CG Effects: సీజీ మన హీరోల్ని బద్దకించేలా చేసింది.. సినిమా ఖర్చును పెంచేసింది
ఒక సినిమాకు కేవలం హీరోలను చెక్కడానికే కోటి నుంచి నాలుగు కోట్లు ఖర్చు అవుతోందని తెలుస్తోంది. బాలీవుడ్లో అయితే ఇది చాలా ఎక్కువ. హీరోల వయసు అయిపోతోంది.

CG Effects: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ క్వాలిటీ పెరగడం కామన్. అది మన సినిమాల్లో కనిపిస్తోంది. కానీ అదే టెక్నాలజీ హీరోల్లో బద్దకం పెంచుతున్నట్లు కనిపిస్తోంది. ఫిజిక్ జాగ్రత్తగా చూసుకోవావాలి. ముఖ కవళికలు చూసుకోవాలి. అందంగా కనిపించాలి అన్నది హీరోలకు తప్పనిసరి. కానీ రానురాను ఈ టెక్నాలజీ అండ చూసుకుని హీరోలు బద్దకం పెంచేసుకుంటున్నారు. సీజీ వర్క్ చెక్కేస్తుండడంతో శరీరాకృతి ఎలా వున్నా ఫరవాలేదు అనే ధీమా వచ్చేస్తోంది. నడుము ఇరుపక్కలా, పొట్ట, ఇవన్నీ కంప్యూటర్లలో ఇష్టం వచ్చినట్లు చెక్కేస్తున్నారు. ముఖం మంచి బ్రైట్ గా కనిపించేలా చేస్తున్నారు. వదిలే స్టిల్స్ అన్నీ చెక్కుడే.
భారీగా ఖర్చు..
ఒక సినిమాకు కేవలం హీరోలను చెక్కడానికే కోటి నుంచి నాలుగు కోట్లు ఖర్చు అవుతోందని తెలుస్తోంది. బాలీవుడ్లో అయితే ఇది చాలా ఎక్కువ. హీరోల వయసు అయిపోతోంది. వేళాపాల లేని నిద్రలు, అలవాట్లు, ఇవన్నీ కలిసి శరీరాకృతిని మార్చేస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఈ చెక్కుడు అందుబాటులోకి రావడం వరంగా మారింది. ఇదే సమయంలో ఒకప్పుడు కేవలం ఫైట్లకు మాత్రమే వాడే డూప్ సంస్కృతి, బాడీ డబుల్ అనే పేరుతో కొత్తగా వచ్చింది. ఇప్పుడు చాలా వరకు సీన్లకు కూడా ఈ బాడీ డబుల్ ను వాడేస్తున్నారు. ఈ మధ్య టాలీవుడ్ లో కూడా బాడీ డబుల్ సంస్కృతి పెరుగుతోంది. ఓ టాప్ హీరో సినిమా ఒకటి సగానికి పైగా బాడీ డబుల్ తోనే కానిచ్చేస్తున్నారు. హీరో డేట్ లు దొరికినపుడు క్లోజ్‌లు తీసుకుంటున్నారు. మిగిలిన టైమ్‌లో బాడీ డబుల్స్ తో పని కానిచ్చేస్తున్నారు. మరో పెద్ద హీరో సినిమాకు యాక్షన్ సీన్లు ఎక్కువ. అవన్నీ కూడా బాడీ డబుల్స్‌తోనే సరిపెట్టేస్తున్నారు.
ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లకు..
ఇక సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు తీయాల్సి వస్తే చాలు హీరోలకు చెక్కుడు తప్పడం లేదు. ఓ సీనియర్ హీరో సినిమా ఆ మధ్య వచ్చింది. అందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఫుల్ గా చెక్కేశారు. హీరో ఆ సీన్లు ఒకటికి రెండు సార్లు చూసి ఓకె చేసిన తరువాతే బయటకు వదిలారు. ఇంకో సీనియర్ హీరో మొహం బాగా పీక్కుపోయినట్లు అయిపోయింది. దాంతో అతగాడి సినిమాలకు సిజి వర్క్‌లు పెరిగిపోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇంకో టాప్ హీరో ఫిజిక్ అవుటాఫ్ షేప్ అయిపోయింది. అక్కడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు జిమ్ చేసి ఫిట్ గా వుండేవారు. ఇప్పుడు చాలా వరకు సీనియర్ హీరోలు జిమ్‌ను వదిలేశారు.
మామూలు సినిమాలకు ఒకప్పుడు సిజి వర్క్ ఎక్కువ వుండేది కాదు. కానీ ఈ బాడీ డబుల్స్, చెక్కుడులు వచ్చిన తరువాత ప్రతి సినిమాకు కూడా సిజి వర్క్‌లు పెరిగిపోతున్నాయి. దాంతో సినిమాల విడుదల ఆలస్యమైపోతోంది. టెక్నికల్ వర్క్ కావడంతో టైమ్ పట్టేస్తోంది. పైగా నిర్మాణ వ్యయంలో ఇది అదనం అవుతోంది.
