Vyuham: ఆర్జీవి ‘వ్యూహానికి’ సెన్సార్ బోర్డ్ షాక్

రాజశేఖర్ రెడ్డి మరణానంతర పరిణామాల నేపథ్యాన్ని, ఏపీ సీఎం జగన్కు ఎదురైన ఇబ్బందులను ఇతివృత్తంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ వ్యూహం చిత్రాన్ని రూపొందించారు.

  • Written By: Dharma
  • Published On:
Vyuham: ఆర్జీవి ‘వ్యూహానికి’ సెన్సార్ బోర్డ్ షాక్

Vyuham: రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా సెన్సార్ ముందు చతికలపడింది. ఈ చిత్ర యూనిట్ కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. ఈ సినిమాకు క్లియరెన్స్ ఇవ్వడానికి నిరాకరించింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం, తదనంతర పరిణామాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలకు ప్లాన్ చేశారు. ఇందులో వ్యూహం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 10న విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు ముందుకు ఈ చిత్రం వెళ్ళింది. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వ్యక్తులను, రాజకీయ పార్టీలను కించపరిచేలా సినిమాను రూపొందించారని సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడానికి సెన్సార్ బోర్డు నిరాకరించింది. దీంతో ఈ చిత్ర బృందం సెన్సార్ రివైజింగ్ కమిటీని ఆశ్రయించనుంది.

రాజశేఖర్ రెడ్డి మరణానంతర పరిణామాల నేపథ్యాన్ని, ఏపీ సీఎం జగన్కు ఎదురైన ఇబ్బందులను ఇతివృత్తంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ వ్యూహం చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో చంద్రబాబు తో పాటు పవన్ పాత్రలను సైతం టీజర్ లో చూపించారు. అటు చిరంజీవిని సైతం ఓ సన్నివేశంలో చూపించే ప్రయత్నం చేశారు. టీజర్ తో పాటు ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. జగన్ కు లబ్ధి చేకూర్చడంతో పాటు చంద్రబాబు, పవన్ లను ప్రతికూలంగా చూపించారని టీజర్ ద్వారా తెలుస్తోంది.ఎన్నికల ముంగిట ఈ రెండు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు రాంగోపాల్ వర్మ ప్లాన్ చేశారు. తాజాగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సినిమా విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. లోకేష్ ఏకంగా సెన్సార్ బోర్డుకి లేఖ రాయడం విశేషం. టిడిపి అధినేత చంద్రబాబు ప్రతిష్టను దిగజార్చేలా ఉద్దేశ్య పూర్వకంగా ఈ సినిమాను రూపొందించారని లేఖలో పేర్కొన్నారు. కేవలం జగన్కు రాజకీయ లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుందని.. న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసును సైతం ఈ చిత్రంలో చేర్చారని.. చంద్రబాబుకు ముడుపులు అందాయని సినిమాలో చెప్పిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. న్యాయస్థానంలో విచారణ జరగకముందే ఈ సినిమా ద్వారా తమ అభిప్రాయాన్ని ప్రజల్లో వ్యాపింపజేసే ప్రయత్నం చేశారని లోకేష్ సెన్సార్ బోర్డు కు ఫిర్యాదు చేయడం విశేషం. దీనిపై అవసరం ఉంటే వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇస్తానని లోకేష్ చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వ్యూహం సినిమా చిత్రీకరణ దాదాపు ఏపీలోనే చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇది పూర్తిగా జగన్కు లబ్ధి చేకూర్చే సినిమాగా ఎప్పటినుంచో ప్రచారం ఉంది. అటు రాంగోపాల్ వర్మ సైతం కేవలం దర్శకుడు గానే కాకుండా వైసీపీ సానుభూతిపరుడుగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీతో పాటు నేతలపై ఎటువంటి విమర్శలు వచ్చినా, ప్రత్యర్థులు ఎవరైనా వ్యాఖ్యలు చేసినా వెంటనే స్పందిస్తున్నారు. కొన్ని సమయాల్లో వైసీపీ నేతలకు మించి కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యూహం సినిమాలో చంద్రబాబు పాత్రను మరి ప్రతికూలంగా చూపించేందుకు ప్రయత్నించారని టీజర్, ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. అందుకే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం. అయితే ఆదిలోనే వ్యూహం సినిమాకు అడ్డుకట్ట పడడం విశేషం.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube