Chandrababu: సుప్రీంకోర్టుకు చంద్రబాబు.. క్వాష్ పిటిషన్ దాఖలు
ఈ కేసుతో అసలు చంద్రబాబుకు సంబంధమే లేదని.. ఎఫ్ఐఆర్లో చివర్లో చంద్రబాబు పేరును నమోదు చేశారని.. అరెస్టు సమయంలో సైతం నిబంధనలు పాటించలేదని చంద్రబాబు న్యాయవాదులు చెబుతున్నారు.

Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం. ఇప్పటివరకు ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టుల పరిధిలో ఉన్న ఈ కేసు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. చంద్రబాబు ఏపీ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే కేసులో చంద్రబాబును రెండు రోజుల పాటు సిఐడి కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇలా చంద్రబాబుకు వరుసుగా షాక్ లు తగిలాయి. ఈ తరుణంలో క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ కాపీని చంద్రబాబు తరుపు న్యాయవాదులు అందజేశారు.దీంతో సోమవారం ఈ కేసు విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ కేసుతో అసలు చంద్రబాబుకు సంబంధమే లేదని.. ఎఫ్ఐఆర్లో చివర్లో చంద్రబాబు పేరును నమోదు చేశారని.. అరెస్టు సమయంలో సైతం నిబంధనలు పాటించలేదని చంద్రబాబు న్యాయవాదులు చెబుతున్నారు. ప్రధానంగా 17 a చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. వాస్తవానికి క్వాష్ పిటిషన్ విచారణలో సానుకూల తీర్పు వస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు ఆశించారు. అయితే దర్యాప్తు తుది దశలో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.
గతంలో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప కేసు విచారణలో సైతం 17a వర్తించిన విషయాన్ని చంద్రబాబు న్యాయవాదులు గుర్తు చేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధిగా ఉన్న చంద్రబాబును అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అని పేర్కొంటున్నారు. అయితే 17 ఏ రాక మునుపే..ఈ కేసు నమోదు, విచారణ ప్రక్రియ ప్రారంభమైందని.. ఈ కేసుకు అది వర్తించదని సిఐడి న్యాయవాదులు చెబుతున్నారు. చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో గవర్నర్ అనుమతి అవసరంలేదని.. స్పీకర్ అనుమతి ఉంటే చాలని.. తాము అదే పని చేసినట్లు సిఐడి న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టులో సోమవారం ఈ కేసు విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సిఐడికి రెండు రోజులు పాటు కస్టడీ కి ఇవ్వడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ప్రారంభమైంది. రేపు కూడా కొనసాగునుంది.
