YCP Leaders: ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే ఎగిరి గంతేయని వారు ఎవరుంటారు. అప్పో సప్పో చేసి మరీ పోటీ చేస్తారు. ఎట్టాగైనా ఎమ్మెల్యే అనిపించుకోవాలని తహతహలాడుతారు. కానీ ఆ పార్టీలో పోటీ చేయాలంటే బెదిరిపోతున్నారు. మాకొద్దంటే మాకొద్దంటూ ఆమడదూరం పారిపోతున్నారు. ఇంతకీ ఆ పార్టీ ఏది ? ఆ నేతలు ఎవరనుకుంటున్నారా ? స‌్టోరీ చదివేయండి మరి.

YCP Leaders
ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ వైసీపీలో ఎన్నడూ లేని నిరాశ నిస్పృహ మొదలైంది. 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఇస్తే వారసులకు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. టికెట్ ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. ఎలాంటి బాధలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో గ్రామాల్లో పర్యటించాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని జగన్ ఎమ్మెల్యేలకు గీతోపదేశం చేశారు. కానీ కొందమంది మాత్రమే జగన్ చెప్పినట్టు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది లేదని జగన్ ప్రకటించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ ను బట్టే టికెట్ కేటాయిస్తామని చెబుతున్నారు. అందుకు అనుగుణంగా ఐప్యాక్ సంస్థతో సర్వే చేయిస్తున్నారు. బ్యాడ్ రిపోర్ట్ ఉన్న ఎమ్మెల్యేలకు సరిదిద్దుకోవాలంటూ హెచ్చరిక కూడ చేశారు. కానీ ఎమ్మెల్యేలు జగన్ హెచ్చరికల్ని లైట్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధానం కారణం గెలిచినా పెద్దగా ఒరగబెట్టేదేమీ లేదు అన్న ఆలోచన ఎమ్మెల్యేల్లో ఉందట. అందువల్లే జగన్ హెచ్చరికల్ని భేఖాతరు చేస్తున్నారట. మరికొందరు మాత్రం ఇస్తే తమకే ఇవ్వాలి, మరో గత్యంతరం లేదు అన్న ధీమాతో జగన్ మాటల్ని లైట్ తీసుకుంటున్నారట.

YCP Leaders
ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు సన్నిహితుడు. సమీప బంధువు. కానీ ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి విముఖంగా ఉన్నారని తెలుస్తోంది. తన స్థానంలో తన కొడుక్కి టికెట్ ఇవ్వాలని చెబుతున్నారట. కానీ జగన్ మాత్రం ససేమిరా అంటున్నారని సమాచారం. తన స్థానంలో మహిళల కోటాల తన భార్యకు టికెట్ వస్తుందని ఇప్పటికే ఆయన కార్యకర్తలకు చెబుతున్నారు. బాలినేని ఇంత తొందరగా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి గల కారణాలు తెలియరావడం లేదు. జగన్ పట్ల ఏమైనా వ్యతిరేకంగా ఉన్నారా ? లేదా ఇతర కారణాలు ఉన్నాయా ? అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది.
శ్రీకాకుళం నేతలు కూడ వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని జగన్ కు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టికెట్ ఇస్తే ఒకే.. లేదంటే నో రిగ్రెట్ అంటూ బహిరంగంగా విముఖత వ్యక్తం చేశారు. అవకాశం దొరికితే వంసత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడ జరుగుతోంది. ఒకవైపు 175 సీట్లు గెలుస్తామని నమ్మకంగా వైసీపీ చెబుతోంది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసిన ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చేయాలంటే జంకుతున్నారు. దీన్ని బట్టి చూస్తే వైసీపీ అధిష్టానం రాంగ్ ప్రొజెక్షన్స్ తో ఉందని అర్థం అవుతోంది. ఎమ్మెల్యేలు పోటీకి భయపడుతున్నారంటే.. ఓడిపోతామనే భయమైనా ఉండాలి. లేదంటే గెలిచినా ఉపయోగం లేదనే నిరాశ అయినా ఉండాలి. మరి వైసీపీ ఎమ్మెల్యేలకు ఏ అభిప్రాయం ఉందో వారికే తెలియాలి.