Best Electric Scooters For Carrying Loads: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. ఉద్యోగులతో పాటు వ్యాపారులు వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కిరాణం షాపు ఉన్న వారితో పాటు ఇతర సామాగ్రిని తరలించడానికి ఎలక్ట్రిక్ స్కూటర్ మైలేజ్ తో పాటు ఇతర అవసరాలు తీరడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇలాంటి సమయంలో వీరు ఎలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే బెటర్ అన్న సందేహం వస్తుంది. మంచి స్టోరేజ్ స్పేస్, బలమైన లోడ్ సామర్థ్యం, ఎక్కువ రేంజ్ వంటి లక్షణాలతో కొన్ని మోడళ్లు ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాంటి ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి వివరాల్లోకి వెళితె..
1. Ather Rizta :
అథర్ రిజ్టా ప్రధానంగా కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ఈ స్కూటర్లో సీటు కింద సుమారు 34 లీటర్ల స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. అదనంగా ఫ్రంట్ స్టోరేజ్ ఎంపిక కూడా ఉండటంతో కూరగాయలు, కిరాణా వస్తువులు, చిన్న బ్యాగులను సులభంగా ఉంచుకోవచ్చు. విశాలమైన సీటింగ్ కారణంగా ఇద్దరు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. రేంజ్ కూడా బాగుండటంతో నగర ప్రయాణాలకు ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది. భారత మార్కెట్లో అథర్ రిజ్టా ధర సుమారు రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
2. River Indie:
రివర్ ఇండీని చాలామంది ‘స్కూటర్లలో ఎస్యూవీ’ అని పిలుస్తారు. దీనికి ప్రధాన కారణం భారీ స్టోరేజ్ సామర్థ్యం. ఈ స్కూటర్లో ముందు భాగంలో లాక్ చేయగలిగే గ్లోవ్ బాక్స్‌లు, పెద్ద ఫుట్‌బోర్డ్, సీటు కింద స్టోరేజ్ అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద 40 లీటర్లకు పైగా సామాను ఉంచుకునే అవకాశం ఉంటుంది. కిరాణా షాపింగ్ చేసే వారికి ఇది అత్యంత అనుకూలమైన మోడళ్లలో ఒకటిగా భావిస్తారు. దీని ధర సుమారు రూ.1.40 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుంది.
3. Bajaj Chetak 3501:
బజాజ్ చేతక్ 3501 ప్రీమియం మెటల్ బాడీ, బలమైన నిర్మాణ నాణ్యతతో ఆకట్టుకుంటుంది. సీటు కింద మంచి స్టోరేజ్ స్పేస్ ఉండటంతో రోజువారీ సరుకులు, కార్యాలయ బ్యాగులు లేదా కిరాణా సామగ్రిని తీసుకెళ్లడం సులభం. స్థిరమైన రైడింగ్ అనుభవం, విశ్వసనీయత కారణంగా కుటుంబ వినియోగదారులు ఈ మోడల్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ స్కూటర్ ధర సుమారు రూ.1.30 లక్షల నుంచి రూ.1.40 లక్షల మధ్య ఉంటుంది.
4. Ola S1 Pro ప్లస్:
ఓలా S1 Pro+ అత్యాధునిక టెక్నాలజీ, శక్తివంతమైన పనితీరుతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. పెద్ద సీటు కింద స్టోరేజ్, ఎక్కువ రేంజ్, వేగవంతమైన యాక్సిలరేషన్ దీని ప్రధాన ఆకర్షణలు. రోజువారీ ప్రయాణాలతో పాటు సూపర్ మార్కెట్ షాపింగ్ చేసినప్పుడు తీసుకొచ్చే బ్యాగులను సులభంగా ఉంచుకోవచ్చు. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. ఈ స్కూటర్ ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు ఉండవచ్చు.
5. TVS Orbiter:
టీవీఎస్ ఆర్బిటర్ ప్రస్తుతం మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉన్న మోడల్ కాకపోయినా, భారీ లోడ్ సామర్థ్యం మరియు యుటిలిటీ ఆధారిత డిజైన్‌తో చర్చనీయాంశమైంది. పెద్ద ఫుట్‌బోర్డ్, అదనపు లగేజ్ స్పేస్ వంటి లక్షణాలతో కిరాణా సరుకులు లేదా డెలివరీ అవసరాలకు అనుకూలంగా రూపొందించే దిశగా అభివృద్ధి జరుగుతోంది. అందుబాటు మరియు ధర ప్రాంతానుసారం మారవచ్చు.
