Mahesh babu Comments: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తేనెతుట్టను కదిపారు. బాలీవుడ్ పై మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. బాలీవుడ్ జనాలకు మంటపుట్టిస్తున్నాయి. ఇప్పటికే హిందీ జనాలు, ప్రముఖులు మహేష్ వ్యాఖ్యలను ఖండించడం మొదలుపెట్టారు. బాలీవుడ్ ను తీసిపారేస్తూ ‘నన్ను అక్కడ భరించలేరని.. నా సమయం బాలీవుడ్ లో వృథా చేసుకోను.. టాలీవుడ్ నుంచే ప్యాన్ ఇండియా వెళతానంటూ’ మహేష్ బాబు చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ గా మారిపోయింది. ఇన్నాళ్లు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమాగా ఉన్న తంతును టాలీవుడ్ చెరిపేసింది. బాహుబలితో ప్యాన్ ఇండియా సినిమాగా మలిచింది. హిందీ సినిమాను చిన్నబుచ్చింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ను మరింతగా దిగజార్చేలా మహేష్ వ్యాఖ్యలు ఉండడం వారి పుండిమీద కారం చల్లినట్టైంది. అందుకే బాలీవుడ్ , జాతీయ మీడియా అంతా ఇప్పుడు మహేష్ బాబుపై పడిపోతున్నారు. ఇంతకీ మహేష్ బాబు ఏమన్నాడు? ఎందుకీ వివాదం రాజుకుందన్న దానిపై స్పెషల్ స్టోరీ..
-బాలీవుడ్ పై మహేష్ బాబు ఏమన్నాడు?
సర్కారివారి పాటతోపాటు తను నిర్మించిన ‘మేజర్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా జాతీయ మీడియాతో మహేష్ బాబు మాట్లాడారు. బాలీవుడ్ ఎంట్రీపై మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘బాలీవుడ్ నుంచి తనకు ఎన్నో ఆఫర్స్ వస్తున్నాయని.. కాకపోతే తన దృష్టి అంతా టాలీవుడ్ పై ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ మెచ్చుకునే స్థాయికి తెలుగు చిత్రపరిశ్రమ ఎదగాలని కలలు కన్నాను. బాహుబలి, ఆర్ఆర్ఆర్.. ఇలా పలు చిత్రాలతో ఆ కల సాకారమైనందుకు సంతోషిస్తున్నా.. బాలీవుడ్ నుంచి నాకెన్నో ఆఫర్స్ వచ్చాయి. కానీ వాళ్లు నన్ను భరించలేరనుకుంటున్నా.. అందుకే అక్కడికి వెళ్లి నా సమాయాన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదు. టాలీవుడ్ లో నాకు లభిస్తోన్న ప్రేమ అమితమైనది.. వాటిని వదిలి వేరే పరిశ్రమకు వెళ్లాలనుకోలేదు. ఇక్కడే సినిమాలు చేయాలని.. అవి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తే చూడాలనుకుంటున్నారు.. అదే నిజమైంది.. తెలుగు సినిమాలే నా బలం’ అని మహేష్ బాబు అన్నారు.ఇందులో వివాదం ఏమీ లేదు. మహేష్ హిందీ సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదని.. తెలుగులోనే కంఫర్ట్ అని మాత్రమే అన్నారు. హిందీ సినిమాలను ఎక్కడ అవమానించలేదు. కానీ కొందరు జాతీయ మీడియా దీన్ని వక్రీకరించి పెంటపెంట చేశారు. కాంట్రవర్సీని క్రియేట్ చేశారు. బాలీవుడ్ ను మహేష్ బాబు అవమానించారని అక్కడి మీడియా కోడై కూసింది. జాతీయ మీడియాలో బాలీవుడ్ ప్రేక్షకులు, ప్రముఖులు వీటిని తప్పుపట్టారు.
-గతంలో దక్షిణాదిని తొక్కేసిన బాలీవుడ్
ఒకప్పుడు భారతీయ సినిమా అంటే కేవలం హిందీ సినిమాగానే గుర్తించారు. అసలు దక్షిణాది సినిమాలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఓ హిందీ ఫంక్షన్ కోసం ముంబై వెళ్లిన చిరంజీవికి ఆ స్టేజీపై ఒక్క దక్షిణాది నటుల ఫొటోలు అతికించలేదట.. దాన్ని చాలా అవమానంగా ఫీలయ్యానని ఇటీవల ఆచార్య మూవీ ప్రీరిలీజ్ లో చిరంజీవి వాపోయారు. హిందీ సినిమాలు సూపర్ హిట్ అయ్యి స్వర్ణ యుగంగా ఉన్నప్పుడు అసలు తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ సినిమాలను చిన్న చూపు చూశారు. అసలు మనవి సినిమాలే కాదన్నట్టుగా హిందీ ప్రముఖులు ప్రవర్తించారు. కానీ ఓడలే బండ్లు అయ్యాయి.. హిందీ సినిమా వెలవెల బోతున్న వేళ.. దక్షిణాది ప్రభ వెలిగిపోతోంది.
-బాలీవుడ్ లో నో క్రియేటివిటీ.. దక్షిణాదికే హిందీ జనాల ఓటు
బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ నుంచి రణవీర్ సింగ్ వరకూ ఇటీవల కాలంలో అందరి సినిమాలు హిందీ జనాలను మెప్పించలేక అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. రణ్ వీర్ సింగ్ ‘83’ అయితే అసలు ఘోరంగా డిజిస్టర్ అయ్యింది. బాహుబలి దెబ్బకు అలా ట్రై చేసిన అమీర్ ఖాన్ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇలా ఒక్కటేమిటీ కథా బలం లేకుండా మూసగా తీస్తున్న బాలీవుడ్ సినిమాలను హిందీ జనాలు రిజెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో మంచి ప్యాన్ ఇండియా కంటెంట్ తో వస్తున్న దక్షిణాది సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అక్కున చేర్చుకుంటున్నారు. బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్2 ఇలా మన చిత్రాల దెబ్బకు హిందీ సినిమాలే రిలీజ్ లు వాయిదా వేసుకున్నాయి. మన కంటెంట్ కు హిందీ జనాలు మెస్మరైజ్ అవుతున్నారు. బాలీవుడ్ లో లోపించిన క్రియేటివిటీని మన దక్షిణాది ముఖ్యంగా తెలుగు దర్శకులు చూపించేసి హిందీలో రికార్డులు కొల్లగొడుతున్నారు. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. ‘పుష్ఫ తగ్గేదేలే’ అన్న ఫేమస్ డైలాగే మన క్రియేటివిటీ సినిమాలకు చక్కటి ఉదాహరణ. ఇది హిందీ జనాల్లోకి బాగా ఎక్కేసింది.
-కరోనా ఎఫెక్ట్.. మారిన జనాల తీరు..
కరోనా ఎఫెక్ట్ తో ప్రేక్షకుల అభిరుచి మారింది. ఆ ఖాళీ టైంలో అందరూ ఓటీటీ సినిమాలు చూసేసరికి వారిలో మార్పు వచ్చింది. మంచి కంటెంట్ ఉంటేనే సినిమాను ఆదరిస్తున్నారు అక్కున చేర్చుకుంటున్నారు. అందుకే మూస హిందీ సినిమాలు ఇప్పుడక్కడ వరుసగా విఫలమవుతుంటే.. మన వాళ్ల డిఫెరెంట్ మూవీలు వరుసగా హిట్స్ కొడుతున్నాయి. ఇప్పటికైనా హిందీ జనాలు ఇతర భాషల సినిమాలపై కత్తిగట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా హిందీ సినిమాల్లో కంటెంట్ పెంచితే బాగుంటుందని పలువురు హితవు పలుకుతున్నారు.
-ఇప్పటికే రగిలిపోతున్న బాలీవుడ్ హీరోలు, మీడియా
హిందీ సినిమాలు ఫ్లాప్ కావడం.. తెలుగు , కన్నడ సినిమాలు దేశమంతా భారీ హిట్స్ కావడంతో బాలీవుడ్ హీరోలు, మీడియా రగిలిపోతోంది. మన రాధేశ్యామ్ కాస్త తేడా కొట్టగానే ఫ్లాప్ అంటూ తొక్కేసింది. ఇక ‘కేజీఎఫ్2’కు మద్దతుగా కన్నడ హీరో కిచ్చా సుదీప్ సైతం ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. దీనికి అజయ్ దేవగణ్ కౌంటర్ ఇస్తూ ‘జాతీయ భాష కానప్పుడు హిందీలో ఎందుకు మీ సినిమాలు డబ్ చేస్తున్నారు?’ అంటూ ప్రశ్నించాడు. హిందీ ఎప్పటి నుంచో ఉంది అంటూ అజయ్ దేవగణ్ కౌంటర్ ఇచ్చాడు. ఇలా మొదలైన వివాదం ఇప్పుడు మహేష్ బాబు వ్యాఖ్యలతో మరోసారి నిప్పు రాజేసినట్టైంది. ఇలా బాలీవుడ్ సినిమా స్థాయి తగ్గిందని మనవాళ్లు అనడంతో హిందీ జనాలు భరించలేని స్థితికి దిగజారారు.
-మహేష్ అందుకే అన్నాడా? దుమారంతో వివరణ
బాలీవుడ్ ఒకప్పుడు తెలుగు సినిమాలను చిన్నచూపు చూసింది. అయితే ఇప్పుడు ట్రైయిన్ రివర్స్ అయ్యింది. మన సినిమా ప్రపంచవ్యాప్తమైంది. అందుకే మహేష్ బాబు ఆ ధైర్యంతోనే బాలీవుడ్ పై ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే మహేష్ చెప్పిన మాటల్ని కొంతంమంది తప్పుగా అర్థం చేసుకొని వివాదాస్పదం చేశారు. అందుకే మహేష్ టీం తాజాగా వివరణ ఇచ్చింది. ‘మహేష్ కు అన్ని భాషలు సమానమేనని అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగులో సినిమాలు చేస్తుండడంతో మిగతా పరిశ్రమలతో పోలిస్తే తాను ఇక్కడ సౌకర్యవంతంగా ఫీలవుతున్నానని మాత్రమే అన్నారని.. రాజమౌళి తో తదుపరి చేసే సినిమా ప్యాన్ ఇండియా చిత్రమంటూ’ మహేష్ టీం ఈ వివాదాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది.
మొత్తంగా బాలీవుడ్ జనాలకు ఇప్పుడు దక్షిణాది సినిమాల సెగ తగులుతోంది. వారి నంబర్ 1 పీటం కదులుతోంది. అందుకే మన హీరోలు ఏ చిన్న మాట అన్నా వివాదాన్ని రాజేసి చలికాచుకుంటున్నారు.. తట్టుకోలేకపోతున్నారు. మొన్న కన్నడ హీరోసుదీప్, నేడు మహేష్ వ్యాఖ్యలను భరించలేకపోతున్నారు. ఈ ఉక్కపోతే బాలీవుడ్ సినిమాలు విఫలమవుతున్నందుకా? లేక మన దక్షిణాది సినిమాలు హిట్ అవుతున్నందుకా? అన్నది తెలియాల్సి ఉంది.
Recommended Videos