
khalistani leader amrit paul
Punjab: ఖళీస్థానీ ఉగ్రవాది బింద్రన్ వాలే తరహా వేషధారణతో, వారిస్ దె పంజాబీ సంస్థ మాటున కొన్నాళ్లుగా ప్రత్యేక వాదంతో అమృత్ పాల్ చెలరేగుతున్నాడు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ఆయన ప్రధాన అనుచరుడు అలియాస్ తుఫాన్ సింగ్ ను విడుదల చేయాలంటూ ఫిబ్రవరి 23న పెద్ద ఎత్తున మద్దతుదారులు తల్వార్లు, కర్రలతో అమృత్సర్ జిల్లాలోని అజ్ నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. దీంతో తప్పనిసరి లవ్ ప్రీత్ ను మరుసటి రోజు వదిలిపెట్టారు. తర్వాత అమృత్ పాల్ పై కేసు నమోదు అయింది.
ఖళీస్థానీ అంశంపై దివంగత ప్రధాని ఇందిరకు పట్టిన గతే కేంద్రమంత్రి అమిత్ షా కూ పడుతుందని అమృత్ పాల్ పదేపదే వ్యాఖ్యానించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ పాల్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. ముఖ్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అమృత్ పాల్ కు చెక్ పెట్టేందుకు గత కొద్దిరోజులుగా సమాలోచనలు చేస్తున్నారు. ఈనెల రెండున పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అప్పటికే అమృత్ పాల్ కు చెక్ పెట్టాలని నిర్ణయించారు . అయితే రాష్ట్రంలో జి20 ప్రాంతీయ సమావేశం ఉండడంతో పోలీసు యంత్రంగా దాదాపు నెల నుంచి ఓపిక పడుతోంది. శుక్రవారం అవి ముగియడంతో ప్లాన్ అమలుకు సిద్ధమైంది.
త్వరలోనే జలంధర్ ఉప ఎన్నిక కూడా ఉండటంతో ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. ఇందుకు కేంద్రం అదనపు బలగాలను పంపించింది. జలంధర్ జిల్లా సరిహద్దులను మూసివేసింది. అమృత పాల్ శనివారం పదుల సంఖ్యల వాహనాల కాన్వాయ్ తో షాకోట్ వెళ్తున్నట్టు తెలిసి మెహతాపూర్ వద్ద పోలీసులు అడ్డగించారు. అనుచరుల హెచ్చరికలతో అమృత్ వాహనం మారాడు.. నకోదార్ అనే ప్రాంతంలో పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఓ బైక్ పై అమృత్ పాల్ పరారైనట్టు చెబుతున్నారు. ఆయన ప్రధాన అనుచరులైన ఆరుగురుని అధువులకు తీసుకొని విచారిస్తున్నారు.

khalistani leader amrit paul
ఇక అమృత్ పాల్ కోసం పోలీసు బలగాలు వేట మొదలు పెట్టడంతో పంజాబ్ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోంశాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తుంది. పంజాబ్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.