చైనానుంచి వచ్చిన ‘కరవనా వైరస్ గా ‘

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వారం లో అత్యంత ప్రాముఖ్యం కలిగిన వార్త ఇదే. ఏనోటవిన్నా ఏమాట మాట్లాడినా , ఏ రాత చూసినా కరోనా కరోనా కరోనా. ఈ వార్త ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసింది. అమెరికాలోనైనా , చైనాలోనైనా, ఇండియాలో నైనా, యూరప్ లో నైనా ఒకే వార్త ప్రజల నోళ్ళలో నానుతుంది. నాకు తెలిసి ఇంతగా అందరు ప్రజలు ఒకే వార్త గురించి మాట్లాడుకోవటం ఇటీవలి కాలంలో ఇదేనేమో. ఇంతకన్నా గ్లోబలైజేషన్ […]

  • Written By: Ram Katiki
  • Published On:
చైనానుంచి వచ్చిన   ‘కరవనా వైరస్ గా ‘

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వారం లో అత్యంత ప్రాముఖ్యం కలిగిన వార్త ఇదే. ఏనోటవిన్నా ఏమాట మాట్లాడినా , ఏ రాత చూసినా కరోనా కరోనా కరోనా. ఈ వార్త ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసింది. అమెరికాలోనైనా , చైనాలోనైనా, ఇండియాలో నైనా, యూరప్ లో నైనా ఒకే వార్త ప్రజల నోళ్ళలో నానుతుంది. నాకు తెలిసి ఇంతగా అందరు ప్రజలు ఒకే వార్త గురించి మాట్లాడుకోవటం ఇటీవలి కాలంలో ఇదేనేమో. ఇంతకన్నా గ్లోబలైజేషన్ ఇంకేముంది. ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు. మన చావు బతుకులకు సంబంధించింది. అటువంటప్పుడు మనం కూడా ఈ వారాంతం ఈ ముచ్చటే మాట్లాడుకోవటం సబబుగా ఉంటుంది.

కరోనా వైరస్ అంటే ‘కరవనా వైరస్ గా ‘ అని

ఇంతకీ వైరస్ అంటే ఏమిటి? ఒక విధంగా మన ఆత్మలాంటిదే. ఆశ్చర్యంగా ఉందా? ఈ వైరస్ లకు ఒక స్వరూపం ఉండదు. కానీ ఎవరిలోకైనా పరకాయ ప్రవేశం చేస్తుంది. వైరస్ అనగానే అది భూతం అనుకోవద్దు. కొన్ని వైరస్ లు హానికరమైన బ్యాక్తీరియా లను నాశనం చేస్తాయి కూడా. వైరస్ లు మనుషులతో పాటు , మెషిన్లను కు కూడా వస్తాయండోయ్. అందుకనే మన కంప్యూటర్లకు వైరస్ సోకకుండా యాంటీ – వైరస్ రక్షణ చేసుకుంటాము. అలాగే మనుషులకు సోకే వైరస్ లకు రక్షణగా టీకాలు వేసుకుంటాము. ఈ వైరస్ లు వాటంతట అవి బతకలేవు. అందుకే అవి పరాన్నభుక్కులు. అటువంటి వైరస్ ల్లో ఒకటి కొత్తగా మనుషులమీద పడి తినేస్తుందంట. దాని దుంపదెగ దానికి చిన్న పిల్లలన్నా , ముసలివాళ్ళన్నా ఆవురావురని తింటుందంట. అందుకే వీళ్ళిద్దరూ మరీ జాగ్రత్తగా వుండాలంట. దానిపేరు ‘కరోనా’. కరో నా అంటే హిందీలో ‘ చేయి (DO )’ అనుకుంటా. నా హిందీ అంతంత మాత్రమే ఏమీ అనుకోవద్దు. సినిమాలు చూడటానికి , హిందీ వాళ్ళతో వచ్చి రాని సమాధానం ఇవ్వటానికి మాత్రమే పనికొస్తుంది. మరి తెలుగులో దాన్ని ‘ కరవనా వైరస్ గా ‘ అని ముద్దుగా పిలుచుకుందాం. ఇంతకీ ఇది భయపెట్టినంతగా కరవదని సాక్ష్యాలు చెబుతున్నాయి. కరిచిన లెక్కలు తీస్తే నూటికి ఒకటిన్నరమందినే కరిచిందంటా. అదే మిగతా వైరస్ లు ఇంతకన్నా ఎక్కువమందిని కరిచాయని లెక్కలు చెబుతున్నాయి.

ఇంతకీ ఈ ‘ కరవనా వైరస్ ‘ గాలిలోనుంచి మనమీద వాలదు. అంటే మనం సాధారణంగా అనుభవించే కొన్ని వైరస్ లకన్నా బెటరే . మరి ఎలా వస్తుంది? అప్పటికే ఇది ఆకలితో తినటానికి ఎంచుకున్న మనుషులు తుమ్మినా, దగ్గినా, అలాగే ఏదైనా వస్తువులు ముట్టుకున్నా వాళ్ల ద్వారా మనకు వస్తుంది. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ‘కరవనా వైరస్’ మనుషులు ముట్టుకున్న వస్తువులు, వాళ్ళ తుమ్ముల తుంపరలు పడకుండా జాగ్రత్త పడాలి. ఇండియాలో ఇప్పటివరకు మరీ అంత ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇప్పటికే ఎక్కువగా వచ్చిన దేశాల్లాగా చైనాతో మనకు జన సంబంధాలు తక్కువ.దీనితో చైనా విశ్వరూపమేమిటో జనాలకు తెలిసింది. ప్రపంచీకరణ వలన ఎక్కువ లాభపడ్డ దేశమేదన్నా ఉందంటే అది చైనానే. ప్రపంచ సరఫరా నెట్ వర్క్ లో చైనా పాత్ర ఎంతో ప్రపంచానికి తెలిసింది. దానితో పాటు వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా అందరికీ తెలిసాయనుకోండి. దీనితో అన్నిచోట్లా పాపం చైనా హోటళ్ల గిరాకీ తగ్గిందంట. అమెరికాలో చైనా హోటళ్లు బాగా పాపులర్. వాళ్ళందరూ నెత్తి నోరు బాదుకుంటున్నారు.

సుచి , శుభ్రతలు పాటించాలి

అయితే మనం కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ జాగ్రత్తలు నిజానికి ఎప్పుడూ తీసుకోవాల్సినవే. ఈ పేరుతోనైనా శుభ్రతను అలవాటు చేసుకుంటే మంచిదేకదా. ఇప్పటికే మనమీద చెడ్డపేరుఉంది. భారతీయులు శుభ్రతలో అందరికన్నా చివర ఉంటారని పేరుపడిపోయింది. అందుకు నిదర్శనం మన ఎయిర్ ఇండియా లో అమెరికా ప్రయాణం. ఆ అనుభవం వున్నవాళ్లకి మన టాయిలెట్లు ఎంత దారుణంగా వుంటాయో తెలుసు. టాయిలెట్లు పనిచేయక మధ్యలో వేరే చోట ఆపిన సంఘటనలు కూడా మనకున్నాయి. ఇప్పటికైనా చేతులు కడుక్కోవటం , అదీ హ్యాండ్ వాష్ ఉపయోగించటం ( సబ్బు కాదు ), బయటకెళ్లినప్పుడు శానిటైజర్ చిన్న సీసా పెట్టుకోవటం, మరీ జనసమ్మర్దం లోకి వెళ్ళినప్పుడు సర్జికల్ మాస్క్ ఉపయోగించటం అదిలేకపోతే కనీసం హ్యాండ్ కర్చీఫ్ ఉపయోగించటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బాత్రూం కి వెళ్ళివచ్చినప్పుడు హ్యాండ్ వాష్ ఉపయోగించటం కూడా ఖచ్చితంగా పాటించాలి. 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్లయితే న్యుమోనియా టీకా వేయించుకోవటం మంచిదని కొన్ని దేశాల్లో చెబుతున్నారు. ఎందుకంటే న్యుమోనియా తో పాటు ‘కరవనా వైరస్ ‘ వస్తే కరిచే అవకాశాలు ఎక్కువంట. నా సలహా ప్రామాణికం కాందండోయ్. ఒక్కసారి డాక్టర్ని సంప్రదించటం మంచిది. ఇంతవరకూ బాగానే వుంది. ఇందులో ప్రభుత్వం చేయాల్సింది ఏమీ లేదా?

చాలా వుంది. ఇతరదేశాల్లో పబ్లిక్ ప్లేసుల్లో, మార్కెట్లలో, ఆఫీసుల్లో, ఆసుపత్రుల్లో ఎక్కడకువెళ్లినా వెళ్ళంగానే శానిటైజర్ అందుబాటులో ఉంటుంది. మరి ఇక్కడ మన ప్రభుత్వం ఎందుకు చేయటంలేదు. ప్రైవేటు కార్యాలయాల్లో కూడా శానిటైజర్ ఉంచాలని ఆరోగ్యశాఖ ఎందుకు నిబంధనలు పెట్టటంలేదు? ముఖ్యంగా బస్సు స్టాండుల్లో , రైల్వే స్టేషన్లలో , ఆసుపత్రు ల్లో అవి చాలా అవసరం. అలాగే మోడీ అధికారం లోకి వచ్చినతరువాత స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున ప్రారంభించాడు. దానికిచ్చిన ప్రకటనలు చూసి సిగ్గుతో బహిరంగ మూత్ర విసర్జన చాలా మంది మానేశారు. అటువంటిదే దైనందిన శుభ్రతపై కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయొచ్చుకదా. శుభ్రతమాట దేవుడెరుక ముందు రైళ్లలో ఉపయోగించే ఉలెన్ దుప్పట్లు మార్చాలి. వాటిబదులు రోజు వారీ మార్చే రకం మందపాటి దుప్పట్లు బెటర్. అసలు ఇవ్వకపోయినా ఫర్వాలేదుగానీ ఆ ఉలెన్ దుప్పట్లవలన రోగాలు రావటం ఖాయం. ‘కరవనా వైరస్ ‘ వలన వింత వింత అనుభావాలు ఎదురవుతున్నాయంట. కొన్ని దేశాల్లో సరుకులు ముందుగానే నిల్వచేసుకోవటం వలన ఇబ్బందులేర్పడుతున్నాయంట. విశేషమేమంటే టాయిలెట్ టిష్యూ పేపర్ షాపుల్లో దొరకటంలేదంట. పబ్లిక్ ప్లేసుల్లో టాయిలెట్లలో టిష్యూ పేపర్ బండిళ్లు మాయమవుతున్నాయంట. ఇదిచూసి కొన్నిదేశాల్లో టాయిలెట్ టిష్యూ పేపర్ కి చైన్ తో లాక్ వేస్తున్నారంట. అంటే వాళ్ళు వాడొచ్చుగానీ బండిల్ దొంగిలించడానికి కుదరదంట . ఇటువంటి వింతలూ, విశేషాలు ఎన్నో.

మరికొన్ని సరదాగా

దీనితోపాటు ఈ ‘కరవనా వైరస్ ‘ తో మంచిపనులు కూడా జరుగుతున్నాయండోయ్. ఇంట్లో మహిళామణులు బయటకెళ్ళటం తగ్గించారు. బట్టల షాపుల ఖర్చు కొన్నాళ్ళు వాయిదాపడిందంట. బయట రెస్టారెంట్లలో తినడటం ఇటీవల ఎక్కువయ్యి, ఇంట్లో వంట చేయటం అలవాటు తప్పింది కదా. పాపం బతుకు మీద ఆశ మళ్ళా వంటగదులు బిజీ అయ్యాయంట. ఆ విధంగా రెస్టారెంట్ల ఖర్చూ తగ్గిందంట. మన తెలుగు వాళ్ళు సినిమా చూడకుండా వుండలేరుకదా. ఇప్పుడు అదికూడా తగ్గిందంటండోయ్. మరి ఈ కరోనా లేక ‘కరవనా ‘ వైరస్ ఈ విధంగా మేలు కూడా చేస్తుందన్నమాట. ఈ వైరస్ కులం, మతం , ప్రాంతం తో సంబంధం లేకుండా అందర్నీ కరుస్తుందంట. ఇది చూసైనా మన వాళ్ళు ఈ మన, తన బేధాలు మర్చిపోతారేమో చూద్దాం.

చివరగా

ఈ మధ్య సోషల్ మీడియా లో ‘కరవనా వైరస్ ‘ తో మన సంస్కృతి , సంప్రదాయాల గురించి వందల పోస్టులు వెల్లువెత్తుతున్నాయండోయ్. మనకేదొచ్చినా పట్టలేంకదా. మన సంస్కృతి ని గౌరవించటం వరకూ ఓకే. కానీ సమస్యలన్నింటికీ పరిష్కారం ఇందులోనే వున్నాయనటం మూర్ఖత్వం. మన నమస్కారం మంచిదే కానీ ఇది మనకొక్కరికే సొంతం అనుకోవటం వాస్తవ దూరం. దాదాపు ఆసియా దేశాలన్నింటిలో కరచాలనం లేదు. ఒక్కో దేశంలో ఒక్కో పద్దతి వుంది. కరచాలనం ప్రాశ్చాత్య దేశాల్లోనే వుంది. ఆ ప్రాశ్చాత్య ప్రభావం ప్రపంచం మొత్తానికి పాకింది. మన సంప్రదాయాన్ని మనం పాటించటం మంచిది. అలాగే నా చిన్నప్పుడు మా వూళ్ళో గబ్బిలం ఇంట్లోకి వస్తే 6 నెలలు ఇంటికి తాళం వేసేవాళ్ళు. ఇప్పుడువస్తున్న వార్తలబట్టి చాలా వైరస్ లు గబ్బిలం నుంచి వస్తున్నాయని చెబుతున్నారు. చివరకు ఈ చైనా వైరస్ కూడా దాన్ని నుంచే వచ్చిందని చెబుతున్నారు. చైనా వాళ్ళు గబ్బిలాన్ని మహా ఇష్టంగా తింటారంట. కాబట్టి ఈ విషయం లో కూడా మన పెద్దల సంప్రదాయం మంచిదని తెలుస్తుంది. ఇటువంటివి ఇంకా వున్నాయి. మనది దాదాపు 5 వేల సంవత్సరాలనుండీ కొనసాగుతున్న సంస్కృతి. ఇలా ఇన్నివేల సంవత్సరాలు బతికివున్న సంస్కృతులు లేవు. అది మన అదృష్టం. అంతమాత్రాన ఉన్నవీ లేనివి కల్పించి పుంఖానుపుంఖాలుగా వచ్చే పోస్టులు చూస్తుంటే ఇక మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, అంతా మన దగ్గరుందనే భావన కల్గుతుంది. అది ప్రమాదకర ధోరణి. మన సంస్కృతి లో వున్న మంచిని గ్రహిస్తూనే మిగతా సంస్కృతుల్లో వున్న మంచిని కూడా గ్రహించగలిగితే ఇంకా మెరుగైన జీవనానికి ఉపయోగపడుతుంది. అలాగే కొత్త భావాలు, కొత్త పరిశోధనలు, కొత్త ప్రయోగాలు మన జీవన విధానంలో భాగం కావాలి. అదే మన ఆశయం కావాలి. అంతేగానీ పెడధోరణులు మొదటికే మోసం వచ్చే అవకాశం వుంది, తస్మాత్ జాగ్రత్త.

ఇవీ ఈవారం ముచ్చట్లు, మరిన్ని విశేషాలతో వచ్చే వారం కలుద్దాం, సెలవా మరి.

…….. మీ రామ్

 

సంబంధిత వార్తలు