BJP – Chandrababu : బీజేపీతో చంద్రబాబు.. ఇక తెలంగాణలో కేసీఆర్ గెలిచినట్టే
తెలుగు దేశం పార్టీతో పొత్తు అంటే కచ్చితంగా కేసీఆర్ సెంటిమెంట్ ని రాజేసి 2018 నాటి కాంగ్రెస్ పరిస్థితులనే బీజేపీకి కలుగజేస్తారు అన్న భయం కాషాయదళానికి వెంటాడుతోంది.

BJP – Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. చంద్రబాబు అమిత్ షాతో మీటింగు తరువాత కొత్త చర్చలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబుతో పొత్తునకు బీజేపీ సుముఖంగా ఉందన్న సంకేతాలు రావడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. తెలంగాణలో తాము సహకరిస్తామని.. ఏపీలో మాకు సహకరించండి అంటూ చంద్రబాబు ప్రతిపాదన పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ తెలంగాణలో లాభనష్టాలను భేరీజు వేసుకొని ఏదో ఒక విషయం కన్ఫర్మ్ చేస్తామని అమిత్ షా చంద్రబాబుకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజమా? కాదా? చంద్రబాబు ప్రతిపాదనకు తెలంగాణ బీజేపీ నాయకులు ఒప్పుకుంటారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తెలంగాణలో టీడీపీని చంద్రబాబు యాక్టివ్ చేస్తోంది బీజేపీ కోసమేనన్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీతో పొత్తునకు అక్కడి బీజేపీ నాయకులు విముఖత చూపుతున్నారని టాక్ నడిచింది. చంద్రబాబు తో పొత్తు పెట్టుకుని 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంతలా నష్టపోయిందో వారికి తెలుసు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు హైకమాండ్ కు చేరవేశారు కూడా. పైగా 2004 నుంచి అలసిసొలసిన టీడీపీ కేడర్ ఇతర పార్టీల్లోకి టర్న్ అయ్యింది. 2014 వరకూ పర్వాలేకున్నా.. తరువాత పరిణామాలు టీడీపీని తెలంగాణలో దారుణంగా దెబ్బతీశాయి. మెజార్టీ కేడర్ బీఆర్ఎస్ లోకి, తరువాత ఉన్న కొద్దిపాటి కేడర్ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కావడంతో కాంగ్రెస్ లోకి వెళ్లిందని విశ్లేషణలున్నాయి.
సెటిలర్స్ తో పాటు భాగ్యనగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో టీడీపీకి ఇంతో కొంద ఓటు బ్యాంకు ఉంది. అయితే అది బీజేపీ వైపు టర్న్ అవుతుందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఎన్నికల వేళ ఎలాగోలా తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని కేసీఆర్ బయటకు తీసే అవకాశం ఉంది. అందుకే బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయినా.. ఇటీవల ఇతర రాష్ట్ర కార్యకలాపాలను తగ్గించేశారు. వరుసగా మూడోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చి జాతీయ స్థాయి దృష్టిపెట్టాలని భావిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబుతో పొత్తు అంటే కాషాయదళం తెగ కలవరపడుతోంది. తెలుగు దేశం పార్టీతో పొత్తు అంటే కచ్చితంగా కేసీఆర్ సెంటిమెంట్ ని రాజేసి 2018 నాటి కాంగ్రెస్ పరిస్థితులనే బీజేపీకి కలుగజేస్తారు అన్న భయం కాషాయదళానికి వెంటాడుతోంది.
తెలంగాణ బీజేపీలో మెజార్టీ కేడర్ మాత్రం సొంతంగా బరిలో దిగడమే మేలని చెబుతున్నారు. టీడీపీతో పొత్తు వద్దని తేల్చేస్తున్నారు. మేలు కంటే కీడే ఎక్కువ అని చెబుతున్నారు. అమిత్ షా తో భేటీ సందర్భంగా చంద్రబాబుతో తెలంగాణా టీడీపీ సాయం ఎంత వరకూ తీసుకోవాలన్న దాని మీదనే ఎక్కువగా సాగినట్లుగా ప్రచారంలో ఉంది. కేసీఆర్ పార్టీ ప్రాంతీయ వాదం నుంచి జాతీయ వాదంలోకి మారిన పరిస్థితుల్లో మునుపటిలా మాట్లాడలేరని టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ తెలంగాణలో అధికారం కోసం జాతీయ వాదాన్ని పక్కనపెట్టగల నేర్పరి కేసీఆర్. అందుకే బీజేపీ నేతలు చంద్రబాబుతో దోస్తీ వద్దంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరీ.
