Chandrayaan 3 Launch: అందెను నేడే.. అందని జాబిల్లి
చంద్రయాన్_3 లోని ల్యాండర్, రోవర్ ఆగస్టు 23న చంద్రుడి కక్ష్యలోకి వెళ్తాయి. గత వైఫల్యాల వల్లే ఇస్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఈసారి చంద్రుడి ధ్రువానికి దగ్గర్లో 70 డిగ్రీల వద్ద ఈ ఉపగ్రహాన్ని దింపుతున్నారు.

Chandrayaan 3 Launch: ప్రపంచావళి కి ప్రత్యేక ఆకర్షణ ఉన్న జాబిల్లికి సంబంధించి ఇంతకు పూర్వం బయటపడని రహస్యాలను చేదించే పనిలో పడింది ఇస్రో. ఇందులో భాగంగానే చంద్రయాన్_3 ప్రయోగాన్ని చేసింది. శుక్రవారం షార్ నుంచి ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా పంపగలిగింది. ఈ ప్రయోగంతో మనం చందమామ వైపు చూస్తే.. ప్రపంచం మొత్తం మన వైపు ఆసక్తిగా చూస్తోంది. గత యాత్రలకు భిన్నంగా, చంద్రుడి ఆధ్యయనంతోపాటు ఇతర గ్రహాలపై జీవాన్ని కనుగొనే విషయంలో ఇది సహాయపడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గతంలో ఏ దేశం చేయని విధంగా అత్యంత క్లిష్టమైన చంద్రమండల దక్షిణ ధ్రువం వద్ద చందమామతో చెట్టా పట్టాలకు ఇస్రో ఏకంగా శాస్త్ర విజ్ఞాన సాహసం చేస్తోంది. అందువల్లే ప్రపంచం మొత్తం ఈ ప్రయోగాన్ని అత్యంత ఆసక్తిగా గమనిస్తోంది.
600 కోట్ల ఖర్చు
దాదాపు 600 కోట్ల ఖర్చు అయ్యే ఈ తాజా యాత్రకు ముందు రెండుసార్లు భారత్ చంద్ర మండల అన్వేషణ సాగించింది. 2008 అక్టోబర్ నాటి చంద్రయాన్_1 లో భాగంగా ప్రయోగించిన 35 కిలోల మూన్ ఇంపాక్ట్ ప్రోబ్( ఎంఐపీ) చంద్రుడి కక్ష్య లోకి ప్రవేశించి, పరిశోధనలు సాగించి, చంద్రుడి ఉపరితలపై నీటి జాడను కనుగొనింది. ఇక, చంద్రుడి ఉపరితలంపై దిగి, అన్వేషణ జరిపేందుకు ఉద్దేశించిన 2019 సెప్టెంబర్ నాటి చంద్రయాన్_ 2 పాక్షికంగానే విజయవంతమైంది. 8 పరికరాలతో కూడిన ల్యూనార్ ఆర్బిటర్ ను విజయవంతంగా చంద్ర కక్ష్యలోకి పంపగలిగినప్పటికీ.. ఆపిల్ పై దిగే రోవర్ ( ప్రజ్ఞాన్) ను మోసుకుపోతున్న ల్యాండర్(విక్రమ్) మాత్రం తుది క్షణాల్లో కుప్పకూలింది. దీంతో ప్రయోగం పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. మార్గ నిర్దేశక సాఫ్ట్ వేర్ లో లోపం వల్ల క్రాష్ ల్యాండింగ్ జరిగింది. ఇప్పుడు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిగే విధంగా చంద్రయాన్_3 కి రూపకల్పన చేసింది. ఇప్పటివరకైతే ప్రయోగం సభ్యంగానే సాగినట్లు లెక్క. అయితే ఈ ప్రయోగం తర్వాత నెల అనంతరం చంద్రయాన్_3 చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుంది.
అప్పుడే అందులోకి వెళ్ళేది
చంద్రయాన్_3 లోని ల్యాండర్, రోవర్ ఆగస్టు 23న చంద్రుడి కక్ష్యలోకి వెళ్తాయి. గత వైఫల్యాల వల్లే ఇస్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఈసారి చంద్రుడి ధ్రువానికి దగ్గర్లో 70 డిగ్రీల వద్ద ఈ ఉపగ్రహాన్ని దింపుతున్నారు. అవసరమైతే సుదూరం ప్రయాణించి, ప్రత్యామ్నాయ స్థలంలో దిగేలా ల్యాండర్ లో మరింత ఇంధనం చేర్చారు. ల్యాండర్ స్వయంగా తీసే చిత్రాలకు తోడు మునుపటి చంద్రయాన్_2 ఆర్బిటర్ తీసిన చిత్రాలను సైతం దానికి అందుబాటులో ఉంచారు. దీనివల్ల సరైన ప్రాంతానికి చేరింది? లేనిది? నిర్ధారించుకునే లాగా ఏర్పాటు చేశారు. అధిక వేగంలోనూ దిగేలాగా ల్యాండర్ కాళ్ళను దృఢంగా తీర్చిదిద్దారు. అదనపు సౌరఫలకాలను ల్యాండర్ కు అమర్చారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం అనేది అత్యంత సంక్లిష్ట ప్రక్రియ. ఇందులో వైఫల్యాలు కూడా అధికంగా ఉంటాయి. అయితే సఫలమైన ఘనత మాత్రం చైనా, అమెరికా, రష్యా దేశాలది మాత్రమే. అయితే ఇప్పటిదాకా ఎవరూ వెళ్ళని ధ్రువ ప్రాంతంలో తొలిసారిగా దిగి, అక్కడి పరిస్థితులను శోధించాలనే ఇస్రో ప్రయత్నం నిజంగా అభినందనీయం. ఇక చంద్రుడు పైకి ఉపగ్రహాన్ని పంపి, అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన నిలవాలని గతంలో చాలా దేశాలు ప్రయత్నించాయి. 2019లో ఇండియా మాత్రమే కాకుండా ఇజ్రాయిల్ కూడా ప్రయోగం చేసింది. కాకపోతే ఇది విఫలమైంది. 2022 వ్యోమ నౌకతో ల్యాండర్_ రోవర్ ను పంపాలని ప్రయత్నించిన జపాన్, అలాగే రోవర్ ను పంపాలని అనుకున్న యూఏఈ సైతం విఫలమయ్యాయి. అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు ఉష్ణోగ్రత, ఉపరితలం రీత్యా సురక్షితం, సులభమైన చంద్రమండల భూమధ్యరేఖ వద్ద ఉపగ్రహాన్ని దింపాయి. లోయలు, అగ్ని బిలాలు లేకుండా సౌర శక్తికి పుష్కలమైన సూర్య రశ్మి ఉండే ఆ ప్రాంతంలో పరికరాలు దీర్ఘకాలం పనిచేస్తాయి. కానీ, చంద్రయాన్_3 చేరాల్సిన ధ్రువ ప్రాంతం _230 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయే అత్యంత క్లిష్టమైన శీతల ప్రాంతం.
ప్రస్తుత ప్రయోగం విజయవంతం అయితే తొట్ట తొలిగా అలాంటి దక్షిణ ధ్రువం వద్ద దిగిన మిషన్ గా చంద్రయాన్_3 మన దేశానికి ఘన కీర్తి కట్టబెడుతుంది. చంద్రమండల రహస్యాల శోధన, చేదనలో మన జెండా రెపరెపలాడుతుంది. ఇక ఈ ప్రయోగం ద్వారా జాబిల్లిపై ధ్రువాల వద్ద గడ్డకట్టిన చలిలో చిక్కిన శిలలు, మట్టి కాలగతికి దూరంగా స్తంభించిన ఆదికాలపు సౌర వ్యవస్థ తాలూకు ఆచూకిని పట్టింగలవు. దీనివల్ల విశ్వానికి సంబంధించిన కీలక ఆధారాలు లభిస్తాయి. భూమి నుంచి చంద్రుడితోపాటు, చంద్రుడు నుంచి భూమిని చూసేందుకు లో చూపు కలుగుతుంది. ఇక ఈ ప్రయోగం తొలి దశ సవాళ్లు విజయవంతంగా ఎదుర్కొంది కాబట్టి.. మలి దశలోనూ ఈ సవాళ్ళను పూర్తి చేస్తే చంద్రుడిపై భారతదేశానికి శాశ్వత స్థావరాలు ఏర్పడతాయి. భౌగోళిక రాజకీయ పోరులో భారతదేశానికి అతిపెద్ద ఊరట లభిస్తుంది. ఇన్ని ఉద్విగ్నభరితమైన కోణాలు ఉన్నందువల్లే చంద్రయాన్_3 ప్రయోగాన్ని భారత్ సవాల్ గా తీసుకుంది.. మిగతా ప్రపంచం భారత్ వైపు ఆసక్తిగా గమనిస్తోంది.
