Chandrababu Arrest : అదును చూసి చంద్రబాబు అరెస్ట్
మొత్తానికైతే గత నాలుగున్నర ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన.. చంద్రబాబు అరెస్టు పర్వాన్ని పూర్తి చేయగలిగారు.

Chandrababu Arrest : చంద్రబాబు ఊహించిందే జరిగింది. తనను అరెస్టు చేస్తారేమో అని మూడు రోజుల క్రితం చంద్రబాబు అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.అందుకు తగ్గట్టుగానే నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పకుండానే.. పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదంతా పక్క ప్లాన్తో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సరిగ్గా కోర్టుకు సెలవు సమయంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలోని చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయనను సీఐడీ అరెస్ట్ చేసింది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.
వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అరెస్టుపై రకరకాల ప్రచారం జరిగింది. అదిగో అరెస్టు.. ఇదిగో అరెస్టు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్ల తర్వాత చంద్రబాబును టచ్ చేయగలిగారు. అయితే చంద్రబాబును ఐటీ ముడుపుల కేసుల అరెస్ట్ చేశారా? అంగళ్ల ఘటనలోనా? లేకుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులోనా? అన్నది బయటకు చెప్పకుండా చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకోవడం విశేషం.
ప్రస్తుతం చంద్రబాబు నంద్యాలలో రాజకీయ పర్యటనలో ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు పర్వం ప్రారంభమైంది. తెల్లవారుజాము వరకు హై డ్రామా కొనసాగింది. రెండు బెటాలియన్ల పోలీసులు చంద్రబాబు బస చేసిన ప్రాంతాన్ని మోహరించారు. అటు టిడిపి శ్రేణులు సైతం అక్కడకు భారీగా చేరుకున్నాయి. అసలు ఏ కేసులో తమ అధినేతను అరెస్టు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశాయి. చంద్రబాబు సైతం తాను తప్పు చేస్తే నడిరోడ్డుపై ఉరితీయాలని సవాల్ చేశారు. పోలీసులు మాత్రమే అన్ని రిమాండ్ రిపోర్టులో ఉన్నాయని చెప్పుకొచ్చారు.
చంద్రబాబును జైల్లో పెట్టాలని జగన్ సర్కార్ ఎప్పటినుంచో ప్రయత్నాల్లో ఉంది. దీనిని ఊహించే చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. సిబిఐ కేసుల్లో తన అరెస్టుకు చంద్రబాబు కారణమని జగన్లో అనుమానం ఉంది. అందుకే చంద్రబాబును ఒకరోజైనా జైలుకు పంపాలని జగన్ భావించినట్లు వార్తలు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు ఏమైనా ఉన్నాయా? అని శూల శోధన చేశారు. ఇందుకుగాను ప్రత్యేక అధికార గణాన్ని నియమించారు. గత నాలుగున్నరేళ్లుగా చాలా అభియోగాలు చంద్రబాబుపై మోపారు. అవన్నీ ప్రచారానికి పనికొచ్చాయిగాని.. ఏవి నిరూపితం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఇన్ఫ్రా కంపెనీల నుంచి ముడుపులు.. స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో అభియోగాలు మోపగలిగారు. చంద్రబాబును అరెస్టు చేయగలిగారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు కావడంతో వ్యూహాత్మకంగా అరెస్టు పర్వానికి తెర తీసినట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికైతే గత నాలుగున్నర ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన.. చంద్రబాబు అరెస్టు పర్వాన్ని పూర్తి చేయగలిగారు.
