YSR Death Anniversary: వైఎస్ కు నివాళి : జగన్, షర్మిల వేరువేరుగానే.. తల్లి విజయలక్ష్మీ లేదు.. ఏం జరుగుతోంది?
తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పేరిట పార్టీ పెట్టుకున్న షర్మిల కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రానికే ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల తల్లి విజయమ్మతో కలిసి శనివారం ఉదయం రాజశేఖర్ రెడ్డి కి నివాళులర్పించారు.

YSR Death Anniversary: వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, ఆత్మీయులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే గతానికి విరుద్ధంగా వైయస్ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం విశేషం. సీఎం జగన్ తో పాటు షర్మిల, వైయస్ ఆత్మ కెవిపి రామచంద్రరావు కుటుంబ సభ్యులు సైతం ఇడుపులపాయ వచ్చి ఆ మహానేతకు నివాళులర్పించడం, విభిన్నంగా వ్యాఖ్యానించడం ప్రత్యేక పరిస్థితులను సంతరిస్తోంది.
తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పేరిట పార్టీ పెట్టుకున్న షర్మిల కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రానికే ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల తల్లి విజయమ్మతో కలిసి శనివారం ఉదయం రాజశేఖర్ రెడ్డి కి నివాళులర్పించారు. ఆమె వెంట వైయస్ కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు. తన తెలంగాణ వైఎస్సార్సీపీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సోనియా గాంధీ తో పాటు కాంగ్రెస్ పెద్దలను కలుసుకున్న ఆమె కీలక చర్చలు జరిపారు. ఢిల్లీ నుంచి నేరుగా ఇడుపాల పాయకు చేరుకున్నారు. తండ్రి వర్ధంతి సందర్భంగా పార్టీ విలీనే ప్రక్రియను ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ఇది సరైన వేదిక కాదని షర్మిల పత్రికా ముఖంగా ప్రకటించారు.తన తండ్రి పాలనను ఔదార్యాన్ని గుర్తు చేశారు.
సీఎం జగన్ శనివారం ఉదయం ఇడుపాల పాయకి వచ్చి నివాళులర్పించారు. ఆయన వెంట వైసీపీ శ్రేణులు ఉన్నాయి. అయితే ఈసారి జగన్ వెంట తల్లి విజయమ్మ లేకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో జగన్ భావోద్వేగ ప్రకటన చేశారు. “నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా..” అంటూ ట్విట్ చేశారు.
వైయస్ కుటుంబంలో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఎవరికీ వారుగా నివాళులర్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే సమయంలో వైఎస్ ఆత్మగా పేర్కొన్న రామచంద్రరావు కుటుంబ సభ్యులు పులివెందుల వచ్చి నివాళులర్పించడం ఈసారి ప్రత్యేకత. షర్మిలను కాంగ్రెస్ గూటిలోకి చేర్చడంలో రామచంద్ర రావు పాత్ర ఎక్కువగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో.. ఈసారి వారి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగడం విశేషం. అయితే మహానేత వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబంలో ఎన్నడూ లేనంతగా విభేదాలు కూడా చూపడం అభిమానులను ఆందోళనలో ముంచుతోంది. మున్ముందు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయం వారిలో వెంటాడుతుంది.
