Chandrababu: సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్న చంద్రబాబు
హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం మధ్యంతర బెయిల్ పై తీర్పు వచ్చింది. బెయిల్ ప్రక్రియ పూర్తయ్యేసరికి సాయంత్రం నాలుగు గంటలు దాటింది. సరిగ్గా 4.40 గంటలకు చంద్రబాబు జైలు నుంచి బయటకు అడుగుపెట్టారు.

Chandrababu: టిడిపి అధినేత చంద్రబాబు ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకున్నారు. అవినీతి కేసుల్లో అరెస్టైన చంద్రబాబు మంగళవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదలయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. దారి పొడవునా అభిమానుల సందడి, హారతులిచ్చి స్వాగతం పలకడంతో నాలుగు గంటల ప్రయాణం.. కాస్తా 14 గంటల ప్రయాణంగా మారింది.
హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం మధ్యంతర బెయిల్ పై తీర్పు వచ్చింది. బెయిల్ ప్రక్రియ పూర్తయ్యేసరికి సాయంత్రం నాలుగు గంటలు దాటింది. సరిగ్గా 4.40 గంటలకు చంద్రబాబు జైలు నుంచి బయటకు అడుగుపెట్టారు. అప్పటికే వివిధ ప్రాంతాల నుంచి టిడిపి శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. దీంతో జైలు ప్రాంగణం జై చంద్రబాబు నినాదంతో మార్మోగింది. టిడిపి శ్రేణులను కట్టడి చేయడం పోలీసులకు మారింది. బారికేట్లు ఏర్పాటుచేసిన టిడిపి శ్రేణులు తోసుకుంటూ ముందుకు వచ్చారు. అదే సమయంలో రాజమండ్రి నగరంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. అయితే చంద్రబాబు నగరాన్ని దాటిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.
జైలు నుంచి వచ్చిన మరుక్షణం చంద్రబాబుకు కమెండోలు భద్రత కల్పించారు. భారీ కాన్వాయ్ నడుమ చంద్రబాబు ఉండవల్లి బయలుదేరారు. అయితే రోడ్డు మార్గంలో అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారు. మహిళలు దారి పొడవున హారతులు పట్టి తమ అభిమాన నేతను చూసి భావోద్వేగానికి గురయ్యారు. సుమారు 14 గంటలపాటు చంద్రబాబు రోడ్డు ప్రయాణం చేసి ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకున్నారు. అటు రాజధాని రైతులు, టిడిపి శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. ఉండవల్లి లోని నివాసానికి చేరుకోగానే చంద్రబాబుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం దిష్టి కూడా తీశారు. మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకొని గుమ్మడికాయలు కొట్టారు. మొత్తానికైతే చంద్రబాబుకు టిడిపి శ్రేణులు, రాజధాని రైతులు బ్రహ్మరథం పట్టారు
