Chandrababu Arrest: జాతీయస్థాయిలో చంద్రబాబు అరెస్ట్ రచ్చ
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో టిడిపి సీనియర్లు అందరూ ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ లోకేష్ ఉండడంతో.. పార్టీ ఎంపీలతో కలిసి నిరసన చేపట్టారు.

Chandrababu Arrest: జాతీయస్థాయిలో చంద్రబాబు అరెస్ట్ విస్తృత చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే నారా లోకేష్ ఢిల్లీ వేదికగా గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో సైతం చంద్రబాబు అరెస్ట్ అంశం హాట్ టాపిక్ గా మారింది. అక్రమంగా అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుండగా.. పూర్తి ఆధారాలతోనే అరెస్టు జరిగిందని వైసీపీ చెబుతోంది. దీంతో అసలు ఏపీలో ఏం జరుగుతోందని జాతీయస్థాయి నాయకులు ఆరా తీస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుంచే చంద్రబాబు అరెస్టుపై గలాటా ప్రారంభం కావడం విశేషం.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో టిడిపి సీనియర్లు అందరూ ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ లోకేష్ ఉండడంతో.. పార్టీ ఎంపీలతో కలిసి నిరసన చేపట్టారు. చంద్రబాబు అరెస్టుపై జాతీయస్థాయి నాయకులు స్పందించాలని.. కేంద్రం కలుగజేసుకోవాలని నినదించారు. అటు లోకేష్ సైతం నేషనల్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. డిబేట్ లలో పాల్గొంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై బలమైన వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడు దీనికి పార్లమెంట్ సమావేశాలు తోడు కావడంతో.. చంద్రబాబు అరెస్ట్ అంశం జాతీయస్థాయిలో హాట్ టాపిక్ గా మారింది.
చంద్రబాబు అరెస్టు పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. తొలుత లోక్ సభలో ఎంపీ గల్లా జయదేవ్ దీనిపై మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఓ నాయకుడిని అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని ఆరోపించారు. కనీస ఆధారాలు లేకుండా, నిబంధనలు పాటించకుండా అరెస్టు చేసిన వైనాన్ని వివరించారు. దీనికి వైసిపి ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మిధున్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో వైసీపీ ప్రభుత్వ ప్రమేయం లేదన్నారు. పూర్తి ఆధారాలతోనే చంద్రబాబు అరెస్టు జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆయనపై మిథున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ఈ అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు. 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు అభివృద్ధి అంటూ ఏమీ చేయలేకపోయారని చెప్పుకొచ్చారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబుని ఆరోపించారు. వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరు అని.. బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలకు ఆయన వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకొని ఇన్నేళ్లు బయటపడ్డారని.. ఆయన విషయంలో వైసిపి ప్రభుత్వం ఎటువంటి కక్షపూరితంగా వ్యవహరించలేదన్నారు. ఆయన చేసిన అవినీతి ఫలితంగానే కేసులు, జైలు జీవితం అని గుర్తు చేశారు
