CJI Chandrachud: మూన్ లైటింగ్.. కరోనా లాక్ డౌన్ తో మొదలైన ‘వర్క్ ఫ్రం హోం’ పని సంస్కృతితో మొదలైన ఈ డబుల్ ఉద్యోగాల ఒరవడి ఇప్పుడు మరింతగా ఊపందుకుంది. ఇంటి నుంచే అందరూ పనిచేస్తుండడంతో ఒకటికి మించి ఉద్యోగాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఉద్యోగులు ఈ రెండు ఉద్యోగాలతో ఆర్థికంగా లాభపడుతుండగా.. కంపెనీలు మాత్రం ఇలా చేయడం కరెక్ట్ కాదని.. పనితీరు దెబ్బతింటుందని ఇలా చేసే వారిని పక్కనపెడుతున్నాయి. నైపుణ్యం గల ఉద్యోగులు ఇప్పటికీ ఇలా చేస్తూ వారి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఆనంద్ మహీంద్రా లాంటి బడా పారిశ్రామికవేత్తలు సైతం ఉద్యోగులకు ఈ విషయంలో మద్దతు తెలిపారు. తాజాగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధనంజయ వై చంద్రచూడ్ కూడా దీనికి మద్దతునిచ్చేలా మాట్లాడడం విశేషం.

CJI Chandrachud
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధనంజయ వై చంద్రచూడ్ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. తాను ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్)లో రేడియో జాకీ (ఆర్‌జే)గా పనిచేస్తున్నప్పుడు ‘మూన్ లైటింగ్ ’కు పాల్పడ్డానని.. అప్పుడు డబ్బులు సరిపోక వేరే పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేసినట్టు తెలిపారు. తాను ఆర్‌జేగా ఉన్నప్పుడు ‘ప్లే ఇట్ కూల్’, ‘ఎ డేట్ విత్ యు’, ‘సండే రిక్వెస్ట్’ వంటి షోలను హోస్ట్ చేశానని చెప్పారు. ఈ వీడియోను తాజాగా బార్ & బెంచ్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.
మూన్‌లైటింగ్ అంటే ‘ఒక ఉద్యోగం చేస్తూ ఉపాధిని కలిగి ఉన్నప్పుడు కొంత అదనపు నగదు కోసం మరో ఉద్యోగాలను చేయడం..’. ఈ మూన్ లైటింగ్ తప్పు అని కంపెనీలు.. ఒప్పు అని ఉద్యోగులు అంటున్న వేళ సీజేఐ చంద్రచూడ్ తానే మూన్ లైటింగ్ కు పాల్పడ్డానని అనడం అందరి దృష్టిని ఆకర్షించింది. “చాలా మందికి దీని గురించి తెలియదు. కానీ నేను నా 20 ఏళ్ల ప్రారంభంలో ఆల్ ఇండియా రేడియో (AIR)లో రేడియో జాకీగా ‘ప్లే ఇట్ కూల్’, ‘డేట్ విత్ యు’ వంటి ఇతర కార్యక్రమాలను చేశాను” అని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. తనకు సంగీతం పట్ల మక్కువ ఉందని, ఇంటికి వెళ్లిన తర్వాత ఇప్పటికీ దానిని వింటానని వెల్లడించారు.

CJI Chandrachud
సీజేఐ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘‘నాకు సంగీతంపై ఉన్న అభిమానం నేటికీ కొనసాగుతోంది. అందుకే ఎప్పుడూ చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఖాళీ టైంలో సంగీతాన్ని వింటాను. రోజులో ఒక్కసారైనా ఇలా చేస్తాను”అని చెప్పుకొచ్చాడు.
ఇటీవల భారతదేశంలోని పలు కంపెనీలు మూన్‌లైటింగ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. మూన్ లైటింగ్ పేరిట రెండో ఉద్యోగం చేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగించింది. చాలా కంపెనీలు ఇదే పనిచేయడాన్ని ఉద్యోగులు వ్యతిరేకించారు. కానీ ఉపాధి కోసం.. డబ్బుల అవసరం కోసం ఏకంగా చీఫ్ జస్టిస్ లాంటి వారు కూడా మూన్ లైటింగ్ కు పాల్పడ్డారంటే ఇది అవసరం కోసం చేసేది తప్ప.. అత్యాశ కోసం చేసింది కాదని అందరూ ఆయన వీడియోను షేర్ చేస్తూ మద్దతు పలుకుతున్నారు.