Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ : స్కిల్ కుంభకోణంలో మరో కోణం
అప్పట్లో ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కోసం కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడికక్కడే స్థానిక పారిశ్రామికవేత్తల నుంచి వాటికి మౌలిక వసతులు సమకూర్చినట్లు తెలుస్తోంది.

Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మరో కొత్త కోణం. సి మెన్స్ ఇండియా సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. సంబంధిత సంస్థ ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండానే.. ఏపీ ప్రభుత్వం 300 కోట్లకు పైగా విడుదల చేసిందని.. ఇందులో భారీ అవినీతి జరిగిందని సిఐడి చెబుతోంది. ఈ తరుణంలో ఈ స్కాంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. అంతటా చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలను నెలకొల్పామని నాటి టిడిపి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. సి మెన్స్ సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కేంద్రాల్లో.. దాదాపు రెండు లక్షల మంది శిక్షణ తీసుకున్నారని టిడిపి వర్గాలు వాదిస్తున్నాయి. సిమెన్స్ సంస్థ కేవలం సాంకేతిక పరమైన సాయం చేస్తుందని.. శిక్షణకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుతోందని.. ఇందులో అవినీతి జరిగే అవకాశమే లేదని టిడిపి వర్గాలు వాదిస్తున్నాయి. నిరాధార ఆరోపణలతోనే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ కేసులో కొత్త అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది.
అప్పట్లో ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కోసం కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడికక్కడే స్థానిక పారిశ్రామికవేత్తల నుంచి వాటికి మౌలిక వసతులు సమకూర్చినట్లు తెలుస్తోంది. సంబంధిత పారిశ్రామికవేత్తలు తమ కంపెనీ అకౌంట్లో ఈ ఖర్చుల మొత్తాన్ని చూపినట్లు తా జాగా వెలుగులోకి వస్తోంది. మరి ఇదే నిజమైతే సి మెన్స్ సంస్థ సమకూర్చిన సాంకేతిక పరికరాలు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాటేమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ప్రస్తుతం చంద్రబాబు అరెస్టులో సిఐడి పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. కేసులు మీద కేసులు పెడుతోంది. పాత కేసులను సైతం తిరగదోడుతోంది. ఈ తరుణంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సరికొత్త కోణం వెలుగు చూడడం విశేషం. దీనిపై సైతం సిఐడి ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు? అక్కడ సమకూర్చిన వసతులేవి? స్థానికంగా ఏ పారిశ్రామికవేత్త సాయం తీసుకున్నారు? అసలు కేంద్రంలో ఖర్చుపెట్టినది ఎంత? ఎంతమంది శిక్షణ తీసుకున్నారు? వంటి అంశాలపై సిఐడి దృష్టి పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఈ కోణంతో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది.
