Chandrababu- ABN RK: చంద్రబాబు మళ్లీ సీఎం కాకుండా కంకణం కట్టుకున్న ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’

వివేకానందారెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేస్తారని ఏబీఎన్‌ ఎప్పటి నుంచో కోడై కూస్తోంది. హెలీకాప్టర్‌లో వేస్తున్నారు, కడప దాటారు, జమ్మలమడుగులో మకాం వేశారు.

  • Written By: Naresh
  • Published On:
Chandrababu- ABN RK: చంద్రబాబు మళ్లీ సీఎం కాకుండా కంకణం కట్టుకున్న ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’

Chandrababu- ABN RK: బాకా ఊదితే వినసొంపుగా ఉండాలి. అంతేకానీ చెవులకు చిల్లులు పడకూడదు. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఏబీఎన్‌ అలాంటి ఘనకార్యమే చేస్తోంది. ఆ చానల్‌ యజమాని వేమూరి రాధాకృష్ణ కంటే రెండు ఆకులు ఎక్కువ చదివిన ఆ చానెల్‌ జర్నలిస్టులు అంతకుమించి ‘పచ్చ’ స్తోత్రం చదువుతున్నారు. అతి శ్రుతి మించిపోయి ఏవగింపు కలుగుతోంది. ఇక ఆ చానెల్‌ చేస్తున్న అతి వల్ల టీడీపీ కార్యకర్తలు కూడా తలలు పట్టుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఏపీలో మరో విషయమే లేనట్టు అవినాష్‌ అంశాన్నే బ్యానర్‌ వార్తలుగా రాస్తోంది. మొన్నటి వరకు తెలంగాణ ఎడిషన్‌లో ఆంధ్రా వార్తలకు చోటు ఇవ్వని ఆ పత్రిక ఏకంగా సెకండ్‌ బ్యానర్‌ గా ప్రచురిస్తోంది. ముఖ్యంగా ఏపీలో అవినాష్‌ వార్తలకు ఇచ్చిన ప్రయారిటీని తెలంగాణలోనూ ఇస్తోంది.

ఇక టీడీపీ అధికారంలోకి వస్తే పేదలకు భూములు ఇవ్వదని సాక్షాత్తూ ఏబీఎన్‌ న్యూస్‌ ప్రజెంటర్‌ వెంకటకృష్ణ ఘంటాపథంగా చెబుతున్నాడు. పైగా ఉచితాలకు టీడీపీ వ్యతిరేకమని స్పష్టం చేస్తున్నాడు. అసలే అమరావతి పేదల మంట మీద ఉన్న నేపథ్యంలో వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. టీడీపీకి మంచి చేయబోతున్నామని ఏబీఎన్‌ చానెల్‌ కవరింగ్‌ ఇవ్వొచ్చేమో గానీ.. క్షేత్రస్థారులో జరుగుతున్న డ్యామెజీని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక వెంకట కృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడని ఎప్పటి నుంచో వేచి చూస్తున్న వైసీసీ సోషల్‌ మీడియా బ్యాచ్‌.. అతడి వీడియో క్లిప్పింగ్‌లను దర్జాగా ట్రోల్‌ చేస్తోంది. సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ టీడీపీని డైలమాలో పడేస్తోంది. దీంతో అటు టీడీపీ క్యాడర్‌ కూడా ఏబీఎన్‌ మనకు మంచి చేస్తోందా? 2019 లాగానే పుట్టి ముంచే ప్రయత్నాలు చేస్తోందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

వివేకానందారెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేస్తారని ఏబీఎన్‌ ఎప్పటి నుంచో కోడై కూస్తోంది. హెలీకాప్టర్‌లో వేస్తున్నారు, కడప దాటారు, జమ్మలమడుగులో మకాం వేశారు, విశ్వభారతి ఆసుపత్రి గేటును పగలగొట్టారు అన్న రేంజ్‌లో బిల్డప్‌ ఇస్తోంది. ఆ చానెల్‌ చెప్పింది జరగకపోవడంతో సీబీఐ పంజరంలో చిలుకలాగా అయిపోయిందంటూ నిష్టూరం వ్యక్తం చేస్తోంది. అంతే కాదు అండర్‌ గ్రౌండ్‌ రిపోర్టింగ్‌ పేరుతో ఏకంగా అవినాష్‌ కాన్వాయన్‌ని ఏబీఎన్‌ చానెల్‌ బృందం వెంబడిస్తోంది. మొన్నటి దాకా వారి ఆగడాలను భరించిన అవినాష్‌ టీం, మొన్న హైదరాబాద్‌లో ఏబీఎన్‌ చానెల్‌ బృందంపై దాడులు చేశారు. దీనిపై పలు జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈసంఘటనతో అసలు ఏబీఎన్‌ చానెల్‌ ను ఎవరు నిర్వహిస్తున్నారు? ఎలా నిర్వహిస్తున్నారు? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

వాస్తవానికి 2019లో కూడా ఏబీఎన్‌ చానెల్‌ ఇలానే చేసింది. అతి రిపోర్టింగ్‌తో చంద్రబాబును మాయ చేసింది. కచ్చితంగా గెలుస్తామంటూ ఊదరగొట్టింది. ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. టీడీపీ చర్రితలో దక్కని ఓటమి లభించింది. 23 సీట్ల దగ్గర ఆగిపోయింది. మొన్నటి ఎమ్మెల్సీల విజయం దాకా ఒక్కటంటే ఒక్కటి టీడీపీకి చెప్పుకొదగ్గ విజయం లభించలేదు. ఈ ఎమ్మెల్సీల విజయం తర్వాత ఏబీఎన్‌ మళ్లీ దరువందుకుంది. ఇటీవల ఆ దరువు మరింత శృతి మించింది. అది టీడీపీకి మంచి చేస్తోందని ఏబీఎన్‌ అనుకుంటోంది కానీ… తీవ్ర నష్టం చేకూర్చుతోందనే విషయాన్ని తెలుసుకోలేకపోతోంది. వాస్తవానికి జగన్‌కు వ్యతిరేకంగా నిలబడటం అంటే టీడీపీకి సపోర్ట్‌ చేయడంకాదు. ఈ విషయాన్ని విస్మరించి ఏబీఎన్‌ నానా యాగీ చేస్తోంది. అందులో పని చేసే జర్నలిస్టులు సగటు టీడీపీ కార్యకర్త కంటే రెచ్చిపోయి విమర్శలు చేస్తున్నారు. ఇక ఆ వెంకటకృష్ణ తీరు సరేసరి. క్షేత్రస్థాయిలో జగన్‌ ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత ఉంది. దాన్ని క్యాష్‌ చేసుకోవడంలో టీడీపీ ఫెయిల్‌ అవుతోంది. ఏబీఎన్‌ వల్ల మరింత అభాసుపాలవుతోంది. పాపమ్‌ ఈ సారైనా పార్టీ గెలవాలని చంద్రబాబు అనుకుంటుంటే ఆ ఆర్కే దాన్ని నెరవేరనిచ్చేటట్టు లేడు. హేమిటో టీడీపీకి ఈ కష్టాలు!

సంబంధిత వార్తలు