CM Jagan: ‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్టుంది జగన్ సర్కారు దుస్థితి. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన జగన్… పరిశ్రమల నిర్వహణలో ఎదురయ్యే ఒడిదుడుకులు తెలుసు. పరిశ్రమలపై ఆధారపడే కార్మిక, ఉద్యోగుల ఇతి బాధలు తెలుసు. అయినా తన రాజకీయం కోసం ఏపీలో పారిశ్రామికాభివృద్దితో వికృత క్రీడ ఆడుతున్నారు. కొత్త పరిశ్రమలను తేలేక వైఫల్యం చెందుతున్నారు. రాజకీయ కక్షతో ఉన్న పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారు.అమెరికాలో సుఖంగా ఉండే జీవితాన్ని వదులుకొని.. తామొక్కరే సుఖం ఉంటే చాలదని.. పుట్టిన ప్రాంతం వారు కూడా సుఖంగా ఉండాలన్న తలంపుతో చిత్తూరు జిల్లాలో అమర్ రాజా మోటార్ వాహనాల బ్యాటరీ సంస్థను నెలకొల్పారు గల్లా వంశీయులు. పరిశ్రమను అంచెలంచెలుగా అభివృద్ధి చేసి వేలాది మందికి.. వేలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. అటువంటి పరిశ్రమ ఇప్పుడు తెలంగాణకు తరలిపోతుందంటే అది జగన్ ప్రభుత్వ చర్యల ఫలితమే.

CM Jagan
వాస్తవానికి అమర్ రాజా పరిశ్రమ ఇతర ప్రాంతాలకు తరలిస్తారన్న ప్రచారం బిజినెస్ వర్గాలో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. దానిపై స్పందిచే క్రమంలో మన డిఫెక్టో సీఎం సజ్జల రామక్రిష్ణారెడ్డి విపరీత వ్యాఖ్యానాలు చేశారు. తనకున్న సకల శాఖ మంత్రి హోదాలో కక్ష సాధింపులకు ప్రణాళిక వేసే సజ్జల వారు.. వారు తరలిపోవడం ఏమిటి? మేమే తరిమేస్తామన్న రీతిలో మాట్లాడారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వారు వెళ్లడం కాదు.. మేమే దండం పెట్టి వెళ్లిపోమన్నామంటూ వ్యాంగ్యోక్తులు సంధిస్తూ కామెంట్లు సైతం చేశారు. సజ్జల లాంటి బడా వ్యక్తి ఉన్న పరిశ్రమల విషయంలో అలా అంటే.. కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సహజంగా భయపడతారు. దశాబ్దాలుగా వేల కోట్ల రూపాయల టర్నోవర్ తో, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధినిచ్చే అమర్ రాజా పరిశ్రమ తరలింపు నిర్ణయానికి వచ్చిందంటే.. కొత్త వారు ఎలా సాహసం చేయగలరు?
అమర్ రాజా లాంటి పరిశ్రమ ఆల్ట్రనేషన్ ఆలోచించిన మరుక్షణమే తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. నేరుగా అమర్ రాజాకే ఆహ్వానాలు పంపాయి. తమ రాష్ట్రంలో పెట్టుపెడులు పెట్టాలని స్వాగతించాయి. చివరికి తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు నచ్చడంతో అమర్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రూ.9,500 కోట్లతో మోటారు వాహనాల బ్యాటరీల తయారీ సంస్థ నెలకొల్పడానికి సంబంధించి అమర్ రాజాతో ఒప్పందం సైతం పూర్తిచేసుకుంది.

CM Jagan
వాస్తవానికి ఈ పెట్టుబడులన్నీ ఇప్పటికే ఉన్న చిత్తూరు జిల్లాలో పెట్టాలని గల్లా కుటుంబీకులు భావించారు. ఎప్పుడైతే తమపై రాజకీయ వికృత క్రీడకు వైసీపీ సర్కారు తెరతీసిందో పునరాలోచనలో పడ్డారు. రాయలసీమలో కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ.. ప్రభుత్వానికి వందల కోట్ల పన్నుల రూపంలో ఆదాయం తెచ్చిపెడుతున్న పరిశ్రమపై కాలుష్యం అనే అపవాదు వేసి మూయించారో నాడే యాజమాన్యం మనస్తాపానికి గురైంది. అదనపు పెట్టుబడులు అన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. కోర్టుకెళ్లి ఎలాగోలా అనుమతులు తెచ్చుకొని ఇబ్బందులు లేకుండా చూసుకుంది. ఇప్పుడు అదే పరిశ్రమ తరలింపు నిర్ణయంతో ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదు కానీ.. అంతిమంగా నష్టపోయేది రాష్ట్రం. ఉపాధికి దూరమయ్యేది రాయలసీమలోని వేల కుటుంబాలు అన్నది నిజం.
పరిశ్రమ విస్తరించి ఉంటే అదనంగా వేల కుటుంబాలకు సొంత ప్రాంతంలో ఉపాధి దొరికేది. కానీ ఆ చాన్స్ దక్కకుండా చేసిన బ్యాడ్ నేమ్ మాత్రం జగన్ సర్కారు మూటగట్టుకుంది. లాస్ ఏపీది. గెయిన్ అయినది మాత్రం ముమ్మాటికీ తెలంగాణ ప్రభుత్వం…అక్కడి ప్రజలు. దశాబ్దాల కిందట అమర్ రాజా కంపెనీ ఏర్పాటైంది. మధ్యలో ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ అమర్ రాజాపై నింద వేసేందుకు ఎవరూ సాహసించలేదు. పారిశ్రామికాభివృద్ధి అనేది ప్రభుత్వాల బాధ్యత. దానిని గుర్తెరిగి ప్రభుత్వాలు మసులుకున్నాయి. కానీ జగన్ సర్కారు మాత్రం అందుకు విరుద్ధం. కొత్త పరిశ్రమలను ఆకర్షించకపోగా.. ఉన్న పరిశ్రమలకు పొమ్మనలేక పొగ పెట్టి సాగనంపుతున్నాయి. ప్రధాన విపక్షం టీడీపీ చేపడుతున్న ‘ఇదేం ఖర్మ’ అన్నట్టుంది ఇప్పుడు ఏపీలో పరిస్థితి.