Chandrababu Naidu : ప్రశ్నించిన కాపు యువకుడు దొంగనా? చంద్రబాబు ఏంటిది?
ఇటువంటి సందర్భంలో ఓ కాపు యువకుడిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇందుకేనా పవన్ వంత పాడుతున్నారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికైతే చంద్రబాబు తాజా చర్యలపై ముప్పేట విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.

Chandrababu Naidu : ఇటీవల చంద్రబాబులో అసహనం ఎక్కువవుతోంది. అయినదానికి.. కానిదానికి జనాల మీద ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. ఏరికోరి విమర్శలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా తణుకులో ఇటువంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. శుక్రవారం పోరుబాట నిర్వహించారు. అందులో భాగంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులతో చంద్రబాబు ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరణ చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువకుడు గతంలో విపక్ష నేతలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపారని..మీరెందుకు ఆ పనిచేయడం లేదని ప్రశ్నించడంతో చంద్రబాబులో కోపం కట్టలు తెచ్చుకుంది. ఏయ్ ఏం మాట్లడుతున్నావు నువ్వు.. ముందు నేను చెప్పింది వినవయ్యా అంటూ ఏక సంభోదంతో మాట్లాడడం కలకలం సృష్టించింది. విమర్శలకు తావిచ్చింది.
రైతులకు పరామర్శ..
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అకాల వర్షాలతో పంటలకు అపార నష్టం జరిగింది. ఇటీవల చంద్రబాబు పర్యటించారు. రైతులకు అన్నివిధాలా ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అటు పాడైన పంటలను చూసి చలించిపోయారు. జగన్ కనీసం రైతులను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్: చేశారు. అటు మాజీ ముఖ్యమంత్రి హోదాల్లో పర్యటిస్తుండడంతో అధికారులు సైతం ఉరుకులు పరుగులు పెట్టారు. ఇరుకున పడతామని భావించి ప్రభుత్వం సైతం త్వరితగతిన చర్యలు చేపట్టింది. రంగుమారిన ధాన్యం, మొలక వచ్చిన మొక్కజొన్న కొనుగోలుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అయితే చంద్రబాబు మాత్రం రైతుల పరామర్శ పేరుతో రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వడం విమర్శలకు దారితీసింది.
యువ రైతుపై అటాక్..
ఈ క్రమంలో తణుకులో రైతుపోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల నుంచి రైతులను సమీకరించింది. అయితే ఓ యువ రైతు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రభుత్వం మెడలు వంచి నష్టపరిహారం అందిస్తానన్న చంద్రబాబు స్పందనపై ప్రశ్నలవర్షం కురిపించాడు. అసెంబ్లీకే వెళ్లని మీరు ఎలా మా సమస్యపై ప్రశ్నిస్తారని అడగడంతో చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు ఒక్కసారిగా ఆ యువ రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సదరు యువకుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. నేను పోరంబోకు యువకుడ్ని కాదని.. బాధ్యత గల రైతు అని.. కాపు కులం వాడినని చెప్పినా చంద్రబాబు అండ్ కో వెనక్కి తగ్గలేదు. ‘ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్’.. పక్కకు తీసేయ్యండి అంటూ పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు పక్కనే ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే వీడొక దొంగ..వాడొక దొంగ అంటూ తిట్ల దండకానికి పూనుకులున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే వైరల్ అవుతున్నాయి.
సరిగ్గా ఇటువంటి సమయంలోనే..
టీడీపీతో పొత్తులు, సీఎం పదవిపై పవన్ విస్ఫష్ట ప్రకటన చేసిన నేపథ్యంలో కాపు సామాజికవర్గం ఆగ్రహంగా ఉందని వార్తలు వస్తున్నాయి. అటు చంద్రబాబు పల్లకిని పవన్ మోస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదంతా చంద్రబాబు కోసమేనన్నట్టు ప్రచారం మొదలుపెట్టాయి. ఇటువంటి సందర్భంలో ఓ కాపు యువకుడిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇందుకేనా పవన్ వంత పాడుతున్నారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికైతే చంద్రబాబు తాజా చర్యలపై ముప్పేట విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.
