రెస్ అంచనాలకు మంచి సభ విజయవంతమైంది. తుక్కు గూడ, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాలు మొత్తం జన ప్రవాహంగా మారిపోయాయి. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక కమిటీలను నియమించడంతో జన సమీకరణ అత్యంత సులభమైంది. జనం భారీగా రావడంతో ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సభా ప్రాంగణం సాయంత్రం 6 గంటలకు జనంతో నిండిపోయింది. సభకు వచ్చే వాహనాలను సుదూర ప్రాంతంలో నిలిపివేయడంతో చాలామంది కాలినడకన విజయభేరి ప్రాంగణానికి చేరుకున్నారు. సాయంత్రం ఏడు గంటల వరకు కూడా జనం వస్తుండడంతో.. అప్పటికే ఆ ప్రాంగణం మొత్తం జనంతో నిండిపోవడంతో వారంతా బయటనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఇలా విజయభేరి సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో హర్షం వ్యక్తమవుతోంది. తమ సభకు జనం ఎంతగా వస్తారని ఊహించలేదని, ఇది మేము అధికారంలోకి వచ్చేందుకు జనం ఇస్తున్న సంకేతం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఇక సభలో కాంగ్రెస్ ప్రకటించిన హామీలు.. సభకు హాజరైన వారిని, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆరు హామీల్లో మూడింటిని సోనియాగాంధీ ప్రకటించగా.. మిగతా మూడు హామీలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. సోనియాగాంధీ మూడు హామీలను ప్రకటించి వెంటనే సభా వేదిక నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ సుదీర్ఘంగా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, ఎంఐఎం పై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నంత సేపు జనం కేరింతలు కొట్టారు. రెండు నెలల క్రితం కాంగ్రెస్ ఖమ్మంలోనే వహించిన బహిరంగ సభలో గద్దర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకొని తన అభిమానాన్ని చాటుకున్నారు. గద్దర్ కన్నుమూసిన నేపథ్యంలో సభా వేదికపై ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ పై తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞత తెలుపుతూ గద్దర్ ఆలపించిన ప్రత్యేక గీతాలు వీడియోలు ప్రదర్శించారు. సభలో రాహుల్ ఎక్కువసేపు ప్రసంగించారు. ఇక ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రసంగానికి ప్రజల నుంచి ఎక్కువ స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుంభకోణాలను ఆమె లెక్కలతో సహా వివరించారు. ఈ ప్రసంగం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది.
విజయభేరి సభకు లక్షలాదిగా జనం రావడంతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలను అభినందించారు. “వెల్ డన్ అచ్చా కియా” అంటూ మెచ్చుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరిన సోనియా గాంధీ.. రోడ్డు మార్గంలో దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభకు వచ్చిన జనాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సభలో పాల్గొన్న హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ముఖ్య మంత్రులు సుఖ్విందర్ సింగ్, అశోక్ గెహ్లాట్ సంతోషం వ్యక్తం చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా సభా వేదికపై అటు ఇటు తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. జనం ఈ స్థాయిలో రావడానికి కృషి చేసిన రేవంత్ రెడ్డి, ఇతర పార్టీ ప్రముఖులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా అభినందించింది.
