CM Jagan Delhi Tour: ఢిల్లీ వెళ్లనున్న జగన్.. వెనుక పెద్ద స్కెచ్
సీఎం జగన్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. నీతి అయోగ్ భేటీకిగాను ఈ నెల 26న జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఒక రోజు ముందుగా వెళ్లడం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

CM Jagan Delhi Tour: రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్లవుతోంది. విభజన హామీలు అమలుకావడం లేదు. అవశేష ఏపీకి సరైన న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన జరగనున్న నీతి అయోగ్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సమావేశానికి హాజరుకావాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తమానం అందింది. ఏపీ సీఎం జగన్ సైతం హాజరుకానున్నారు. చివరి ఏడాది కావడంతో విభజన హామీలపై గట్టిగా మాట్లాడితే కొంతవరకూ వర్కవుట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎంతవరకూ సద్వినియోగం చేసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్న. గత నాలుగేళ్లుగా కేంద్రంతో సఖ్యతగా ఉన్నా కీలక హామీలు, ప్రాజెక్టుల సాధనలో జగన్ ఆశించినస్థాయిలో పనిచేయలేకపోయారు. దీనని అధిగమించాలంటే ఈ చివరి ఏడాదిలోనైనా కొంతవరకూ హామీలు అమలయ్యేలా చూడాలి.
ఒక రోజు ముందే..
సీఎం జగన్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. నీతి అయోగ్ భేటీకిగాను ఈ నెల 26న జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఒక రోజు ముందుగా వెళ్లడం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జగన్ రాజకీయంగా, పాలనాపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వివేకా హత్యకేసు వెంటాడుతోంది. మరోవైపు టీడీపీ, జనసేనతో బీజేపీ జత కలుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ కు సిద్ధపడుతుండడంపై రకరకాల ప్రచారం సాగుతోంది. గతంలో నీతి అయోగ్ సమావేశాలకు ఆర్థిక మంత్రి బుగ్గనను పంపించే వారు. అయితే ఈ సారి తానే వెళ్లడానికి సిద్ధపడుతుండడం విశేషం.
ఆ విషయాలపైనే..
సీఎం ఢిల్లీ టూర్ కు రాజకీయ ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తోంది. 26న హోం మంత్రి అమిత్ షా, 27న సాయంత్రం ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోరినట్టు తెలుస్తోంది. అయితే జగన్ ఢిల్లీ వచ్చిన ప్రతీసారి వారిద్దరిని కలుస్తుంటారు. విభజన హామీల కోసమే కలిసినట్టు ఒక ప్రకటన ఇస్తుంటారు. అయితే ఈసారి భేటీ పూర్తిగా రాజకీయం కోసమే అన్నట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలవకుండా జగన్ పెద్దల ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టే అవకాశమున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సహకరిస్తే..ఎంపీల బలాన్ని అందిస్తానని పెద్దలకు చెప్పేందుకే ఢిల్లీ వెళుతున్నారని విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
వాటి ప్రస్తావన ఉంటుందా?
రాష్ట్రం విడిపోయి దాదాపు పదేళ్లు సమీపిస్తోంది. ఇంతవరకూ విభజన హామీలు అమలుకాలేదు. అయితే వీటిపై జగన్ ఏనాడూ పట్టుబట్టలేదు. ఇది జగన్ కు మైనస్ గా మారింది. విపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అపర సంజీవిని అంటూ చెప్పుకొచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఊసే మరిచిపోయారు. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పొందుపరిచిన 91 ఇన్‌స్టిట్యూషన్స్, షెడ్యూల్ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల విషయం తేలాల్సి ఉంది. అయితే ఈ సమావేశంలో చర్చిస్తారో? లేక షరా మామ్మూలుగా ఒక ప్రకటనతో తేలిపోతారో చూడాలి మరీ.
