Telangana Congress: అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు.. 42 మందికి టికెట్ ఖరారు
వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలిపే అభ్యర్థులపై గురు, శుక్రవారాల్లో సుదీర్ఘంగా కసరత్తు చేసిన కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ.. 42 సీట్లలో పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాబితాను శనివారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించనున్నట్లు సమాచారం.

Telangana Congress: అంతర్గత స్వాతంత్రం, వ్యక్తిగత స్వేచ్ఛ అధికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చినప్పటికీ అధికారంలోకి రాక నానా ఇబ్బందులు పడుతున్న ఆ పార్టీ.. వరుస ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నట్టు తెలుస్తోంది. నేతల మధ్య సమన్వయం పెరగడం, ఇష్టాను సారంగా మాట్లాడకపోవడం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకు పెద్దపీట వేయడం.. వంటి మార్పులతో కాంగ్రెస్ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. పార్టీకి సంబంధించిన జాతీయ స్థాయి సమావేశాలను, జాతీయ స్థాయి నాయకులతో భారీ సభలు నిర్వహించి తెలంగాణ ఎందుకు ప్రత్యేకమో చెబుతోంది. అయితే ఎన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో గెలిస్తేనే అధికారం వస్తుంది కాబట్టి.. ఆ అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి భారత రాష్ట్ర సమితి ముందుగానే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. వారికి దీటైన స్థాయిలో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపినట్టు తెలుస్తోంది. అయితే అసంతృప్తులు చెలరేగకుండా ఉండేందుకు తొలి జాబితాలో 42 మందికి టికెట్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలిపే అభ్యర్థులపై గురు, శుక్రవారాల్లో సుదీర్ఘంగా కసరత్తు చేసిన కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ.. 42 సీట్లలో పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాబితాను శనివారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించనున్నట్లు సమాచారం. అత్యున్నత నిర్ణాయక మండలి అయిన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆమోదం అనంతరం ఈ వారంలోనే తొలి జాబితాను విడుదల చేసేందుకు ఆస్కారం ఉన్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం రాత్రి ఒంటి గంట వరకు, శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల జాబితాపై కసరత్తు జరిగింది. గెలుపు అవకాశాలపై సునీల్ కనుగోలు, ఇతర సంస్థల సర్వే నివేదికలు, సామాజిక సమీకరణాల ఆధారంగా సుదీర్ఘ కసరత్తు చేసిన కమిటీ.. ఏకాభిప్రాయం వచ్చిన 42 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వీటిని శనివారం కేంద్ర ఎన్నికల కమిటీకి ఇస్తుందని, సీడబ్ల్యూసీ ఆమోదంతో ఈ వారంలోనే తొలి జాబితా విడుదల కానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. మరో 35 సీట్లలో ఇద్దరు నుంచి ముగ్గురు పోటీదారులు ఉన్నారని, వాటిపైనా సమీక్ష చేసి మలి జాబితాగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. చేరికలు, వామపక్షాలతో పొత్తులపై స్పష్టత వచ్చిన తర్వాత మిగిలిన సీట్లపైన సమీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది. పలు నియోజవర్గాలలో ఎక్కువమంది బలమైన నేతలు పోటీ పడుతుండడంతో సరైన అభ్యర్థి ఎంపికకు పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నేతల మధ్య వాగ్వాదం జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా రేవంత్, ఉత్తమ్ మధ్వ సంవాదం జరిగినట్లు చెప్పాయి. సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపికను రేవంత్ ప్రతిపాదించగా.. కొత్తగా వచ్చిన వారిని బలమైన అభ్యర్థులుగా చిత్రీకరిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించినట్లు తెలిపాయి. అయితే కొంతమంది నేతలు సముదాయించడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మెత్తబడ్డారని తెలుస్తోంది. “పాత నాయకులా, కొత్త నాయకులా అని చూడద్దు. అధికారంలోకి రావడమే మన లక్ష్యం అయినప్పుడు ఇవన్నీ పట్టించుకోవద్దు. నేతలు ఎవరైనా సరే వారు మన పార్టీ సభ్యులు కాబట్టి గౌరవించుకోవాలి. ప్రత్యర్థి పార్టీ విజయం సాధించకుండా చూడాలి.. ఇదే సమయంలో పార్టీ అధికారంలోకి రావాలి. అలాంటప్పుడు మార్పును అంగీకరించాల్సిందే. ఇలా కాకుండా అడ్డు పుల్లలు వేస్తే మొదటికే మోసం వస్తుందని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
