CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ ది ప్రస్తుతం చిత్త శివుడి మీద.. భక్తి చెప్పుల మీద అన్నట్టు ఉంది. ఈరోజు మహబూబ్ నగర్ వెళ్లినా ఆయన పాత పాటే పాడారు. మోడీ నన్ను హింసిస్తున్నాడు.. మీ దయ ఉంటే ఢిల్లీ ఏలుతాను.. మోడీ దెబ్బకు 3 లక్షల కోట్లు నష్టపోయాం.. ఇప్పటికైనా ప్రజలు తనకు మద్దతు తెలిపాలి అంటూ సెంటిమెంట్ రాజేశారు. తెలంగాణ రాష్ట్రం మోడీ సర్కార్ వల్ల తీవ్రంగా నష్టపోతోందని కేంద్ర ప్రభుత్వ విధానాలను.. తనపై ప్రయోగిస్తున్న దాడులను ఏకరువు పెట్టారు. తన సర్కార్ ను కూల్చడానికి మోడీ పన్నాగాలు పన్నుతున్నాడని.. కూలుస్తానని బహిరంగంగా అంటున్నాడని వాపోయాడు.
మహబూబ్ నగర్ కలెక్టరేట్ ప్రారంభం అన్నది తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం. ఇక్కడ మెడికల్ కాలేజీ ఇతర విషయాలన్నవి కేవలం ఆ జిల్లాకు సంబంధించినవి. కానీ ఇవన్నీ పక్కనపెట్టిన కేసీఆర్ మోడీనే టార్గెట్ చేశారు. మోడీ తనను రాచి రంపాన పెడుతున్నాడని.. జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలంటే పాలమూరు ప్రజల ఆశీర్వాదం కావాలంటూ వేడుకున్నారు.
విశేషం ఏంటంటే.. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నారు. అందుకే ఇప్పుడు అదే స్ఫూర్తితో పాలమూరు ప్రజలు తోడుంటే జాతీయ రాజకీయాల్లో ముందుకెళతానంటూ కేసీఆర్ సెంటిమెంట్ రాజేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఆగిపోయింది కేసీఆర్ సర్కార్ వద్ద డబ్బులు లేక అన్నది వాస్తవం. కాళేశ్వరం కోసం మొత్తం డబ్బులు పెట్టేసిన కేసీఆర్ గల్లాపెట్టే ఖాళీ అయ్యింది. కానీ ఇప్పుడు తెలంగాణలో కేవలం ఈ పాలమూరు ప్రాజెక్ట్ మాత్రమే మిగిలి ఉందని.. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదంటూ కేసీఆర్ ఈ నెపాన్ని కూడా మోడీపై వేశాడు.
ఓవరాల్ గా కేసీఆర్ ప్రసంగం చూస్తే ఢిల్లీపై ఆయనకు కోరిక కలిగినట్టు అర్థమవుతోంది. కేసీఆర్ ఢిల్లీ వెళ్లాలంటే అడ్డు మోడీనే. అందుకే ఆయనపైనే మొత్తం నెపం నెట్టేశారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలోనూ మోడీనే విలన్ ను చేసేశారు.