Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్: జగన్ కు బీజేపీ మద్దతు ఉందా?
సీఎం జగన్ లండన్ పర్యటన నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో 13, 14 తేదీల్లో జగన్ ఢిల్లీ వెళుతున్నారని.. ప్రధాని మోదీ, అమిత్ షాలతో సమావేశం అవుతారని వైసీపీ శ్రేణులు ప్రచారాన్ని ప్రారంభించాయి.

Chandrababu Arrest: ఏపీ సీఎం జగన్ ఏది చేసినా వ్యూహాత్మకమే. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ప్రత్యర్థులపై కేసులు నమోదు చేసినా, వేధింపులకు గురిచేసినా దానికి పుణ్యం, పురుషార్థం ఉంటుంది. తనకు తానుగా అది చేయడం లేదని.. కేంద్ర పెద్దల అనుమతితోనే.. అలా చేస్తున్నట్లు ప్రజల్లో భ్రమ కల్పించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు విషయంలో సైతం అదే రకం ఎత్తుగడతో జగన్ ముందుకు సాగుతున్నారు. లండన్ పర్యటనలో ఉండగా.. డైరెక్షన్స్ ఇచ్చిన జగన్… ఇప్పుడు అసలైన డ్రామాకు తెర తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్ళు అవుతుంది. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు రాజధానుల అంశంతో పాటు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే చాలా అంశాల్లో మొండిగా ముందుకు పోయారు. వీటన్నిటికీ కేంద్ర పెద్దల సహకారం ఉందని ప్రతిసారి సంకేతాలు పంపారు. అయితే రాజధానుల అంశంలో ఇది బెడిసి కొట్టింది. తమ మద్దతు అమరావతికేనంటూ బిజెపి తేల్చి చెప్పింది. అమరావతి విషయంలో అడ్డగోలు వ్యవహారాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెక్ చెపుతూ వచ్చింది. అయినా సరే.. మాకు కేంద్ర పెద్దల సహకారం ఉందని.. వారి సలహా సూచనలతోనే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పడంలో మాత్రం జగన్ సర్కార్ ఎప్పటి వరకు సక్సెస్ అవుతూ వచ్చింది.
ఇప్పుడు చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో కూడా జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, పదహారేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు కనీస హక్కులు లేకుండా అరెస్టు చేయడం, వేధింపులకు పాల్పడడం, అది కూడా ఏమాత్రం ఆధారాలు లేని కేసు కావడం విశేషం. దీనిపై ఇప్పుడు వైసీపీ సర్కార్ ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. మున్ముందు వైసీపీ సర్కార్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయ కోవిదులు చెబుతున్నారు. ఈ తరుణంలోనే తమకు కేంద్ర పెద్దల సహాయం ఉందని, వారి అనుమతితోనే చంద్రబాబును అరెస్టు చేశామని చెప్పుకునేందుకు జగన్ కొత్త ఎత్తుగడవేశారు. అందుకు సంబంధించి ప్లాన్ బి అమలకు రంగం సిద్ధం చేశారు.
సీఎం జగన్ లండన్ పర్యటన నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో 13, 14 తేదీల్లో జగన్ ఢిల్లీ వెళుతున్నారని.. ప్రధాని మోదీ, అమిత్ షాలతో సమావేశం అవుతారని వైసీపీ శ్రేణులు ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే నిజానికి అలాంటి అపాయింట్మెంట్లు ఏవీ ఖరారు కాలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు అరెస్టు గురించి వివరించేందుకు జగన్ ఢిల్లీ వెళుతున్నారని.. వారి అనుమతితోనే ఇదంతా చేస్తున్నట్లుగా ఓ పుకారును ప్రజల్లో ముందుగానే పుట్టించడం వ్యూహాత్మకమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
వాస్తవానికి చంద్రబాబు అరెస్టుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ముందుగానే స్పందించారు. అరెస్టు చేసిన తీరును ఖండించారు. అటు బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, జాతీయ పార్టీలో రాజకీయ నిర్ణయాలు తీసుకునే కమిటీలో సభ్యుడు అయిన ఎంపీ లక్ష్మణ్ కూడా స్పందించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తప్పుపట్టారు. సీఎం జగన్ తమ అనుమతితోనే ఇదంతా చేస్తున్నట్లు భ్రమించే అవకాశం ఉన్నందునే.. బిజెపి అగ్రనేతలు ముందస్తుగానే లక్ష్మణ్ తో ప్రకటన ఇప్పించినట్లు తెలుస్తోంది. అయితే తెలివైన వ్యూహానికి అలవాటు పడిపోయిన జగన్ ఈ సరికొత్త డ్రామా ఆడుతున్నారు.
