AP Political Alliances : ఏపీలో పొత్తులకు ఢిల్లీలో చెక్
పొత్తుల పైన బీజేపీ సానుకూలంగా ముందుకు వెళ్లకుండా తమ మైత్రి మరింత బలపడేలా..తన వైఖరి స్పష్టమయ్యేలా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నారు. మొత్తానికైతే కీలక సమయంలో జగన్ తన బుర్రకు పదునుపెట్టారు. పవన్ ప్రయత్నాలను, చంద్రబాబు వ్యూహాలకు జగన్ గట్టి సమాధానాలే ఇస్తున్నారు.

AP Political Alliances : ఏపీలో అసలు సిసలు రాజకీయ చదరంగం మొదలైంది. ఒకరినొకరు రాజకీయంగా కబళించేందుకు పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార పీఠాన్ని కాపాడుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. కరెక్ట్ టైమ్ చూసి ఢిల్లీలో ఎంటరవుతున్నారు. టీడీపీ, జనసేన గూటికి బీజేపీని తెచ్చేందుకు పవన్ చేసిన ప్రయత్నాలపై సవాల్ చేస్తున్నారు. చంద్రబాబు స్కెచ్ కు కౌంటర్ ఆపరేషన్ కూడా ప్రారంభించారు. ఈ మొత్తం ఎపిసోడ్ కు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలతో బీజేపీ రక్తికట్టిస్తోంది. ఏపీలో పవన్, చంద్రబాబుల వ్యూహాలకు ఢిల్లీ వెళ్లి విరుగుడు కల్పించే పనిలో జగన్ పడ్డారు.
ఏపీలో ఇన్నాళ్లూ తెలుగు పార్టీలతో దాగుడు మూతలు ఆడిన బీజేపీ ఇప్పుడే ముసుగు తీసింది. తాను అందరివాడినని చెప్పుకొచ్చిన మోదీ ఇప్పుడిప్పుడే పక్కకు జరుగుతున్నారు. ఏడాది ముందే కాస్తా స్పష్టతనిస్తున్నారు. ఇక చంద్రబాబు, పవన్ ల వ్యూహాలు గురితప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాము ఆశించిన దాని కంటే భిన్నంగా ఢిల్లీ సంకేతాలు వెలువడుతున్నాయి. బీజేపీ తమ కంటే జగన్ నే నమ్ముతున్నట్టు సిగ్నల్స్ అందుతున్నాయి. అయితే బీజేపీ అధికారికంగా ప్రకటించే వరకూ వెయిట్ చేస్తారా? లేదా అదే కసితో కలిసి పోరాడుతారా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే కలిసిపోయేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్న ఆ రెండు పార్టీలు ఎటువంటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడేది లేదని సంకేతాలిస్తున్నాయి.
కర్నాటకలో ఓటమి బీజేపీకి కాస్తా కలవరమే. కాంగ్రెస్ పార్టీకి కాస్తా ఉపశమనమే. బీజేపీ బాధిత పార్టీలకు మాత్రం ఇదో శుభపరిణామం. బీజేపీని ఎదిరించాలని భావించే పార్టీలకు కాస్తా ధైర్యం. అయితే ఇటువంటి ప్రతికూల సమయంలో బీజేపీ ఒడ్డుకు చేరుతున్నారు జగన్. కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నీ వ్యతిరేకమైన సమయంలో నేనున్నాను అంటూ సపోర్టుగా నిలబడ్డారు. మోదీకి అండగా ఉండడమే కాకుండా 19 విపక్ష పార్టీలను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వారిది తప్పు అని వాదిస్తున్నారు. బీజేపీకి దగ్గరయ్యే క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న విపక్షాలకు శత్రువుగా మారుతున్నారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని ప్రతిపక్షాలు నిర్ణయించిన సమయంలో స్వయంగా హాజరైన ప్రధాని మోదీకి బాసటగా నిలవాలని నిర్ణయించారు. సరైన సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఆపరేషన్ ఢిల్లీ ప్రారంభించారు. కేంద్రానికి అవసరమైన సమయంతో మద్దుతగా నిలిచి..ఏపీలో తన రాజకీయ ప్రత్యర్ధుల వ్యూహాలకు చెక్ పెట్టారు. పొత్తుల పైన బీజేపీ సానుకూలంగా ముందుకు వెళ్లకుండా తమ మైత్రి మరింత బలపడేలా..తన వైఖరి స్పష్టమయ్యేలా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నారు. మొత్తానికైతే కీలక సమయంలో జగన్ తన బుర్రకు పదునుపెట్టారు. పవన్ ప్రయత్నాలను, చంద్రబాబు వ్యూహాలకు జగన్ గట్టి సమాధానాలే ఇస్తున్నారు.