Chandrababu And Narayana Arrest: ఒకేసారి చంద్రబాబు, నారాయణ అరెస్ట్
అమరావతితో పాటు కీలక ప్రాజెక్టుల విషయంలో టీడీపీ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని వైసీపీ సర్కారు ఆరోపిస్తూ వస్తోంది. ఇటీవల సుప్రీం కోర్టు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఏపీ సీబీసీఐడీ విచారణ చేపట్టింది.

Chandrababu And Narayana Arrest: చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఆయన అరెస్ట్ తప్పదా? చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలను ఒకేసారి అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు, నారాయణలను వదలవద్దని సీబీసీఐడీ అధికారులకు సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు నివాసముంటున్న గెస్ట్ హౌస్ ను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ తయారీ, ఆమోదంలో చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్, మరికొందరు కూడబలుక్కొని వారికి, అనుయాయులకు భారీ లబ్ధి చేకూరేలా, వారి భూములకు మాత్రమే భారీ రేట్లు వచ్చేలా కుట్రలు చేశారని అధికార వైసీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ నమోదు చేసిన కేసులోనే ఈ జప్తు ఉత్తర్వులిచ్చారు.
కోర్టు ఆదేశాలతో చకాచకా..
అమరావతితో పాటు కీలక ప్రాజెక్టుల విషయంలో టీడీపీ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని వైసీపీ సర్కారు ఆరోపిస్తూ వస్తోంది. ఇటీవల సుప్రీం కోర్టు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఏపీ సీబీసీఐడీ విచారణ చేపట్టింది. ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక ఇచ్చింది. ప్రధానంగా చంద్రబాబు, నారాయణలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు గుర్తించింది. వారు రాజధాని ప్లాన్ ను ముందే లీక్ చేశారని నివేదికలో పేర్కొంది. తద్వారా బంధువులు, మిత్రులు ముందే భూములు కొనుక్కునేలా పావులు కదిపారని చెబుతోంది. వాస్తవాలను దాచడం, అవాస్తవాలుగా చిత్రీకరించడం వంటి వాటిపై వివరాలు సేకరించారు. చట్టాలు, ఉత్తర్వులు, సర్క్యులర్లు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాల ఉల్లంఘించడంతోపాటు, ఇతరులు, అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండా నేరపూరితమైన కుట్రతో మార్పులకు ఆమోదముద్ర వేశారని పేర్కొంది.
క్విడ్ ప్రో ఆరోపణలతోనే..
ప్రధానంగా లింగమనేని, హెరిటేజ్‌తో పాటు నారాయణ సంస్థలకు చెందిన బీనామీల భూములు రాజధాని సిటీ మాస్టర్‌ప్లాన్ కింద సేకరించకుండా, ఇన్నర్ రింగ్ వారి భూములకు మరింత సమీపం నుంచి వెళ్లేలా ప్లాన్‌లు ఆమోదింపజేసుకున్నారని వైసీపీ సర్కారు ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు సీఐడీ కూడా అవే ఆరోపణలతో నివేదించడం విశేషం. ముఖ్యంగా క్విడ్ ప్రో కింద లింగమనేనికి లబ్ధి చేకూరినట్టు సాక్షాధారాలతో సీఐడీ ఒక నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం. క్విడ్‌ప్రోకో కింద రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు లే అవుట్, జోనల్ డెవల్‌పమెంట్ ప్లాన్స్ ద్వారా లింగమనేనికి భారీ లబ్ధి చేకూరినందున, లింగమనేని ఇంటిని అమ్మకుండా నిరోధించేందుకు క్రిమినల్ లా అమెండ్‌మెంట్ ఆర్డినెన్స్1944 కింద జప్తు చేసేందుకు, తదుపరి చర్యలు తీసుకునేందుకు సీఐడీ అనుమతి కోరింది. అలాగే నారాయణ సంస్థల సిబ్బంది ఖాతాల్లో ఉన్న నగదును సైతం అటాచ్ చేసింది.
సీఐడీ ఆరాటం అదే..
అయితే ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు, నారాయణలను ఒకేసారి అరెస్ట్ చేయాలని కృతనిశ్చయంతో సీఐడీ ఉన్నట్టు సమాచారం. గత నాలుగేళ్లుగా చంద్రబాబు అరెస్ట్ కు జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది. కానీ చట్టపరమైన అడ్డంకులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానమే క్లియరెన్స్ ఇవ్వడంతో అరెస్ట్ ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. ముందుగా ఆస్తుల అటాచ్ కు ఎప్పటిదో బ్రిటీష్ పాలకుల ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. 1944లో అంటే, వలసవాద బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చిన క్రిమినల్ లా అమెండ్‌మెంట్ ఆర్డినెన్స్ కింద ఆ ఈస్తుల జప్తుచేపట్టారు. కానీ, అదే ఆర్డినెన్స్‌లోని ఓ కీలక సెక్షన్‌ను పట్టించుకోకపోవడం, దూకుడు ప్రదర్శించడం ఉద్దేశపూర్వకంగానే అని తెలుస్తోంది. అయితే చంద్రబాబు, నారాయణల అరెస్టులు ఖాయమని వైసీపీ వర్గాలు చెబుతుండగా.. ఆర్డినెన్స్ లు కోర్టులో నిలబడవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరీ ఏం జరుగుతుందో..
