Chandrababu- Amit Shah: అమిత్ షాతో భేటి సీక్రెట్ బయటపెట్టిన ‘బాబు’
తెలంగాణ ముఖ్యమంత్రి విధ్వంసం చేయలేదన్నారు. టీడీపీ నాడు ప్రారంభించిన అభివృద్ధిని ఆపలేదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి అభివృద్ధి జరగకుండా విధ్వంసానికి పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Chandrababu- Amit Shah: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఇంకా చర్చ కొనసాగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాతో చంద్రబాబు సమావేశమయ్యారు. పొత్తుల దిశగా చర్చలు జరిగాయని తెలుస్తోంది. తమకు తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. పొత్తు కోసమే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణ పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
అధికారంలోకి వస్తాం..
ఏపీలో వందకు వెయ్యి శాతం టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు అయిన తరువాత తెలుగు జాతికి బలమైన పార్టీగా టీడీపీ ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలంగాణలోనూ టీడీపీ కళకళలాడుతోందన్నారు. ఇందులో అనుమానం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన చంద్రబాబును పార్టీ నేతలు సన్మానించారు. ఈ సమయంలో చంద్రబాబు రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితుల పైన స్పందించారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగైందన్నారు.
అమిత్‌షాతో భేటీ అందుకే..
తెలంగాణ ముఖ్యమంత్రి విధ్వంసం చేయలేదన్నారు. టీడీపీ నాడు ప్రారంభించిన అభివృద్ధిని ఆపలేదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి అభివృద్ధి జరగకుండా విధ్వంసానికి పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ సమావేశానికి ముందు పార్టీ నేతలతో జరిగిన టెలి కాన్ఫిరెన్స్‌లో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రస్తావన వచ్చింది. పార్టీ నేతలు దీని గురించి మాట్లడగా.. చంద్రబాబు తాను కేసుల కోసం ఢిల్లీకి వెళ్లలేదని.. రాష్ట్ర భవిష్యత్ కోసమే ఢిల్లీకి వెళ్లి కలిశానని చెప్పుకొచ్చారు. పొత్తుల గురించి ఎన్నికల వేళ మాట్లాడుదామన్నారు. తాజా సమావేశంలో చంద్రబాబ సమక్షంలోనే పార్టీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీలో అమిత్‌షాను తెలుగు ప్రజల కోసమే కలిసారన్నారు. రాజకీయాల కోసం.. కేసుల మాఫీ కోసం కాదని రావుల వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం తెలంగాణలో కీలక పాత్ర పోషిస్తుందని
ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలోకి రావటానికి అందరం కలిసి పని చేద్దామని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇక పొత్తులపై ప్రాథమిక స్థాయిలోనే చర్చలు జరిగాయని.. నిర్ణయం జరగలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.
