Botsa Satyanarayana: విజయనగరం బాద్ షా బొత్స సత్యనారాయణకు ఎదురుగాలి వీస్తోందా? దశాబ్దాలుగా జిల్లాను ఓంటిచేత్తో ఏలుతున్న ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా భయపడుతున్నారా? అందుకే పక్క చూపులు చూస్తున్నారా? సేఫ్ నియోజకవర్గం ఎంచుకునే పనిలో పడ్డారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయనగరం అంటే బొత్స.. బొత్స అంటే విజయనగరం అన్న రేంజ్ లో ముద్ర వేసుకున్నా.. ప్రస్తుతానికి ఆయన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రమంతటా ఒక ఎత్తు.. విజయనగరం ఒక ఎత్తు అన్న రేంజ్ లో బొత్స సీన్ క్రియేట్ చేయగలిగారు. అందుకే విజయనగరంలో రాజ్యలేలిన రాజులు, రాజవంశీయులు ఉన్నా.. వారికి ధీటైన కుటుంబ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవడంలో బొత్స సక్సెస్ అయ్యారు. అయితే ఆయన ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యానికి ఇప్పుడు బీటలు వారుతున్నాయి. కుటుంబంలో అగాధం ఏర్పడింది. ఫలితంగా అది వారి రాజకీయ కెరీర్ ను దారుణంగా దెబ్బతీస్తోంది.

Botsa Satyanarayana
యువజన కాంగ్రెస్ నాయకుడిగా కెరీర్ ప్రారంభించి దివంగత మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు ప్రోత్సాహంతో నాయకుడిగా ఎదిగారు బొత్స. అనతికాలంలోనే జిల్లా, రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఒకానొక దశలో సీఎం క్యాండిడెట్ గా కూడా పేరు వినిపించింది. 90వ దశకంలో విజయనగరం రాజుల అడ్డాలో గాజులరేగ వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడిగా పొలిటికల్ కెరీర్ ను ప్రారంభించిన బొత్స దశ మార్చింది మాత్రం 1999 ఎన్నికలు. నాడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఐదు ఎంపీ స్థానాలను దక్కించుకోగా.. అందులో బొత్స ఒకరు. బొబ్బిలి పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. దీంతో గురువు సాంబశివరాజును అధిగమించి కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిని ఆకర్షించగలిగారు. బొత్సలో ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారు. నాటి నుంచి ఒక్కో మెట్టు కట్టుకుంటూ కుటుంబ సామ్రాజ్యాన్నిఏర్పాటుచేసుకున్నారు.
2004 ఎన్నికల్లో తొలిసారిగా చీపురుపల్లి నుంచి పోటీచేసిన బొత్స మంచి విజయమే దక్కించుకున్నారు. అప్పటి నుంచి అదే నియోజకవర్గం నుంచి బరిలో దిగుతూ వస్తున్నారు. మధ్యలో 2014లో కిమిడి మృణాళిని చేతిలో ఓటమి చవిచూశారు. రాష్ట్ర విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన బొత్స చెప్పుకోదగ్గ ఓట్లను పొందగలిగారు. వైసీపీ అభ్యర్థికి తోసిరాజని రెండో స్థానంలో నిలిచారు. అటు తరువాత వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఈసారి చీపురుపల్లిలో ఆయనకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. అక్కడ మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జున పట్టుబిగుస్తున్నారు. సుదీర్ఘ కాలం మంత్రిగా ఉన్నా బొత్స నియోజకవర్గానికి ఏమిచేయాలేదన్న అసంతృప్తి ప్రజల్లోకి బలంగా వెళుతోంది. నిఘా వర్గాలు కూడా ప్రభుత్వానికి అదే విషయాన్ని చేరవేశాయి. అటుజగన్ సైతం నియోజకవర్గంపై కన్సంట్రేట్ చేయాలని బొత్సకు చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

Botsa Satyanarayana
అయితే ఒక్క చీపురుపల్లిలో కాదు.. బొత్స కుటుంబసభ్యలు ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లిమర్ల, గజపతినగరం నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. దీనికి బొత్స కుటుంబసభ్యుల మధ్య విభేదాలే కారణంగా తెలుస్తోంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కూడా బొత్సకు వరుసకు సోదరుడు అవుతారు. అక్కడ బొత్స మరో సోదరుడు లక్ష్మణరావు ఎంటరవుతున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా శిబిరం నడుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు కానీ.. తన కుమారుడికి కానీ టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ మీ రాజకీయ ఉన్నతికి కారణమయ్యాను… నాకు ఒక చాన్సివ్వండని కోరుతున్నారు. లేకుంటే అన్ని నియోజకవర్గాల్లో తన సత్తాచూపుతానని హెచ్చరిస్తున్నారు. దీంతో బొత్స కూడా సోదరుడు లక్ష్మణరావుకు మద్దతు తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి.దీంతో నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు బొత్స సోదరులపై హైకమాండ్ కు ఫిర్యాదుచేశారు. దీంతో బొత్స లక్మణరావు కాస్తా వెనక్కి తగ్గారు. అటు గజపతినగరం నియోజకవర్గంలో సైతం బొత్స మరో సోదరుడు అప్పలనర్సయ్య వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆయన కూడా ఎదురీదుతున్నారు.
అటు బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వ్యవహార శైలి మారింది. ఇన్నాళ్లూ నీడనేతగా ఉన్న ఆయన జడ్పీ చైర్మన్ అయ్యేసరికి స్వతంత్రంగా ఎదగాలని భావిస్తున్నారు. అందుకే తనకంటూ ప్రత్యేక శిబిరం నడుపుకుంటున్నారు. దీంతో బొత్స బలం కకావికలమవుతోంది. అటు చీపురుపల్లి నియోజకవర్గంలో విపక్షాలు బలం పెంచుకుంటున్నాయి. సెకెండ్ కేడర్ లో అసంతృప్తి నెలకొంది. పార్టీ నుంచి వలసలు పెరిగే చాన్స్ ఉంది. అందుకే ఈసారి చీపురుపల్లి నుంచి పోటీచేస్తే మాత్రం ప్రతికూల ఫలితం తప్పదని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అందుకే ఈసారి బొత్స విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి కన్నేసినట్టు వార్తలు వస్తున్నాయి. అక్కడ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు బొత్సతో పొసగదు. ఆ నియోజకవర్గంలో తూర్పుకాపు సామాజికవర్గం ఎక్కువ. అందుకే బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చి ఆయన్ను పక్కనపెట్టే ప్లాన్ చేస్తున్నారు. చివరి నిమిషంలో అక్కడ నుంచి బరిలో దిగేందుకు బొత్స ప్లాన్ చేస్తున్నారు. ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.