BRS Public Meeting Maharashtra: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాలవైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మంగా ఘనంగా నిర్వహించి దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమితిని విస్తరించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రజల మద్దతును సంపాదించడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా మరో సభను నిర్వహించడానికి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు.

KCR
నాందేడ్ వేదికగా భారీ బహిరంగ సభ..
జాతీయ రాజకీయాల దృష్టిని మరింతగా ఆకర్షించడమే లక్ష్యంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 5న భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈమేరకు అవసరమైన ఏర్పాట్లను చేయడం కోసం మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలతో ప్రగతిభవన్‌లో మూడు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో సభ విజయవంతం కావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారని తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సభ
నాందేడ్‌లో బీఆర్‌ఎస్ బహిరంగ సభని ఈనెల 29వ తేదీన నిర్వహించాలని ముందు నిర్ణయించారు. అయితే అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా తేదీని మార్చుకోవాల్సి వచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఫిబ్రవరి 5కి సభ వాయిదా వేశారని సమాచారం. మహారాష్ట్ర శాసనమండలిలో రెండు పట్టభద్రులు, మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, ఫిబ్రవరి 2వ తేదీన ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఫిబ్రవరి 5వ తేదీన బీఆర్‌ఎస్ సభ నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందని భావించి ఆ డేట్ ఫిక్స్ చేసినట్లుగా సమాచారం.
దేశం దృష్టిని ఆకర్షించేలా మరో ప్రయత్నం..
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 3వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ సమావేశాలకు 4, 5 తేదీల్లో విరామం ఉంది. దీంతో 5వ తేదీన నాందేడ్ లో సభ నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందని బీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఖమ్మం సభ తరహాలో నాందేడు సభలో కూడా జాతీయ రాజకీయాలను ఆకర్షించే దిశగా సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి కీలక నాయకులను సభకు ఆహ్వానించనున్నట్టు సమాచారం. ఈ సభా వేదికగా మహారాష్ట్రకు చెందిన ముఖ్య నేతలు బీఆర్‌ఎస్‌లో చేరతారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

BRS Public Meeting Maharashtra
వారికే కీలక బాధ్యతలు..
నాందేడ్ సభ ఏర్పాట్లు, సభకు ఆహ్వానితులు తదితర వివరాలను మరో ఒకటి రెండు రోజుల్లో ఫైనల్ చేసే పనిలో ఉన్నారు సీఎం కేసీఆర్. నాందేడ్‌లో తలపెట్టిన సభకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని పలువురు మంత్రులకు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. పొరుగు రాష్ట్రంలో నిర్వహిస్తున్న సభ కావడంతో సభను సక్సెస్ చేయడం కోసం భారీగా ఏర్పాట్లు చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర నేతలను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న తదితరులకు అప్పగించునున్నట్టు సమాచారం. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి కూడా నాందేడ్ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా బీఆర్‌ఎస్ తొలి సభ ఖమ్మంలో విజయవంతం కావడంతో రెండో సభను మరింత విజయవంతం చేయాలని దేశ రాజకీయాలను ప్రభావితం చేసేది కేసీఆర్ మాత్రమే అనే సంకేతాలు ఇవ్వాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. తెలంగాణ బయట నిర్వహిస్తున్న మొట్టమొదటి సభను విజయవంతం చేయడానికి పార్టీ నేతలు కూడా కసరత్తు చేస్తున్నారు.