BRS Kavitha: కవితా మజాకా.. మోదీ మహిళా బిల్లు అందుకే పెడుతున్నాడట?
ఎవరు ఏమనుకుంటే నాకేంటి.. రాజకీయం చేయడమే తనకు ముఖ్యం అన్నట్లు కల్వకుంట్ల కవిత, బీఆర్‌ఎస్ నాయకులు మహిళా బిల్లుపై రాజకీయం మొదలు పెట్టారు.

BRS Kavitha: కవిత.. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారాల బిడ్డ.., ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ప్రియమైన చెల్లి. ఎందుకు ఇంతలా చెబుతున్నామంటే… కవిత ఏం జెబితే అది జరిగి తీరుతుంది తెలంగాణలో. కవిత ఏది అడిగితే అది కాదనే పరిస్థితి లేదు. జెడ్పీటీసీల జీతం పెంచమంటే.. పెంచేశారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు వేతనం చాలడం లేదంటే పెంచేశారు. కొండగట్టును అభివృద్ధి చేయాలంటే.. అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఇవి బయటకు తెలిసినవి మాత్రమే.. తెలియనివి ఎన్నో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ‘కవిత చెబితే కరెక్ట్’ అన్నట్లుగా తయారైంది. ఇందుకు కారణం ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రి తన తండ్రి, సోదరుడు కావడమే. అయితే ఇప్పుడు కవిత మరో ప్రచారం మొదలు పెట్టారు. తాను అడిగాను కాబట్టే కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలనుకుందట. తాను జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసనతో మోదీ వణికిపోయాడట. అందుకే మహిళా బిల్లు పెడుతున్నారట.
ఓన్ చేసుకోవడానికే..
వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లు మూడు దశాబ్దాల క్రితం రూపొందించింది. ప్రధాని దేవెగౌడ నేతృత్వంలో దీనిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. తర్వాత వాజ్‌పేయి, మన్‌మోహన్ సింగ్ కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా మోదీ దానికి మోక్షం కల్పించాలని సంకల్పించారు. కానీ, కవిత దానిని ఓన్ చేసుకునేందుకు చీప్ పాలిటిక్స్‌కు తెరలేపారు. తన ఒత్తిడితోనే బిల్లు పెడుతున్నారని డబ్బా కొట్టుకుంటున్నారు.
కవిత రాజకీయాల్లోకి రాకముందే బిల్లు..
వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లు 1996లో రూపొందించారు. అప్పటికి కవిత రాజకీయాల్లోనే లేదు. కవిత కేసీఆర్ కూతురుగా, తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి జాగృతి పేరుతో 2005 తర్వాత రాజకీయాలు మొదలు పెట్టారు. కానీ కవిత రాకకు దశాబ్దం ముందే మహిళా రిజర్వేషన్ బిల్లు రూపకల్పన జరిగింది.
నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు..
ఎవరు ఏమనుకుంటే నాకేంటి.. రాజకీయం చేయడమే తనకు ముఖ్యం అన్నట్లు కల్వకుంట్ల కవిత, బీఆర్‌ఎస్ నాయకులు మహిళా బిల్లుపై రాజకీయం మొదలు పెట్టారు. కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని తెలియగానే కవిత ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. తన ఒత్తిడితోనే బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపిందని రాసుకొచ్చారు. బీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటులో చేసిన ఆందోళన ఫలించిందని పేర్కొన్నరు. అలా చూసినా బీఆర్‌ఎస్‌కు ఉన్నది 15 మంది ఎంపీలే.. ఈ 15 మంది ఎంపీలకే మోదీ భయపడ్డారట.
తనకు అవసరమైతేనే గుర్తొస్తుంది..
వాస్తవానికి కవిత మహిళా బిల్లుపై నిరసన తెలిపింది. ఈడీ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగడంతో దానిని ఏమార్చేందుకు మహిళా బిల్లు పేరిట రాజకీయం చేశారు. ఆమె నిరసన తర్వాత పలుమార్లు పార్లమెంట్ సమావేశం అయింది. కానీ ఎక్కడా మహిళా బిల్లు గురించి బీఆర్‌ఎస్ ఎంపీలు అడగలేదు. కవిత కూడా నోరు మెదపలేదు. ఇంతెందుకు మొన్న కవిత నాయన.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ఇందులో మహిళలకు రిజర్వేషన్ ప్రకారం 39 ఇవ్వాలి. కానీ ఆయన ఇచ్చింది 9 మందికే. దానిపై నోరు కూడా మెదపలేదు కవిత. ఇప్పుడు బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వాడుకోవడానికి మళ్లీ తామే ఒత్తిడి చేశామని చెప్పుకుంటున్నారు.
మోదీ తల్చుకుంటే అట్లుంటది..
మోదీ సామాన్యుడు కాదు.. ఎవరో చెప్పారని, ఎవరో ఒత్తిడి చేశారని బిల్లులు పెట్టరు. ఆయన అనుకంటే అయిపోతుంది. ఇందుకు ఆర్టికల్ 376 రద్దు, తలాక్ రద్దు, నోట్ల రద్దు, ఢిల్లీలో గవర్నర్ అధికారాలు ఇలా అనేక బిల్లులు ఆయన తెచ్చినవే. విపక్ష కూటమి మొత్తం వ్యతిరేకించినా మోదీ అనుకుంటే అయిపోతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళను మోదీ నిలబెడితే కేసీఆర్ వ్యతిరేకించారు. దానిపై నాడు నోరు మెదపని కవిత ఇప్పుడు మహిళా రిజర్వేషన్ తన ఒత్తిడే అని చెప్పుకోవడ గురివింద సమెతలా ఉంది.
