Junior NTR- Chandrababu: సోషల్ మీడియా వచ్చిన తరువాత కోడిగుడ్లు మీద ఈకలు పీకిన మాదిరిగా వార్తలు, కథనాలు వండి వార్చుతుంటారు. చిన్నఅంశాన్ని కురుక్షేత్ర రణరంగంగా మార్చేస్తుంటారు. అందునా సెలబ్రిటీల విషయంలో చెప్పనక్లర్లేదు. వారి చర్యల కోసం కాపుకాసి వెయిట్ చేస్తుంటారు. వారు పావలా చేస్తే పది రూపాయలను జత చేర్చి రక్తికట్టిస్తుంటారు. ఆ మధ్యన చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘థాంక్యూ మామయ్య’ అంటూ రిప్లయ్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీలో నాటునాటు సాంగ్ గోల్డ్ గ్లోబ్ అవార్డు వచ్చినందుకు చంద్రబాబు స్పందించారు. అయితే చంద్రబాబు చెప్పిన అభినందనల్లో జూనియర్ ఎన్టీఆర్ కు ట్యాగ్ చేయలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబుకు థాంక్స్ చెప్పారు. అప్పట్లో సోషల్ మీడియా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

Junior NTR- Chandrababu
చంద్రబాబు, లోకేష్ లతో తారక్ గతంలో మాదిరిగా సంబంధాలు లేవని వార్తలు వచ్చాయి. వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దానికి సోషల్ మీడియా ప్రచారం తోడైంది. అయిందానికి కానిదానికి వారి మధ్య అవధులు లేని విభేదాలు కొనసాగుతున్నాయని చెప్పడానికి అతిగా ప్రచారం చేయడం ప్రారంభించారు. చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వంటి వాటి విషయంలో జూనియర్ స్పందించిన తీరుపై కూడా కథనాలు వండి వార్చారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ లు లైట్ తీసుకున్నారు. పరస్పరం అభినందనలు తెలుపుకొని మా మధ్య ఉన్న విభేదాలు ఒట్టి మాటగాచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Junior NTR- Chandrababu
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు అభినందించారు. నాటునాటు పాట ఆస్కార్ నామినేషన్ రావడంతో చంద్రబాబు స్పందించారు. తారక్ ను అభినందించడంతో పాటు ట్యాగ్ చేశారు. గతంలో జరిగిన రచ్చ దృష్ట్యా చంద్రబాబు ముందే మేల్కొన్నారు. వాస్తవానికి నాటునాటు సాంగ్ క్రెడిడ్ సంగీత దర్శకుడు కీరవాణి, సింగర్ సిప్లిగంజ్ కు దక్కుతుంది. అందులో నటించి .. డ్యాన్స్ చేసిన వారికి రాదని సినిమా వర్గాలు చెబుతున్నాయి. అందుకే చంద్రబాబు తారక్ కు అప్పట్లో ట్యాగ్ చేయలేదు. కిరవాణికి మాత్రమే చేయగా.. సోషల్ మీడియా రచ్చరచ్చ చేసింది. పెద్దపెద్ద నాయకుల ట్విట్టర్ బాధ్యతను ఏజెన్సీలు చూస్తుంటాయి. చంద్రబాబు ట్విట్టర్ నిర్వహణ బాధ్యత కూడా ఓ ఏజెన్సీ చూస్తోంది. ఆయన అనుమతితో ట్విట్లు పెడుతుంటారు. కానీ అవేవీ తెలియవన్నట్టు సోషల్ మీడియా సృష్టించిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అందుకే చంద్రబాబు ఈసారి కాస్తా జాగ్రత్త పడినట్టున్నారు.