Chandrababu’s arrest: చంద్రబాబు అరెస్ట్ : తెలంగాణలో ఆ నేతలెందుకు ఉలిక్కి పడుతున్నారు?
ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం ఓటర్లు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం వారు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సి ఉంది.

Chandrababu’s arrest : స్కిల్ పథకంలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఏపీలో అక్కడి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. అక్కడి రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈక్రమంలో ఏపీలో పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ శ్రేణులు రోజుకోతీరుగా ఆందోళనలు చేస్తున్నారు. సొంత లాయర్లు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటీషన్లు దాఖలు చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తయితే.. తెలంగాణలోనూ ఓ జిల్లాలో ఏపీకి మించి ఆందోళనలు జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నాయి.
తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లా ఏపీ సరిహద్దుగా ఉంది. ఇక్కడ కమ్మ సామాజికవర్గం వారి ఓట్లు ఎక్కువ. పది నియోజకవర్గాలుగా విస్తరించి ఉన్న ఈ జిల్లాలో గెలుపు ఓటములను కమ్మ సామాజికవర్గం వారు ప్రభావితం చేయగలరు. 2014, 2018 ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు మాత్రమే ఇచ్చి తాము ఎంత ప్రత్యేకమో ఖమ్మం ఓటర్లు చాటారు. ఏపీ సరిహద్దుగా ఉన్న జిల్లా కావడంతో సహజంగానే ఇక్కడ ఆ రాష్ట్ర రాజకీయాలు ప్రభావం చూపుతాయి. ఇక ఇటీవల ఏపీ మాజీ ముఖ్యమంత్రిని అక్కడి సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సహజంగానే ఆ ప్రభావం ఖమ్మం మీద పడింది. పైగా చంద్రబాబు సొంత సామాజివర్గానికి చెందిన వారు అన్ని పార్టీల్లో ఉండటంతో ఆ అరెస్ట్‌ను ఖండించారు. ఆంధ్రా ప్రాంతానికి మించి నిరసనలు చేపట్టారు. అసలే ఎన్నికల సం వత్సరం కావడం, కమ్మ సామాజిక వర్గం ఓటర్లను మచ్చిక చేసుకోవాలంటే చంద్రబాబుకు మద్దతు పలకాలీ అనే ఉద్దేశంతో నిరసనలకు పిలపునిచ్చారు.
ఇటీవల మమత వైద్య కళాశాల వార్షికోత్సవం జరిగినప్పుడు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా నిర్వహించే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు పిలపునిచ్చారు. అప్పడు ఆ వేదిక మీద మంత్రి హరీష్ రావు ఉండటం విశేషం. ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు చంద్రాబాబు అరెస్ట్‌ను ఖండించారు. ఇక పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క కూడా చంద్రబాబు అరెస్ట్ సరికాదన్నారు. జగన్ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఏకంగా చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసన దీక్షలకు మద్దతు ప్రకటించారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, వంటి వారు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్ధతి కాదని నినదించారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ పెద్దలు మౌనంగా ఉంటే.. ఖమ్మంలో మాత్రం ఆ పార్టీ నేతలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మిగతా పార్టీలు కూడా అలానే ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం ఓటర్లు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం వారు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సి ఉంది.
