Congress 6 Guarantees: ఆ “ఆరింటిని” నమ్ముకున్న కాంగ్రెస్..
తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికలకుగాను ఆరు గ్యారెంటీలను విజయభేరి సభలో సోనియాగాంధీ ప్రకటించారు. లక్షల మంది హాజరైన ఈ సభలో ఆమె గర్వంగా ఈ వివరాలు ప్రకటించారు.

Congress 6 Guarantees: దేశమంతా అధికారం క్రమక్రమంగా తగ్గిపోతుంది. చేతిలో రాజస్థాన్, చతిస్గడ్, హిమాచల్ ప్రదేశ్ మాత్రమే ఉన్నాయి. అధినాయకత్వంపై పార్టీ క్యాడర్ కు నమ్మకం సడలిపోతున్న వేళ కర్ణాటక రూపంలో కాంగ్రెస్ కు జవసత్వం లభించింది. ఆ విజయం ఇచ్చిన ఊపు ఇండియా కూటమికి దారులు వేసింది. అయితే కర్ణాటకలో తమను గెలిపించిన ఆరు హామీలను మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ సంకల్పించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలోని తుక్కుగూడ ప్రాంతంలో సోనియాగాంధీ అధ్యక్షతన ఇక్కడి స్థానిక నాయకత్వం విజయభేరి పేరుతో సభ నిర్వహించింది.
ఆరు గ్యారెంటీలు
తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికలకుగాను ఆరు గ్యారెంటీలను విజయభేరి సభలో సోనియాగాంధీ ప్రకటించారు. లక్షల మంది హాజరైన ఈ సభలో ఆమె గర్వంగా ఈ వివరాలు ప్రకటించారు. వచ్చే ఎన్నికలకు కిక్ స్టార్ట్‌గా ఈవెంట్‌ను వాడుకున్నారు.. 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో విజయభేరి సభ అనంతరం కాంగ్రెస్ ఎంపీలంతా ఢిల్లీకి బయలు దేరి వెళ్ళారు. మిగిలిన సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ, సీఎల్పీ నేతలు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు.. ఒక్కొక్కరు ఒక్కో నియోజకవర్గం చొప్పున తెలంగాణలోని 115 నియోజకవర్గాలకు బయలుదేరి వెళ్లారు. రాత్రి తమ తమ నియోజకవర్గాల్లో బస చేసిన నాయకులు.. సోమవారం నుంచి ఇంటింటికి గ్యారెంటీ కార్డులు పంపిణీ చేయనున్నారు. ప్రతి ఇంటికీ సోనియా ప్రకటించిన 6 గ్యారెంటీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రూపొందించిన చార్జిషీట్లను పంచుతారు.
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాయి. అయితే ఈ హామీలనే తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ప్రతినెల 2500, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నారు. రైతు భరోసా పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం పెట్టుబడి సహాయం కింద రైతులకు 15000 వరకు ఇస్తారు. ఇందులో కౌలు రైతులకు కూడా భాగస్వామ్యం ఉంటుంది. వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయల చొప్పున ఇస్తారు. ఇక వరి పంటకు 500 రూపాయలను బోనస్ గా ఇస్తారు. గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఆ 200 లోపు యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ఐదు లక్షలు అందిస్తారు. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని అందిస్తారు. యువ వికాసం పథకం ద్వారా విద్యార్థులకు ఐదు లక్షల చొప్పున విద్యా భరోసా కార్డు అందిస్తారు.. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో పాఠశాలలను ఏర్పాటు చేస్తారు. చేయూత పథకం ద్వారా వృద్ధులకు, దివ్యాంగులకు నెలవారి పింఛన్ 4000 వరకు చెల్లిస్తారు. దారిద్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 10 లక్షల కు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా సౌకర్యం కల్పిస్తారు. అయితే ఈ ఆరు హామీలు కర్ణాటక రాష్ట్రంలో తమకు విజయాన్ని కట్టబెట్టిన నేపథ్యంలో.. వీటినే కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది. ప్రతి ఇంటికి ఈ ఆరు గ్యారెంటీ కార్డులను పంపిణీ చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తమ విజయానికి బాటలు పరుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ఆరు హామీలను సభలో సోనియా గాంధీ చదువుతున్నప్పుడు ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
