BC Bandhu Scheme: బీఆర్ఎస్ ‘బీసీ బంధు’.. కేసీఆర్ మరో బాంబు!
తెలంగాణలో ఎంతమంది దళితులు ప్రభుత్వాన్ని నమ్ముతున్నారో.. ఎంతమంది కోపంగా ఉన్నారో తెలియదు. అయితే దళితబంధుపై ఇతర సమాజికవర్గాలు మాత్రం అసంతృప్తితో ఉన్నాయి.

BC Bandhu Scheme: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలు ఉన్న నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్ బీసీ నామం జపిస్తోంది. గడీల పాలన అంటూ కేసీఆర్ సర్కార్‌ను విపక్షాలు విమర్శిస్తుండడంతొ ఎన్నికల వేళ.. ఆ మచ్చ పోగొట్టుకునేందుకు.. బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. బీసీలకు భారీ తాయిలం ప్రకటించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే దళితబంధు తరహాలో.. బీసీ బంధుకు గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారు.
దళితబంధుపై విమర్శలు..
హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ.. ఆ నియోజకవర్గంలో 40 వేళ దళిత ఓట్లు ఉండడంతో కేసీఆర్‌కు దళితులు, అంబేద్కర్ అకస్మాత్తుగా గుర్తొచ్చారు. దళిత జపం చేశారు. దళితులు ఆర్థికంగా ఎదగాలని దళితబంధు పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద నియోజకవర్గంలోని దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించారు. తర్వాత రాష్ట్రంలోని కొన్ని మండలాల్లో పథకం ప్రారంభించారు. ఆ తర్వాత నియోజకవర్గానికి కొంతమందిని ఎంపిక చేశారు. కానీ ఇప్పటికీ చాలా మందికి పథకం అందలేదు. ప్రభుత్వం.. అతి కొద్ది మందికి ఇచ్చి మిగతా వారిలో అసంతృప్తి పెంచేసింది. అయితే తాము వస్తేనే ఇస్తామని కాంగ్రెస్ వస్తే ఇవ్వరన్న ప్రచారాన్ని ప్రారంభించి వారి ఓట్లను దాటకుండా చూసుకుంటామన్న నమ్మకంతో ఉన్నారు.
బీసీబంధు పేరుతో..
తెలంగాణలో ఎంతమంది దళితులు ప్రభుత్వాన్ని నమ్ముతున్నారో.. ఎంతమంది కోపంగా ఉన్నారో తెలియదు. అయితే దళితబంధుపై ఇతర సమాజికవర్గాలు మాత్రం అసంతృప్తితో ఉన్నాయి. దీనిని గుర్తించిన సర్కార్.. బీసీలను సంతృప్తి పరిచేందుకు ప్లాన్ చేస్తోంది. వారి కోసం బీసీ బంధు పథకాన్ని తీసుకు రావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. చిన్న వ్యాపారాలు చేసేవారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా వంద శాతం సబ్సిడీతో నేరుగా ఆర్థికసాయం అందించే పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే రూ.పది లక్షలు ఇస్తారా లేకపోతే తక్కువ ఇస్తారా ఎక్కువ ఇస్తారా అన్నదానిపై స్పష్టత లేదు కానీ.. ఇవ్వడం మాత్రం ఖాయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అసంతృప్తిని గుర్తించి..
దళితులపై దృష్టి పెట్టి బీసీలను దూరం చేసుకుంటున్నారన్న అభిప్రాయం పెరగడంతో ఈ స్కీమ్ కు రూపకల్పన చేశారు. ఇప్పటికే గొర్రెల పంపిణీ రెండో విడత జరగకపోవడం.. అనేక పథకాలు నత్తనడకన సాగుతుండడంతో వారిలో అసంతృప్తి బహిరంగంగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో రైతుబంధు కేసీఆర్‌కు మరో విజయాన్ని ఇచ్చింది. మూడోసారి విజయం సాధించాలంటే అంత తేలికైన విషయం కాదు. అందుకే ఈసారి మరిన్ని స్కీమ్స్‌కు కేసీఆర్ రూపకల్పన చేస్తున్నారు. కానీ ఇలా ఒకవర్గాన్ని టార్గెట్ చేసి పథకాలు పెట్టడం వల్ల ఇతర వర్గాలు అసంతృప్తికి గురవుతున్నాయి. వారిని సంతృప్తి పరచడానికి మరో పథకం పెడుతున్నారు. నిజానికి కేసీఆర్ పెట్టే స్కీములన్నీ ప్రజలకు చేరవని.. ఓ పది మందికి ఇచ్చి ఆశ పెట్టి ఓట్లు పొందుతారని.. తర్వాత వదిలేస్తారని అంటున్నారు. దానికి దళిత బందు, డబుల్ బెడ్‌రూం ఇళ్లే సాక్ష్యమనే ఆరోపణలు ఉన్నాయి. మరి బీసీబంధు ఎంతమందికి ఇస్తారు.. బీసీలు బీఆర్‌ఎస్‌ను నమ్ముతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
