Jagan: ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు వైసీపీ తీరును ఎండగట్టేందుకు సోమవారం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ ను కలిశారు. రాష్ర్టంలో పరిస్థితిపై వివరించారు. వైసీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షంపై అన్ని దారుల్లో దాడి చేసేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తోందన్నారు. దీనిపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఏపీలో 356 ఆర్టికల్ విధించి అధికార పక్షం ఆగడాలను అడ్డుకోవాలని అన్నారు. జగన్ సర్కారు చర్యలపై రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు. పోలీసుల అండదండలతో ఏపీలో ఉగ్రవాద చర్యలను తలదన్నేలా జగన్ పాలన తీరు ఉందన్నారు. జగన్ అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే ప్రతిపక్షం మనుగడ కష్టమవుతుందన్నారు. రోజురోజుకు పరిస్థితులు విషమిస్తున్నాయి. అధికార పక్షం కుట్రలు పెరుగుతన్నాయి. ఫలితంగా ప్రతిపక్షం ఆర్థిక మూలాల్ని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారు.
గతంలో వైఎస్ రాజారెడ్డి కూడా ఇలాగే ప్రతిపక్షాన్ని దెబ్బతీసే వారని చెబుతారు. ఇదే సంప్రదాయాన్ని ఇప్పుడు జగన్ కూడా పాటించడం దారుణం. నిజాయితీగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీసేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. దీంతోనే తాము రాష్ర్టంలో మనలేకపోతున్నామని వాపోయారు. జగన్ దూకుడుకు కళ్లెం వేయాలని కోరారు.
ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న పరిస్థితి దేశవ్యాప్తంగా పాకితే ప్రతిపక్షాలు నిలబడలేవని అన్నారు. అందుకే దీనికి ఇక్కడే చరమగీతం పాడాలన్నారు. జగన్ వల్ల తమకు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మాకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. ఇంకా ఎన్నికలు రాకముందే పరిస్థితి ఇలా ఉంటే అప్పుడు ఏ విధంగా ఉంటుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.