Anil Kumar Yadav: అనిల్ ను సైడ్ చేస్తున్న జగన్
అనిల్ దూకుడే ఆయన ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రధాన కారణం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనిల్ కు మంత్రి పదవి దక్కింది. కానీ పదవితో పాటు దూకుడు తనం కూడా ఎక్కువైంది.

Anil Kumar Yadav: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు పొమ్మన లేక పొగ పెడుతున్నారా? ఒక పద్ధతి ప్రకారం ఆయన్ను సైడ్ చేస్తున్నారా? నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితికి ఆయనే కారణమా? వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ కూడా కష్టమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.తాను జగన్ పొమ్మన్నా.. పార్టీ నుంచి వెళ్లనంటూ ఇటీవల అనిల్ ప్రకటనలు చేస్తున్నారు. పార్టీలో పరిస్థితులు అన్నీ తెలిసే అనిల్ అటువంటి ప్రకటనలు చేస్తున్నారని వైసీపీలోనే టాక్ ప్రారంభమైంది. అనిల్ కు ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ తో జగన్ చెక్ చెబుతున్నారన్న ప్రచారం నెల్లూరు ఉధృతంగా సాగుతోంది.
అనిల్ దూకుడే ఆయన ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రధాన కారణం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనిల్ కు మంత్రి పదవి దక్కింది. కానీ పదవితో పాటు దూకుడు తనం కూడా ఎక్కువైంది. రాజకీయ ప్రత్యర్థులపైనే కాకుండా సొంత పార్టీనేతలను కూడా చులకన చేసిన సందర్భాలున్నాయి. అధినేత జగన్ అండగా ఉన్నారన్న ఒకే ఒక కారణంతో తోటి ఎమ్మెల్యేలపై ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. దీంతోజగన్ తమకు మంత్రి పదవి ఇవ్వలేదన్న బాధ కంటే..అనిల్ వ్యాఖ్యలే వారికి బాధించాయి. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వారంతా బయటకు వెళ్లేందుకు కారణం కూడా అనిల్ కుమార్ యాదవేనంటూ ఒక టాక్ ఉంది.
అతి ప్రవర్తనతో అనిల్ నెల్లూరులో అందర్నీ దూరం చేసుకున్నారు. అయితే టైమ్ చూసి జగన్ కూడా దెబ్బేశారు. మంత్రి పదవి తొలగించి కాకాణి గోవర్దన రెడ్డికి అప్పగించారు.. దీంతో నెల్లూరులో రాజకీయం మారింది. అనిల్ బాబాయ్ రూప్ కుమార్ కు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. ఆయన డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. అనిల్ అనుచురలులంతా రూప్ కుమార్ వైపు వెళ్లిపోయారు. వారంతా అనిల్ కి వ్యతిరేక వర్గంగా మారారు. నెల్లూరు అర్డన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తో కూడా అనిల్ కి సఖ్యత లేదు. దీంతో అనిల్ దాదాపు ఒంటరివాడయ్యాడు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు కనీసం టికెట్ వస్తుందా? లేదా? అన్న అనుమానాలున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే అనిల్ స్వయంగా టికెట్ విషయంలో కొన్నిరకాల వ్యాఖ్యలు చేసారు. తనకు టికెట్ ఇవ్వనని సీఎం జగన్ చెప్పినా.. తాను గెటౌట్ అన్నా కూడా పార్టీనుంచి వెళ్లిపోను అని తేల్చిచెప్పారు. ప్రస్తుతానికైతే నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి రూప్ కుమార్ కు టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదంతా ప్లాన్డ్ గానే హైకమాండ్ చేస్తోందని తెలిసినా ఏమీ చేయలేని స్థితిలో అనిల్ ఉన్నారని ప్రచారం సాగుతోంది.
