Water War: గొంతు తడిపే జలమే ఆయుధం.. దానితోనే దేశాల యుద్ధం..
తరగని భూదాహంతో తన చుట్టూ ఉన్న దేశాలను ” సలామీ స్లైసింగ్” (కొంచెం కొంచెం, అనకా ఆ భూభాగాన్ని తనదిగా క్లెయిమ్ చేసుకోవడం) విధానంలో ఆక్రమించుకునే దురాశ డ్రాగన్ దేశానిది.

Water War: జలం.. గొంతు తడుపుతుంది. మన దేహ అవసరాలు తీరుస్తుంది. సమస్త ప్రాణకోటి మనుగడకు కారణమవుతుంది. జలం ప్రవహించినచోట నాగరికత వెల్లి విరిసింది. జలం పరుగెడినచోట పంటలకు ఆలవాలమైంది. అలాంటి జలం యుద్ధానికి కారణమైందంటే నమ్మగలమా? అలాంటి జలం ఇతర దేశాలకు ఆయుధమై.. మిగతా వాటిని మట్టు బెట్టిందీ అంటే ఊహించగలమా? ఇప్పుడు మన సరిహద్దుల్లో ఉన్న చైనా చేస్తుంది కూడా అదే.. ఇంతకీ డ్రాగన్ ఏం చేస్తోంది అంటే..
తరగని భూదాహంతో తన చుట్టూ ఉన్న దేశాలను ” సలామీ స్లైసింగ్” (కొంచెం కొంచెం, అనకా ఆ భూభాగాన్ని తనదిగా క్లెయిమ్ చేసుకోవడం) విధానంలో ఆక్రమించుకునే దురాశ డ్రాగన్ దేశానిది. ఇప్పటికే ఆ దేశానికి మనతో సరిహద్దు సమస్యలు ఉన్నాయి. పైగా అరుణాచల్ ప్రదేశ్ ను తన భూభాగంగా ప్రకటించుకుంటూ మనల్ని కవ్విస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మనతో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు బ్రహ్మపుత్రా నదిపై కట్టే మెగా డ్యామ్ నుంచి నీటిని పెద్ద ఎత్తున విడుదల చేయడం ద్వారా చైనా మనపై ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం రక్షణ రంగ నిపుణులు కూడా ఇదే తీరుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే వారు చెబుతున్న ప్రకారం ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉందా అంటే.. ఒకసారి చరిత్ర పరిశీలిస్తే అలాంటి విషయాలే కళ్ళ ముందు కదలాడుతాయి.
నీటిని వ్యూహాత్మక ఆ విధంగా ఉపయోగించుకోవడం గతంలో చాలా సార్లు జరిగింది. చరిత్రలో అత్యంత గొప్ప చిత్రకారుల్లో ఒకరుగా భావించే లియోనార్డో డావిన్సీ 16వ శతాబ్దం తొలినాళ్లలో నికోలో మాకియా వెళ్లితో కలిసి పిసా నగరం నుంచి ఆర్నో నది గతిని మార్చేసేందుకు అత్యంత భారీ ప్రతిపాదనలు తీసుకొచ్చారు. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. అలాగే క్రిమియా భూభాగాన్ని రష్యా ఆక్రమించిన తర్వాత.. ఉక్రెయిన్ సేనలు ఆ ప్రాంతానికి నీరు వెళ్లే ఏకైక మార్గాన్ని పూర్తిగా మూసి వేయగలిగాయి. 2014లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పశ్చిమ ఇరాక్ లోని నువాయిమియా డ్యాం ను స్వాధీనం చేసుకొని.. దాని గేట్లు మొత్తం ఎత్తివేసి నీటిని విడుదల చేసి ఇరాకి సేనల పైకి మళ్లించారు. వారిని పరుగులు పెట్టించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యం ఉత్తరకొరియా, ఉత్తర వియత్నాంలోని పలు డ్యాములపై బాంబుల వర్షం కురిపించి.. అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వాలు నిర్మించిన విద్యుత్, నీటిపారుదల మౌలిక సదుపాయాలను సర్వనాశనం చేయడానికి ప్రయత్నించింది. నిజానికి 1977లో ప్రపంచ దేశాలు జెనీవాలో కుదుర్చుకున్న ఒక ఒప్పందం ప్రకారం.. పెద్ద సమయాల్లో నీటి వనరులను లక్ష్యంగా చేసుకోవడంపై నిషేధం ఉంది. కానీ వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ” ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్” అంటారు కదా. దానికి తగ్గట్టుగానే యుద్ధాలు కూడా జరుగుతున్నాయి.
