Cinema Theaters in AP: ఏపీలో సినిమాల వ్యవహారం చినికి చినికి గాలివానలా తయారైంది. అఖండ సినిమా సమయంలో బెనిఫిట్ షోలు రన్ చేశారంటూ పలు థియేటర్లపై చర్యలు తీసుకున్న అధికారులు.. ఇప్పుడు రాష్ట్రవాప్తంగా దాడులు కొనసాగిస్తున్నారు. అనుమతులు, సౌకర్యాల లేమి పేరుతో కొన్ని సినిమా హాళ్లను అధికారులు సీజ్ చేయగా.. ఎప్పుడో పదేళ్లనాటి ధరలను ఇప్పుడు అమలు చేయడం తమకు గిట్టుబాటు కాదంటూ ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. దీంతో.. రాబోయే సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
వకీల్ సాబ్ సినిమా రిలీజుకు ఒక్క రోజు ముందు ఉన్నట్టుండి చర్యలు తీసుకున్న జగన్ సర్కారు.. అప్పటి నుంచి అదే పట్టుమీద ఉంది. మెట్టు దిగట్లేదు. టికెట్ ధరలు తగ్గించడమే కాకుండా.. ఆన్ లైన్లో ప్రభుత్వమే ఈ టికెట్లు అమ్మడానికి సిద్ధమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమాలు తీసిన నిర్మాతలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ కష్టాలు ఇలా ఉండగానే.. థియేటర్లలో సౌకర్యాలు, అనుమతుల విషయమై అధికార యంత్రాగం దాడులు చేస్తుండడం వారిని మరింత కలవరానికి గురిచేస్తోంది.
గత నాలుగు రోజులుగా మొదలైన ఈ దాడుల తీవ్రత మరింతగా పెరిగింది. గుంటూరు జిల్లాలో 70 థియేటర్లలో సోదాలు చేసి 35 హాళ్లకు నోటీసులు ఇచ్చారు. 4 టాకీసులు మూసేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 45, కృష్ణా జిల్లాలో 30, పశ్చిమగోదావరి జిల్లాలో 23 థియేటర్లు మూతపడ్డాయి. ఇలా.. రాష్ట్రవ్యాప్తంగా దాడులు కొనసాగిస్తుండడంతో ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
హీరో నాని వ్యాఖ్యల తర్వాత పరిస్థితి మారిపోయింది. మంత్రులు కన్నబాబు, బొత్స, అనిల్ కుమారు స్పందించడం.. అధికారుల దాడులు కొనసాగించడం జరిగాయి. అయితే.. ఏపీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అటు తెలంగాణ ప్రభుత్వం ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడం తీవ్రమైన చర్చకు దారితీసింది. రేట్లు పెంచడానికి తెలంగాణ అవకాశం ఇస్తే.. ఏపీ సర్కారు ఉన్న రేట్లను భారీగా తగ్గించడం ఏంటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ పరిస్థితికి ఎప్పుడు శుభం కార్డు పడుతుందో తెలియకుండా ఉంది. దీంతో.. రాబోయే సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత సమ్మర్లో విడుదల కావాల్సిన ఆచార్య వంటి చిత్రాలు.. కేవలం టికెట్ రేట్ల కోసమే వేచి చూశాయి. కానీ.. ఏపీ సర్కారు మరింత పట్టుదలకు పోతోందే తప్ప, మెట్టు దిగట్లేదు. ఈ పరిస్థితి ఇలా ఉంటే.. కరోనా థర్డ్ వేవ్ దూసుకొస్తోందనే భయాలు ఉండనే ఉన్నాయి. వైరస్ విజృంభిస్తే.. థియేటర్లు పూర్తిగా మూతపడే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని అంటున్నారు. ఈ విధంగా.. రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది సినీపరిశ్రమ పరిస్థితి. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.