BRS Sabha On Nanded: తెలంగాణలో పాలనను గాలికి వదిలేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు జాతీయ పార్టీ విస్తరణపైనే ప్రధాన దృష్టి పెట్టారు. తెలంగాణ ఉద్యోగులకు వేతనాలు.. ఆసరా పింఛన్లు సకాలంలో ఇవ్వడం లేదు. కానీ తెలంగాణ ప్రజలు కట్టే పన్నులను పార్టీ విస్తరణ కోసం మళ్లిస్తున్నారు. మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇటీవల ఖమ్మం సభలో పార్టీ ఆవిరాభవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు రూ.400 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు. వాస్తవానికి పార్టీ కార్యక్రమాలకు పార్టీ ఫండ్ వినియోగించాలి. కానీ, కేసీఆర్ ఆవిర్భావ సభకు కంటివెలుగు పథకాన్ని అనుసంధానం చేశారు. ఈ కార్యక్రమం కోసమే నిధులు ఖర్చు చేస్తున్నట్లు చూపి ప్రభుత్వ ఖజానా నుంచి రూ.400 కోట్ల వరకు మళ్లించారని సమాచారం. తాజాగా మరో సభకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

BRS Sabha On Nanded
పొరుగు రాష్ట్రాలపై గురి..
బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణను మొదట పొరుగు రాష్ట్రాల నుంచే చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఏపీలో పార్టీ అధ్యక్షుడిని నియమించారు. తాజాగా మహారాష్ట్రపై దృష్టిపెట్టారు. తెలంగాణ సరిహద్దున ఉన్న ప్రాంతాల ప్రజలు, రైతులు తమకు తెలంగాణ పథకాలు కావాలని అడుగుతున్నారని కొన్ని రోజులుగా కేసీఆర్ ప్రచారం చేయిస్తున్నారు. తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని మీడియాల్లో కథనాలు రాయిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీని అక్కడ విస్తరించడానికి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్దంచేశారు. నాందేడ్‌లో ఫిబ్రవరి 5న బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సభకు హాజరుకానున్నారు. ఇప్పటికే నాందెడ్‌లో బీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించి.. చేరికల కోసం కొంత మందిని ఒప్పించారు. సభ ఏర్పాట్ల కోసం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతోపాటు బీఆర్‌ఎస్ సీనియర్ నేత బాలమల్లును ఇన్‌చార్జీలుగా నియమించారు. ఈమేరకు కేసీఆర్ మూడు రోజులుగా ఈ జిల్లాల ఎమ్మెల్యేలు, నేతలతో ప్రత్యేకంగా సమావేశమై సభను విజయవంతం చేసేందుకు, ఏర్పాట్లపైనా దిశానిర్దేశం చేశారు.
సభకు ఏర్పాట్లు..
నాందేడ్‌లో సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితర నేతలు మంగళవారం నాందేడ్ జిల్లాలో పర్యటించారు. సభను నిర్వహించే స్థలాన్ని అక్కడి నాయకులతో కలిసి పరిశీలించారు. సభ సందర్భంగా బీఆర్‌ఎస్‌లో చేరికలు ఎక్కువగా ఉండేలా వారు ప్రయత్నిస్తున్నారు. పదవులు, తాయిలాలు ఆశ చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ కూడా ఇస్తున్నారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను ఆకర్షించే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు.

BRS Sabha On Nanded
ఈశాన్య రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ పోటీ..
ఇదిలా ఉంటే.. ఇటీవల మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీలకు ఫిబ్రవరి చిరవరన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మొదట భావించారు. ఇక్కడ తక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి పోటీ చేసి 6 శాతం ఓట్లు సాధించడం ద్వారా జాతీయ పార్టీగా గుర్తింపు సాధించాలని భావించారు. అయితే తర్వాత పోటీ ఆలోచన విరమించుకున్నారు. తక్కువ సమయంలో ఎన్నికల బరిలో నిలవడం అసాధ్యమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. పోటీచేస్తే ఆ ఆరు శాతం ఓట్లు కూడా రాకపోతే తొలి అడుగే తప్పటడుగు వేసినట్లు అవుతుందని భావిస్తున్నారు. తద్వారా విపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్లవుతుందని అంచనా వేసిన కేసీఆర్ పోటీ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పార్టీ విస్తరణపైనే గులాబీ బాస్ ప్రధానంగా దృష్టిపెట్టారు.