Vijayawada Cell Tower: భానుడి భగభగకు.. సెల్ టవర్ కు మంటలు.. వీడియో వైరల్
ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Vijayawada Cell Tower: భానుడు సెగలు కక్కుతున్నాడు. దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. ఢిల్లీలో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎండలు మండుతున్నాయి. వడగాలులు వీస్తున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. రోజంతా ఎండ, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మొన్నటివరకూ వర్షాలతో ఇక ఎండ తీవ్రత ఉండదని అంతా భావించారు. కానీ అగ్ని కార్తెలతో అంతటా అగ్ని వాతావరణం నెలకొంది. సూర్యుడి ప్రతాపంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి.
ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని చోట్లా పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైగానే ఉందని తెలిపింది. ఉష్ణోగ్రతల తీవ్రత ఇంతగా పెరగడానికి వాయువ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలులే కారణమని వాతావరణ విభాగం పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం సూచిస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
కాగా ఎండ ధాటికి విజయవాడలో సెల్ టవర్ పేలింది. మంటలు వ్యాపించడంతో పూర్తిగా కాలిపోయింది. విజయవాడ, గీతా నగర్ ఐడీఎఫ్సీ బ్యాంకు మీద ఉన్న సెల్ టవర్ ఉన్నట్లుండి కాలిపోయింది. టవర్ నుంచి మంటలు చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. టవర్ నుంచి వెలువడిన పొగ దట్టంగా కమ్మేసింది. దీంతో బ్యాంకు సిబ్బందితో పాటు స్థానికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వాళ్లు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. సెల్ టవర్ కాలిపోతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
