Superstition: ఆ మహిళ అలక.. గ్రామానికి చేటు తెప్పించిందట

  • Written By:
  • Updated On - May 28, 2022 / 01:59 PM IST

Superstition: భర్త బతికుండగానే ఆమె వైధవ్యాన్ని పాటిస్తోంది. భర్తతో తలెత్తిన ఆర్థిక, ఆస్తి వివాదాలతో విసిగి వేశారని ఆమె అలకబూనింది. మెడలో తాళి, చేతికున్న గాజులు తీసేసింది. బొట్టు పెట్టుకోకుండా భర్త బతికుండగానే తనకు తాను శిక్ష వేసుకుంది. అయితే అంతవరకూ బాగానే ఉంది కానీ ఆమె చర్యలు గ్రామానికి చేటు తెచ్చాయంటున్నారు గ్రామస్థులు. ఆమె చర్య మూలంగా ఊరికి అరిష్టం పట్టుకుందని నమ్ముతున్నారు. ఆమె వల్లే గ్రామంలో అకాల మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఏకంగా ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడిదే అంతటా హాట్ టాపిక్ గా మారింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం పులేటి ఎర్రగుడిలో వెలుగుచూసింది ఈ ఘటన. ఆ గ్రామంలో సుమారు ఐదు వందల కుటుంబాలు ఉంటాయి. ఆ ఊరిలో గడిచిన తొమ్మిది నెలల్లో ఎనిమిది మంది మరణించారు. వీరలో యువకులే అధికం. అది కూడా ప్రతీ నెలా 23వ తారీఖును చనిపోతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. వారంతా కొవిడ్, గుండెపోటు వంటి రుగ్మతలతో బాధపడుతూ చనిపోయినా.. ఊరి జనం ఈ మరణాలను శాస్త్రీయ కోణంలో చూడలేదు. తమ సందేహాలను వైద్యుల వద్ద నివృత్తి చేసుకోలేదు. పూజలు చేసే ఓ పండితుడిని సంప్రదించారు. తమ ఊరికి ఏదో అరిష్టం పట్టుకుందని, ఉన్నఫలంగా కొందరు చనిపోతున్నారని ఆయన వద్ద మొర పెట్టుకున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకరి ప్రాణం పోతోందని, 23వ తేదీ వచ్చిందంటే ఎవరికి ఏమౌతుందో అని భయం పట్టుకుందని ఆయనకు వివరించారు. దీంతో ఆ ఊరి పరిస్థితుల గురించి ఆయన ఆరా తీయడం మొదలు పెట్టారు.

Superstition

మూఢ నమ్మకాలతో..

గ్రామంలో దేవుడికి అర్పించిన ఓ గోవు ఉంది. ఇంటింటికీ వెళ్లి ధాన్యం, గ్రాసాన్ని ఆహారంగా తీసుకుంటుంది. ఆ ఆవు ఇటీవల ఊరంతా తిరుగుతూ గట్టిగా అరుస్తోందని, అదేమైనా చెడుకు సంకేతమా..? అని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. ఆవుతో ఏ సమస్యా లేదని పండితుడు అన్నారట. ఆ తరువాత అసలు సందేహాన్ని ఆయన ముందుంచారు. తమ ఊరిలో ఓ మహిళ భర్త ఉండగానే సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, బొట్టు, గాజులు, తాళి తీసేసి తిరుగుతోందని ఆయనకు తెలిపారట. అంతే..! చెడు సంఘటనలకు అదే కారణమని ఆయన చెప్పడంతో అప్పటి నుంచి గ్రామంలో ఆందోళన మరింత వ్యక్తమయ్యింది. దీంతో గ్రామపెద్దలు రంగంలోకి దిగారు. భర్త బతికుండగా అలా చేయడం మంచిది కాదని, సంప్రదాయాన్ని పాటించాలని పలుమార్లు సూచించారు. కానీ ఆమె వినుకోలేదు. పైగా, ఒత్తిడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగడంతో ఏం చేయాలో గ్రామపెద్దలకు పాలుపోవడం లేదు. కుటుంబసభ్యులు చెప్పినా ఆమె పెడచెవిన పెడుతూ వస్తోంది. మరోవైపు పండితుడి హెచ్చిరికలు గ్రామస్థలును వెంటాడుతున్నాయి. దీంతో ఆమె కారణంగా తమ ఊరికి చెడు జరుగుతోందని గ్రామస్థులుగుత్తి పోలీస్‌ స్టేషనకు వెళ్లారు. ఎలాగైనా సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో పోలీసులు గ్రామానికి వెళ్లారు. ఆ లోగా ఆమె తాళి, మెట్టెలు ధరించి, బొట్టు పెట్టుకుని పోలీసులకు దర్శనమిచ్చింది. సమస్య ఏమిటని ఆమెను పోలీసులు ప్రశ్నించారు.నా భర్తతో సమస్య ఉంది. అందుకే అని ఆమె సమాధానమిచ్చింది. ఇకపై అలా చేయొద్దని, ఊరి జనం మాట వినాలని పోలీసులు ఆమెకు సూచించారు. అందుకు ఆమె అంగీకరించింది. ఊరి జనం కూడా సంయమనం పాటించాలని, ఈ విషయమై గొడవలకు దిగొద్దని పోలీసులు గ్రామస్థులకు సర్థి చెప్పి అక్కడ నుంచి వచ్చేశారు.

Also Read: F3-1st Day Collections: ఫస్ట్ డే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ !

అంతటా చర్చ..

అయితే ఇప్పుడు ఈ ఘటన అంతటా చర్చనీయాంశమైంది. వివిధ రుగ్మతలతో బాధపడుతూ గ్రామస్థులు చనిపోతే.. అందుకు తగ్గట్టు వైద్యసేవలు పొందడం మానేసి మూఢ నమ్మకాలకు ప్రజలు గురవుతుండడంపై మానవహక్కుల సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజ్ఞాన జ్యోతులు వినువీధుల్లోని చీకట్లను తొలగిస్తున్న ఈ రోజుల్లో వాటిని నమ్మడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అవగాహన పెంచి గ్రామస్థుల్లో భయం పోగొట్టాల్సిన అధికారులు, పోలీసులు చేతులు దులుపుకోవడాన్ని తప్పుపడుతున్నారు. గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ విషయం అటుంచితే ఓ మహిళ అలక ఆ ఊరిని భయపెట్టడం చర్చనీయాంశమైంది.

Also Read: KA Paul: ఈ వీడియో చూస్తే ఇక ఎవరూ కేఏ పాల్ ను ‘కామెడీ పీస్’ అనరు?