Chandrababu Naidu : చంద్రబాబు ఒక్క నిర్ణయం.. వాళ్లంతా హైరానా
ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు రెండు పడవలపై కాలు వేసి ప్రయాణం సాగించాలని చూస్తున్నారు. అటు అభివృద్ధి చేస్తానంటూనే సంక్షేమ పథకాలు భారీ స్థాయిలో ప్రకటిస్తున్నారు.

Chandrababu Naidu : రాజకీయాల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఒక్కో నాయకుడికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. చంద్రబాబు ఆలోచనలన్నీ భిన్నంగా ఉంటాయి. ఆయన హయాంలో ఐటీ, పరిశ్రమలు వంటి వాటిపై ఫోకస్ ఉండేది. దీంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఆపై వర్గాలు టర్న్ అయ్యాయి. సహజంగా ఈ తరహా వారంతా పట్టణాలు, నగరాల్లోనే ఉంటారు. అందుకే అర్బన్ ప్రాంతాల్లో చంద్రబాబుకు ఫేవర్ గా ఉండేది. ఇప్పటివరకూ అదే కొనసాగుతోంది. అయితే టీడీపీ తాజా మేనిఫెస్టోతో అర్భన్ ఓటర్లు ఎటు టర్న్ అవుతారా అన్న చర్చ ప్రారంభమైంది.
టీడీపీ స్థాపించి బరిలో దిగిన తొలి ఎన్నికల్లో సమాజంలో అన్నివర్గాల వారు సపోర్టు చేశారు. అయితే ఎన్టీఆర్ గద్దెనెక్కాక.. ఆయన చర్యలను చూసిన అర్భన్ ఓటర్లు పార్టీకి దూరమయ్యారు. మళ్లీ కాంగ్రెస్ పంచన చేరారు. ఎన్టీఆర్ అద్భుత విజయాలు సాధించినా ఆయన వెనక రూరల్ ఓటర్లే బలంగా నిలబడ్డారు కానీ అర్బన్ ఓటర్లు అపుడు కాంగ్రెస్ కే జై కొట్టారు. వారే మధ్యతరగతి ఉన్నత వర్గాలు అన్న మాట. 1995 వరకూ అస్సలు వారు టీడీపీ దరి చేరలేదు. అలాంటి వారిని చంద్రబాబు తనదైన పాలనా సంస్కరణలతో పూర్తిగా తిప్పుకున్నారు.
చంద్రబాబు ఎప్పుడూ సంక్షేమానికి దూరమే. అభివృద్ధి నినాదమే ఆయన నైజం. ఐటీతో పాటు సంస్కరణలంటూ ఉండేవారు. అయితే ఈ క్రమంలో ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా గుర్తింపు పొందారు. 1995 నుంచి 2004 మధ్య మంచి పాలన అందించారు అని అందరూ చెబుతారు. రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల్లో తటస్థులు సైతం చంద్రబాబు వైపు మొగ్గుచూపింది ఆ కారణం చేతనే. విభజిత ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తారని మద్దతు ఇచ్చారు. 2019లో మాత్రం సంక్షేమ పథకాల ప్రకటనలు జగన్ ను గెలిపించాయి. అభివృద్ధి కంటే జగన్ సంక్షేమానికే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో అర్భన్ ఓటర్లు చంద్రబాబుకు వన్ సైడ్ గా మద్దతు తెలుపుతున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు రెండు పడవలపై కాలు వేసి ప్రయాణం సాగించాలని చూస్తున్నారు. అటు అభివృద్ధి చేస్తానంటూనే సంక్షేమ పథకాలు భారీ స్థాయిలో ప్రకటిస్తున్నారు. దీంతో అర్బన్ ఓటర్లలో పునరాలోచన ప్రారంభమైంది. చంద్రబాబు విజనరీ అనుకుంటే మళ్ళీ ఇదేమిటి అని కలవరపడుతున్నారు. ఏపీ అప్పులను తిప్పలను గట్టెకించే నేర్పరిగా బాబుని చూసిన వారికి జగన్ ను అనుసరించాలని చంద్రబాబు చూడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి బదులు అభివృద్ధి స్టాండ్ పై ఉండిపోవాల్సి ఉండేదని చెబుతున్నారు. కానీ జగన్ సంక్షేమాన్ని.. సంక్షేమంతో కొట్టాలని బాబు చూస్తున్నారు. ఇది ఏ పరిస్థితికి దారి తీస్తుందో చూడాలి.
