Karnataka- BRS: ఆ జాతీయ పార్టీ నిన్నగాక మొన్న పుట్టింది. పుట్టీ పుట్టగానే పక్క రాష్ట్రంలో వేలు పెట్టింది. పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. నేతల కొనుగోలు పర్వానికి తెరలేపిందని ఆరోపణలు ఎదుర్కొంది. ఓట్లు, సీట్ల సంగతేమోగానీ ఆ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది. ఇంతకీ ఆ పార్టీ ఏంటి ? ఏం చేసిందనుకుంటున్నారా ? అయితే స్టోరీ చదివేయండి.

Karnataka- BRS
గొంగళి పురుగు సీతాకోక చిలుక అయినట్టు.. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారింది. బీజేపీని ఓడించే లక్ష్యంతో కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామిని ఆహ్వానించారు. కుమారస్వామి వచ్చారు. కేసీఆర్ తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. పంజాబ్, ఢిల్లీ, కేరళ సీఎంలు, యూపీ మాజీ సీఎం వచ్చారు. కానీ కుమారస్వామి కనిపించలేదు. అర్జెంటు పని ఉండి రాలేదని చెప్పినప్పటికీ కుమారస్వామి రాకపోవడానికి బలమైన రాజకీయ కారణం ఉందని తెలుస్తోంది.
మొదటిసారి కుమారస్వామి బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు వచ్చాక.. బీజేపీ నేతలు కుమారస్వామి తండ్రి దేవేగౌడతో మాట్లాడారని తెలుస్తోంది. ఎన్నికల తర్వాత కర్ణాటకలో జేడీఎస్, బీజేపీ పొత్తు ఉంటుందని, అందువల్ల కుమారస్వామి కేసీఆర్ కు దూరమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కుమారస్వామి బీజేపీతో కలవకపోయినా కాంగ్రెస్ తో అయినా కలుస్తారు. కాంగ్రెస్, బీజేపీతో పోరాటం చేస్తున్నామని చెబుతున్న కేసీఆర్ తో కలవడం వల్ల కుమారస్వామికి పెద్దగా లాభం ఉండదు. ఈ సందర్భంలో కుమారస్వామి తనదారి తాను చూసుకున్నట్టు తెలుస్తోంది.

Karnataka- BRS
కర్ణాటక కాంగ్రెస్ లో కూడ బీఆర్ఎస్ దుమారం రేపింది. ఇటీవల కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ కేసీఆర్ ను కలిశారు. ఇది తెలిసిన రేవంత్ రెడ్డి కర్నాటక కాంగ్రెస్ లో చీలికకు కేసీఆర్ ప్రత్నిస్తున్నారని, తద్వార బీజేపీకి సాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక కాంగ్రెస్ లో సిద్దరామయ్య, డీకే శివకుమార్ రెండు వర్గాలుగా ఉన్నారు. సీఎం పదవి కోసం పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య వర్గాన్ని కేసీఆర్ చీల్చే ప్రయత్నం చేస్తున్నారనేది రేవంత్ రెడ్డి ఆరోపణల వెనుక మర్మం. అయితే ఇది కేవలం ఆరోపణ మాత్రమే. జమీర్ అహ్మద్ కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు చెప్పారు. తన మిత్రుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ద్వార కలిసినట్టు చెప్పారు.
బీఆర్ఎస్ కర్ణాటకలో పోటీ చేస్తామని చెబుతోంది. ఎన్నికల సంగతి పక్కనపెడతే.. కర్ణాటకలో రాజకీయ పార్టీల్లో మాత్రం చిచ్చు పెట్టిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ లో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ వర్గాల మధ్య పోటీ ఉంది. ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఆరోపణలు మరింత ఆజ్యం పోశాయి. సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఆరోపణలను డీకే శివకుమార్ వాడుకుంటున్నారు. రేవంత్ ఆరోపణలు నిరూపితం కానప్పటికీ కాంగ్రెస్ లో మాత్రం చిచ్చుపెట్టాయి. దీనికి కారణం మాత్రం బీఆర్ఎస్సే.