Pawankalyan – Chandrababu : ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్న చంద్రబాబు
జనసేన కార్యక్రమాలకు సంబంధించి పవన్ ఆఫీషియల్ జనసేన నుంచే ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తుంటారు. నియామకాలు, ఆదేశాలు ఇలా అన్నింటినీ అధికారికంగా ప్రకటిస్తుంటారు. ఇప్పుడు అదే ఫార్ములాను టీడీపీ అనుసరించడం విస్తుగొల్పుతోంది. పవన్ ను చంద్రబాబు ఫాలో అవుతున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Pawankalyan – Chandrababu : నాన్చుడు ధోరణికి కేరాఫ్ చంద్రబాబు. చివరి దాకా సాగదీయడం ఆయన నైజం. మొహమాటంతో నిర్ణయాల్లో చాలా జాప్యం చేస్తుంటారు. పార్టీలో నియామకాలైనా, టిక్కెట్లు అయినా ఆయనది అదే పంధా. చివరి తేదీ వరకూ బీఫారాలు అందించలేని పరిస్థితి కూడా గతంలో ఉంది. అందుకు ఆయనతో పాటు పార్టీ సైతం మూల్యం చెల్లించుకున్న సందర్భాలున్నాయి. ప్రస్తుతం మాత్రం చంద్రబాబు కాస్తా మారినట్టు కనిపిస్తున్నారు. కొన్నింటి ముందంజ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ను చూసిన తరువాత తనలో తాను మార్పు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నియమించారు. పవన్ పార్ములా తరహాలో నియామకాన్ని వెల్లడించారు. కన్నా కొద్దినెలల కిందట టీడీపీలో చేరారు. గత ఎన్నికల ముందు వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యులను చేస్తూ కన్నాను బీజేపీ హైకమాండ్ తొలగించింది. అప్పటి నుంచి పార్టీపై అయిష్టతగానే ఉన్నారు. తనను తొలగించి బద్ధ శత్రువు అయిన సోము వీర్రాజుకు అధ్యక్ష స్థానం ఇచ్చేసరికి కన్నా మరింత రగిలిపోయారు. సరైన సమయం చూసి టీడీపీలోకి జంప్ చేశారు. చంద్రబాబు కన్నాకు ఎక్కడ సర్దుబాటు చేస్తారో? అని చర్చ సాగింది. దానికి తెరదించుతూ సత్తెనపల్లి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.
2019 వరకూ సత్తెనపల్లికి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. వైసీపీ వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. అటు తరువాత ఆయన తనయుడు కోడెల శివరాం తెరపైకి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు సైతం సీటు కోసం బలంగా పోటీపడుతున్నారు. మరో నేత మన్నెం శివనాగమల్లేశ్వరరావు సైతం ఆశావహుడిగా ఉన్నారు. ఈ ముగ్గురు ఎవరికి వారే అన్నట్టు ఉన్నారు. కానీ అనూహ్యంగా కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించి ముగ్గురు నేతలకు చంద్రబాబు గట్టి షాకిచ్చారు.
కన్నా లక్ష్మీనారాయణ నియామకపత్రం విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ఫాలో అయినట్టు కనిపిస్తోంది. అచ్చం జనసేన ప్రెస్ నోట్ లు మాదిరిగా రిలీజ్ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అఫీషియల్ టీడీపీ నుంచి కన్నా నియామకపత్రాన్ని రిలీజ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అచ్చెన్నాయుడు నియామకపత్రాన్ని జారీచేశారు. జనసేన కార్యక్రమాలకు సంబంధించి పవన్ ఆఫీషియల్ జనసేన నుంచే ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తుంటారు. నియామకాలు, ఆదేశాలు ఇలా అన్నింటినీ అధికారికంగా ప్రకటిస్తుంటారు. ఇప్పుడు అదే ఫార్ములాను టీడీపీ అనుసరించడం విస్తుగొల్పుతోంది. పవన్ ను చంద్రబాబు ఫాలో అవుతున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
