Pawan Kalyan – Kumaraswamy : ఆంధ్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ మరో కుమార స్వామి కాగలడా?
కర్ణాటకలో కుమారస్వామి కింగ్ మేకర్ గా ఉంటున్నారు. వచ్చే ఆంధ్ర ఎన్నికల్లో హోరాహోరీ ఖాయం అంటున్న తరుణంలో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మరో కుమార స్వామి అయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు జోరుగా వినిపిస్తున్నాయి.

Pawan Kalyan – Kumaraswamy : పట్టుమని 30 సీట్లు కూడా రాలేని జేడీఎస్ కుమారస్వామి పోయిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్ అయ్యి ఏకంగా సీఎం అయ్యారు. ఈసారి అలాంటి ఫలితాలే వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు అధికారానికి కావాల్సిన సీట్లను అందిపుచ్చుకోవడం లేదు. మెజార్టీకి దగ్గరగా వచ్చి ఆగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి జేడీఎస్ అధినేత కుమారస్వామి కింగ్ మేకర్ అవుతున్నారు. ఈసారి కూడా సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఇవే కోడై కూస్తున్నాయి. ఒక్క కులంను నమ్ముకొని ఆ కులం ఓట్లతో గెలిచిన
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఎన్నికలు జరిగాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి.. విజయం సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. అయితే రాష్ట్రంలో మరోసారి హంగ్ ఏర్పడుతుందని అనేక సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. దీంతో మరోసారి జెడిఎస్ కింగ్ మేకర్ గా అవతరిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కర్ణాటక ఎన్నికల సరళని పరిశీలించిన ఎంతోమంది వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పరిస్థితిపైనా ఒక అంచనాకు వస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జోరుగా ముందుకు సాగుతున్నారు. పార్టీ కేడర్ ను సమాయత్తం చేయడంతోపాటు ఆయన అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. 2014 ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు సాధించి ఒకే ఒక్క సీటు మాత్రమే జనసేన పార్టీ గెలుచుకుంది. అయితే, గడిచిన నాలుగేళ్లలో జనసేన పార్టీకి ప్రజా మద్దతు భారీగా పెరిగింది. జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 13 నుంచి 20 శాతం మధ్య ఓటు బ్యాంకు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కన్నడ నాట ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న ఫలితాలను చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చక్రం తిప్పే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
కింగ్ మేకర్ పాత్ర పోషించనున్న జెడిఎస్..
కర్ణాటక అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో జెడిఎస్ కింగ్ మేకర్ పాత్ర పోషించింది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో గడిచిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 104 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 80, జెడిఎస్ 37 స్థానాల్లో విజయం సాధించాయి. మొదట ఎడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ.. మూడు రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత కాంగ్రెస్, జెడిఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. హెచ్డి కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఈ సంకీర్ణ ప్రభుత్వం కేవలం 14 నెలలు మాత్రమే కొనసాగింది. పలువురు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడంతో పరిణామాలు మారిపోయాయి. భారతీయ జనతా పార్టీ బలం 116కు చేరడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గడచిన 38 ఏళ్లుగా కర్ణాటకలో ఏ ఒక్క పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. దీన్ని అధిగమించేందుకు అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఎన్నికల జరగ్గా మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
రాష్ట్రంలో జనసేనాని చక్రం తిప్పనున్నారా..?
కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించిన తర్వాత, ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న దాని ప్రకారం హంగ్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ సంస్థలు చెప్పిన సర్వేల ప్రకారం బిజెపికి 85 నుంచి 110 వరకు, కాంగ్రెస్ పార్టీకి 86 నుంచి 118 వరకు, జెడిఎస్ కు 12 నుంచి 32 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. జెడిఎస్ ఇక్కడ కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలమైన పార్టీగా ఆవిర్భవించిన జనసేన కూడా వచ్చే ఎన్నికల్లో ఇదే తరహాలో కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే జనసేన పార్టీ బలంగా ఉందని, రెండు పార్టీలకు తీసిపోని రీతిలో సీట్లు సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు.
పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్న పవన్..
గడిచిన ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లను సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లినా జనసేన పార్టీ నుంచి కనీసం 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. జనసేనాని వ్యూహాలు సఫలమైతే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 20 నుంచి 30 సీట్లు గెలుచుకోగలిగితే.. తప్పనిసరిగా కింగ్ మేకర్ అవుతాడని చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలోనే బలమైన అభ్యర్థులను బరిలోకి దించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని, కర్ణాటకలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్.. ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ కు వర్తిస్తాయని పలువురు పేర్కొంటున్నారు. కర్ణాటకలో కుమారస్వామి కింగ్ మేకర్ గా ఉంటున్నారు. వచ్చే ఆంధ్ర ఎన్నికల్లో హోరాహోరీ ఖాయం అంటున్న తరుణంలో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మరో కుమార స్వామి అయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు జోరుగా వినిపిస్తున్నాయి.
